iDreamPost
iDreamPost
ఉమ్మడి మద్రాస్ రాష్ట్రం ఉన్నప్పుడే చిత్రసీమ అంతా మద్రాసులోనే ఉండేది. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత హైదరాబాదుకు తరలి వెళ్లింది. ఇక తెలంగాణ, ఆంధ్ర వేర్వేరు రాష్ట్రాలుగా విడిపోవడంతో ఆంధ్ర ప్రాంతంలోనూ స్టూడియోలు ఏర్పాటు చేసి చిత్ర నిర్మాణం చేపట్టాలన్న డిమాండ్ నానాటికీ పెరుగుతోంది. విశాఖలో ప్రస్తుతం ఒక స్టూడియో ఉన్నా.. చిత్రసీమ హైదరాబాదుకు రాకముందే విశాఖలో ఒక స్టూడియో ఉండేదన్న విషయం చాలామందికి తెలియదు. దాదాపు తొమ్మిది దశాబ్దాల క్రితమే ఆంధ్ర సినీటోన్ పేరుతో సాగర నగరిలో ఏర్పాటైన ఆ స్టూడియోలో రెండు చిత్రాల నిర్మాణం కూడా జరిగింది. తర్వాత కాలంలో నగరం ఔట్ డోర్ షూటింగులకు నిలయంగా మారినా పూర్తిస్థాయి చిత్ర నిర్మాణం మాత్రం జరగడం లేదు.
85 ఏళ్ల క్రితమే నిర్మాణం
చిత్ర పరిశ్రమ మద్రాసులో ఉన్న కాలంలోనే ప్రకృతి అందాలకు నిలయమైన విశాఖలో స్టూడియో నిర్మించాలని నగరానికి చెందిన గొట్టిముక్కల జగన్నాధరాజు సంకల్పించారు. కాంగ్రెస్ నాయకుడు, లాయర్ అయిన ఆయనకు సాగి సూర్యనారాయణ రాజు తోడయ్యారు. ఇద్దరూ కలిసి 1936లో ఆంధ్రా సినీటోన్ పేరుతో సీతమ్మధార ప్రాంతంలో స్టూడియో నిర్మించారు. అప్పట్లో విశాఖనగరం అంటే వన్ టౌన్ నుంచి జగదాంబ జంక్షన్ వరకే ఉండేది. సీతమ్మధార శివారు ప్రాంతంగా ఉండేది. అక్కడ స్టూడియో నిర్మించారు. బెంగాల్ నుంచి సినీ కార్మికుల, సాంకేతిక నిపుణులను రప్పించారు. తొలి చిత్రంగా వారిద్దరే నిర్మాతలుగా వ్యవహరించి భక్త జయదేవ నిర్మించారు. బెంగాలీ దర్శకుడు హీరేన్ బోస్ దీనికి దర్శకత్వ, సంగీత బాధ్యతలు నిర్వర్తించారు.
ఈ సినిమా 1939లో విడుదల అయ్యింది. రెండో ప్రయత్నంగా పాశుపతాస్త్రం సినిమా తీశారు. ఈ రెండింటి వల్ల నష్టాలు రావడంతో సినీ నిర్మాణం నిలిపివేశారు. కాలక్రమంలో స్టూడియో కూడా మూతపడింది. ఆ స్థలంలోనే తర్వాత కాలంలో ఈనాడు కార్యాలయం ఏర్పాటైంది. కోర్టు తీర్పు నేపథ్యంలో దానిని కూడా ఇప్పుడు వేరే ప్రాంతానికి తరలించారు. ఆంధ్ర సినీటోన్ కు ముందే రాజమండ్రిలో దుర్గా సినీటోన్ పేరుతో ఒక స్టూడియో ఉండేది. రాష్ట్రంలో అది మొదటిది కాగా విశాఖ స్టూడియో రెండోదిగా పేరు పొందింది అని విశాఖకు చెందిన చరిత్రకారుడు విజ్జేశ్వరం ఏడ్వర్డ్ పాల్ ద్వారా తెలుస్తోంది.
షూటింగులకు ఆనాడే బీజం
ఆంధ్రా సినీటోన్ ఎక్కువకాలం మనుగడ సాగించలేకపోయినా సినిమా షూటింగులకు విశాఖ, చుట్టుపక్కల ప్రాంతాలు చాలా అనుకూలమైనవన్న విషయం పరిశ్రమ వర్గాలకు తెలిసేలా చేసింది. అప్పట్లో ఔట్ డోర్ షూటింగులు చాలా తక్కువగా జరిగేవి. అయినా సరే విశాఖ ప్రాంతంలో షూటింగులకు రావడం మొదలైంది. 1960ల్లోనే కులగోత్రాలు, ప్రాణమిత్రులు సినిమాల్లో కొన్ని సన్నివేశాలు ఇక్కడ షూట్ చేశారు. అప్పటి నుంచి ఔట్ డోర్ షూటింగులకు విశాఖ నగరం, జిల్లా నిలయంగా మారాయి. 1978లో తమిళ దర్శకుడు బాలచందర్ మరోచరిత్ర సినిమా మొత్తాన్ని విశాఖ, భీమిలి ప్రాంతాల్లోనే తీశారు. ఇక జంధ్యాల తన సినిమాల్లో అధికభాగం విశాఖలోనే తీసేవారు.
దీనికితోడు విశాఖలో తీస్తే సినిమా హిట్ అవుతుందన్న సెంటిమెంటు కూడా నిర్మాతలను, హీరోలను విశాఖ వైపు రప్పిస్తోంది. ప్రస్తుతం నిత్యం ఏదో ఓ చోట సినిమా షూటింగులు జరుగుతూనే ఉంటాయి. 2008లో ప్రముఖ నిర్మాత రామానాయుడు బీచ్ రోడ్డులోని తిమ్మాపురం కొండపై 35 ఎకరాల్లో స్టూడియో నిర్మించారు. ఆ స్టూడియోలో తెలుగు, ఒడియా, కన్నడ, బెంగాలీ సినిమా షూటింగులు జరుగుతుంటాయి. విశాఖలో ఎక్కువగా లో బడ్జెట్ సినిమాలు, షార్ట్ ఫిల్మ్ లు, వెబ్ సిరీస్ నిర్మాణాలు జరుగుతున్నాయి. మరిన్ని స్టూడియోలు ఏర్పాటైతే అందాల విశాఖ నగరం సినీ రాజధానిగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది.