Idream media
Idream media
చేసే పని ఏదైనా పరిస్థితులకు అనుగుణంగా ఉండాలి. పెట్టే ఖర్చుకు విలువ ఉండాలి.. కరోనా విపత్కర వేళ ఏపీ సీఎం జగన్ అటువంటి నిర్ణయమే తీసుకున్నారు. ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్ల ఏర్పాటుకు భారీగా నిధులు కేటాయించారు. రూ.309.87 కోట్లు కేటాయిస్తూ వైద్యారోగ్యశాఖ స్పెషల్ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. 49 చోట్ల ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేయడంతో పాటు, 50 క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్ వాహనాలను ప్రభుత్వం కొనుగోలు చేయనుంది. 10 వేల అదనపు ఆక్సిజన్ పైప్‌లైన్ల ఏర్పాటు చేయనుంది. ఆక్సిజన్ ప్లాంట్ల నిర్వహణ కోసం ప్రతి జిల్లాకు వచ్చే 6 నెలలకు రూ.60 లక్షలు ప్రభుత్వం మంజూరు చేసింది.
కొవిడ్ నియంత్రణ, చికిత్స పై మొదటి నుంచీ అందరి కంటే ముందే స్పందిస్తున్న జగన్ యుద్ధ ప్రాతిపదికన కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రైవేటు ఆస్పత్రుల స్వాధీనం, కరోనాను కూడా ఆరోగ్య శ్రీ పరిధిలోకి తేవడం, ఆస్పత్రులకు సమీపంలోనే కొవిడ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేయడం వంటి చర్యలు ఇప్పటికే ఫలితాలు ఇస్తున్నాయి. కరోనా చావులకు అధిక కారణం ఆక్సిజన్ అందకపోవడమేనని గుర్తించిన ఏపీ ప్రభుత్వం ఆక్సిజన్ సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇక మీదట ఆక్సిజన్ లేక మనిషి ప్రాణాలు పోగొట్టు కునే పరిస్థితి రాకూడదనే ఆశయంతో యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంది.
అలాగే ఈ మొత్తం వ్యవహారాన్ని ఎప్పటికప్పుడు సమన్వయపరుస్తూ, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసేందుకు ఆక్సిజన్ సరఫరా పర్యవేక్షణ ఇంఛార్జ్‌గా స్పెషల్ సీఎస్ కరికాల వలవన్‌కు ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి ఆక్సిజన్ దిగుమతిని ఆయన పర్యవేక్షిస్తారు. రోగుల ఆర్తనాధాలను విన్న జగన్ సర్కార్ …వెంటనే అప్రమత్తమై ఆక్సిజన్ సరఫరాకు చర్యలు తీసుకోవడం ప్రశంసలు అందుకుంటోంది. ఇప్పటి వరకూ పడిన ఇబ్బందులను పక్కన పెడితే, ఇక మీదట ఆక్సిజన్ సమస్య ఉత్పన్నం కాకుండా సత్వర చర్యలు చేపట్టడం అభినందనీయమని పలువురు ప్రశంసిస్తున్నారు.
రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. రెమ్‌డెసివర్‌పై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని, హెల్ప్‌లైన్ ద్వారా బాధితులకు అండగా ఉంటున్నామని చెప్పారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… ‘‘ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అడ్మిషన్లు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. రాష్ట్రంలో 637 హాస్పిటల్స్‌లో కోవిడ్ చికిత్స అందిస్తున్నాం.13,461 ప్రవేట్ హాస్పిటల్స్‌లో రేమ్‌డేసివర్ అందుబాటులో ఉన్నాయి. 104 కాల్ సెంటర్‌కు 16, 905 కాల్స్ వచ్చాయి. ఇప్పటి వరకు 2 లక్షలు 8 వేల మంది కాల్స్ చేశారు. 45 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్ అందించాలని నిర్ణయించుకున్నాం. కొవిన్ యాప్‌లో మార్పులు చేయాలని కేంద్రాన్ని కోరాం.. అంగీకరించింది. కోవిడ్ సమయంలో పనిచేసిన వారికి రెగ్యులర్ రిక్రూట్ మెంట్లో ప్రాధాన్యత కల్పిస్తూ జీవో జారీ చేశాం. 15% వెయిటేజ్ ఇవ్వాలని నిర్ణయించాం.’’న్నారు.