iDreamPost
android-app
ios-app

ఓవరాక్షన్ సినిమాకు ఘోర పరాభవం

  • Published Dec 24, 2022 | 5:00 PM Updated Updated Dec 24, 2022 | 5:00 PM
ఓవరాక్షన్ సినిమాకు ఘోర పరాభవం

2022లో చెప్పుకోదగ్గ స్ట్రెయిట్ హిట్ లేక ఆలో లక్ష్మణా అంటూ శోకాలు పెడుతున్న బాలీవుడ్ నెత్తి మీద మరో పిడుగు పడింది. నిన్న విడుదలైన సర్కస్ దారుణమైన రివ్యూలతో పాటు ఆడియన్స్ నుంచి యునానిమస్ తిరస్కారం అందుకుంది. 2022లో అతి చెత్త సినిమాల్లో దీనికి అవార్డు ఇవ్వొచ్చని క్రిటిక్స్ మాములుగా ఉతికి ఆరేయడం లేదు. దీని దర్శకుడు రోహిత్ శెట్టి ఇటీవలే ఒక టాక్ షోలో హిందీ సినిమాల గొప్పదనం గురించి డబ్బాలు కొడుతూ మన దక్షిణాది పరిశ్రమ మీద స్టాండర్డ్స్ గురించి నేరుగా పేర్లు ప్రస్తావించకుండా సెటైర్లు వేయడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. కాపీ రీమేకులు చేసుకునే ఈయనగారు అన్న మాటలవి

సరే ఇంత క్లాస్ తీసుకున్నాడు కాబట్టి సర్కస్ లో ఏదో అద్భుతం చూపిస్తాడని అందరూ ఆశించారు. దానికి భిన్నంగా అరిగిపోయిన పాత చింతకాయ పచ్చడి లాంటి కన్ఫ్యుజింగ్ డ్రామాతో జనాల మతులు పోగొట్టి థియేటర్ కు ఎందుకొచ్చామురా బాబు అని తలలు బాదుకునేలా చేశాడు. ఇందులో రణ్వీర్ సింగ్ డబుల్ యాక్షన్. ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన మరో ఆర్టిస్టు కూడా డబుల్ ఫోటో. రెండు వేర్వేరు చోట్ల పెరిగిన ఈ కవలల అయోమయం వ్యవహారమే ఈ సినిమా కథ. కిచిడి కామెడీతో అర్థం పర్థం లేకుండా అసలే నవ్వు రాని జోకులతో రెండున్నర గంటల పాటు నిర్మాతల కోట్ల రూపాయల పెట్టుబడిని తన స్వంత పైత్యం అతి తెలివితో హారతి కర్పూరం చేశాడు.

గత ఇరవై ఏళ్లుగా చూస్తూ చూస్తూ విసిగెత్తిపోయిన ఫార్మట్ లోనే మళ్ళీ సర్కస్ ని తీయడం దెబ్బ కొట్టింది. అన్నట్టు ఇందులో పూజా హెగ్డే కూడా ఉందండోయ్. ఏదో అక్కడ జెండా పాతెద్దామని ట్రై చేస్తున్న పూజాకు మరో ప్రాధాన్యం లేని పాత్ర దక్కింది. భార్య దీపికా పదుకునేతో రణ్వీర్ సింగ్ డాన్స్ చేసే స్పెషల్ సాంగ్ ఒకటే అంతో ఇంతో ఊరట కలిగిస్తుంది. ఈ మధ్య ఓవరాక్షన్ కి కేరాఫ్ అడ్రెస్ గా మారిన రణ్వీర్ ఇందులో అంతకు మించి అనేలా రూపాయికి యాభై రూపాయల ఓవర్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. సంగీతం, పాటలు, కెమెరా వర్క్, విజువల్ ఎఫెక్ట్స్ దేనికవే అన్నీ తీసికట్టుగా సాగాయి. జయేష్ బాయ్ జోర్దార్ కంటే పెద్ద డిజాస్టర్ గా సర్కస్ నిలవబోతోంది