iDreamPost
android-app
ios-app

CJI NV Ramana, CM YS Jagan – చీఫ్‌ జస్టిస్‌కు రాష్ట్ర ప్రభుత్వం తేనీటి విందు

CJI NV Ramana, CM YS Jagan – చీఫ్‌ జస్టిస్‌కు రాష్ట్ర ప్రభుత్వం తేనీటి విందు

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ రాష్ట్ర పర్యటన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం మర్యాదపూర్వకంగా ఆయనకు తేనీటి విందు ఏర్పాటు చేసింది. ఈ రోజు సాయంత్రం ఐదు గంటలకు విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ విందుకు హాజరైన జస్టిస్‌ ఎన్‌వీ రమణకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి స్వాగతం పలికారు. ఈ విందుకి జస్టిస్‌ ఎన్‌వీ రమణతోపాటు పలువురు సుప్రీం కోర్టు న్యాయమూర్తులు, రెండు తెలుగు రాష్ట్రాల హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు, న్యాయమూర్తులు, ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రులు, మంత్రులు హాజరయ్యారు. 

కాగా, అంతకుముందు సీజేఐ ఎన్వీ రమణ దంపతులు విజయవాడ దుర్గమ్మ సేవలో పాల్గొన్నారు. జస్టిస్‌ ఎన్వీ రమణ సంప్రదాయ వస్త్రధారణలో ఇంద్రకీలాద్రికి వచ్చారు. ఇంద్రకీలాద్రిపై రమణ దంపతులకు వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయ అధికారులతో పాటు ఎంపీ కేశినేని నాని, మంత్రి పేర్ని నాని, కలెక్టర్ నివాస్, దేవాదాయ కమిషనర్ హరి జవహర్ లాల్ ఎన్వీ రమణను స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి దర్శనానంతరం వేద పండితుల చేత వేద ఆశీర్వచనం అందుకున్నారు.

జస్టిస్ ఎన్వీ రమణ తేనీటి విందుకు తర్వాత సిద్ధార్థ అకాడమీలో రోటరీ క్లబ్‌లో పౌర సన్మానం స్వీకరిస్తారు.. అనంతరం రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇచ్చే విందుకు హాజరవుతారు.

ఆదివారం సీజేఐ విజయవాడలోని కానూరు సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజీలో జరిగే కార్యక్రమానికి హాజరవుతారు. అనంతరం నాగార్జున విశ్వ విద్యాలయంలో జరిగే జ్యుడీషియల్ ఆఫీసర్ల కాన్ఫరెన్సులో పాల్గొంటారు. మధ్యాహ్నం హైకోర్టు ఆవరణలో బార్ అసోసియేషన్, స్టేట్ బార్ కౌన్సిల్ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం ఐదు గంటలకు గవర్నర్ ఇచ్చే తేనీటి విందుకు హాజరవుతారు. అనంతరం బెజవాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సన్మానం కార్యక్రమానికి వెళతారు. ఆ తర్వాత విజయవాడ నుంచి హైదరాబాద్‌కు బయల్దేరతారు.

Also Read : గర్వపడేలా పని చేస్తా.. జస్టిస్‌ ఎన్‌వీ రమణ