స్వచ్ఛందంగా ముందుకు రండి.. సీఎం జగన్‌ అభ్యర్థన

ఢిల్లీలో జమాత్‌ సదస్సుకు వెళ్లిన వారినుద్దేశించి ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ కీలక ప్రకటన చేశారు. ఢిల్లీ వెళ్లి వచ్చిన వారికి కరోనా వైరస్‌ సోకుతుండడంతో ఈ రోజు ఆయన అత్యవసర సమీక్ష జరిపారు. ఈ ఒక్కరోజే 17 మందికి పాజిటివ్‌ వచ్చింది. ఢిల్లీ వెళ్లిన వారు, వారిని కలిసిన వారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన వైద్య పరీక్షలు జరిపించుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీని వల్ల ఎవరికీ ఎలాంటి నష్టం జరగదని, ఆరోగ్యం మెరుగుపడుతుందని వివరించారు.

ఢిల్లోని నిజాముద్దీన్‌లో జరిగిన జమాత్‌కు వెళ్లి వచ్చిన వారికి కరోనా సోకుతోంది. దేశ, విదేశాల నుంచి వచ్చిన వారు ఒక్కచోట చేరడంతో వైరస్‌ ప్రభలుతోంది. ఆ సదస్సుకు ఏపీలోని 9 జిల్లాల నుంచి 500 మంది వెళ్లారని అంచనా వేస్తున్నారు. నాలుగు రోజుల క్రితం గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఆ సదస్సుకు వెళ్లి వచ్చిన వారికి కరోనా లక్షణాలు బయటపడడంతో పరీక్షలు చేశారు. పాజిటివ్‌ రావడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఏపీలో పాజిటివ్‌ కేసులు తక్కువగా (13) ఉన్నాయనుకుంటున్న సమయంలో ఈ ఘటన వెలుగు చూసింది. దీంతో ఒక్కసారిగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరిగింది. ప్రస్తుతం ఏపీలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 40కు చేరుకోగా.. అందులో రెండొంతుల మంది ఢిల్లీకి వెళ్లి వచ్చిన వారే కావడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది.

ఇలాంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో సీఎం వైఎస్‌ జగన్‌ వైద్య, పోలీసు శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు. వైద్య, పోలీసు శాఖలు సంయుక్తంగా ఢిల్లీ సదస్సుకు వెళ్లిన వారిని గుర్తించాలని ఆదేశించారు. వారికి గుర్తించి, అవసరమైన వైద్య సదుపాయాలు కల్పించాలని పేర్కొన్నారు.

నిజాముద్దీన్‌ జమాత్‌ సదస్సుకు వెళ్లిన వారి వివరాలు సేకరించే పనిలో పోలీసులు నిమగ్నమై ఉన్నారు. ఇప్పటికే సదస్సు నిర్వాహకులు, రైల్వే శాఖల నుంచి కొంత సమాచారం సేకరించిన అధికారులు సదరు వ్యక్తులను గుర్తించే పనిలోపడ్డారు. వారితోపాటు వారి కుటుంబీకులు, చుట్టుపక్కల వారికి కూడా వైద్య పరీక్షలు నిర్వహించే ఉద్దేశంతో వైద్యశాఖ అధికారులున్నారు. సదస్సుకు వెళ్లి వచ్చి 15 రోజులు కావస్తున్న తరుణంలో వారు స్థానికంగా ఎంతమందితో సన్నిహితంగా మెలిగారనేదానిపై సర్వత్రా ఆందోళన నెలకొంది. ఈ నెల 22 జనతా కర్ఫ్యూ నుంచి లాక్‌డౌన్‌ అమలువుతోంది. అంతకు వారం రోజులు ముందే వారు ఢిల్లీ నుంచి తిరిగి వచ్చారు. వీరందిరిని గుర్తించడం అధికారులకు సవాల్‌తో కూడుకున్నది. అందుకే స్వచ్ఛందంగా ముందుకు రావాలని సీఎం జగన్‌ కోరారు. సీఎం సూచనను పరిగణలోకి తీసుకుని వారందరూ వైద్య పరీక్షలకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Show comments