Idream media
Idream media
సినిమా బండి ఓ అద్భుతమైన సినిమా. డైరెక్టర్లు నగరాల్లో జీవిస్తూ, నగరవాసుల జీవితం కథా వస్తువుగా ఉన్న అనేక సినిమాల మధ్య అపుడప్పుడు మే నెలలో చిరుజల్లులా ఇలాంటివి వస్తూ ఉంటాయి. సమీక్షలు చాలా మంది రాసేశారు. కొందరికి నచ్చింది, కొందరికి నచ్చలేదు. ఏముంది దీంట్లో అన్నవాళ్లున్నారు. అవన్నీ పక్కన పెడితో నాకెందుకు కనెక్ట్ అయ్యిందో చెబుతా.
టైటిల్ చూడగానే నా చిన్నప్పటి సినిమా బండి గుర్తుకొచ్చింది. ఒంటెద్దు బండికి చప్పరం వేసి (త్రిభుజాకారం) అటుఇటు పోస్టర్లు, ముగ్గురు తప్పెట వాయించేవాళ్లు. మైకులో పాటలు హంగామాగా వచ్చేది. కొత్త సినిమా అయితే ఉదయం, సాయంత్రం వచ్చేది. దసరాబుల్లోడికైతే పులివేషాలు కూడా! దాని కోసం రోజూ ఎదురు చూసేవాళ్లం.
సినిమా Opening లో వినిపించిన యాసతో ఆనందం , ఆశ్చర్యం కలిగింది. అది కుప్పం, రామకుప్పం ప్రాంతాల భాష. కర్నాటక బార్డర్ తెలుగు. చిన్నప్పుడు రాయదుర్గంలో ఆ భాషలోనే పుట్టి పెరిగాను. అయితే భాష గొప్పతనం ఏమంటే అది ప్రతి 60 కిలోమీటర్లకి సొగసు మార్చుకుంటుంది. బళ్లారిలో మాట్లాడే తెలుగు , రాయచూరులో మాట్లాడే తెలుగు ఒక్కలా ఉంటాయి కానీ పలకడంలో చాలా తేడాలుంటాయి. చిత్తూరు నుంచి వెళ్లి బెంగళూరులో స్థిరపడిన వాళ్ల యాస సినిమాల్లో వినిపిస్తుంది. తెలుగులో ఎంఏ చేయడం వల్ల నాకు మాండలికాలపై శ్రద్ధ ఎక్కువ.
మొదటిసారి ఈ యాసని పాతికేళ్ల క్రితం తిరుపతిలో విన్నా. ఆంధ్రజ్యోతిలో నైట్ డ్యూటీలో వుండగా ఒక కుర్రాడు వచ్చాడు. ఎత్తుగా, లావుగా వున్నాడు.
“ఇజలాపురం బాబు పంపిడ్సినాడు , మీరు ఇది ఎయల్ల” అని ఒక ప్రకటన ఇచ్చాడు. ఇజలాపురం బాబు మోస్ట్ వాంటెడ్ నక్సలైట్. ఆయన తలపై రివార్డు ఉంది.
“ఇంత ధైర్యంగా వచ్చావ్, భయమేయలేదా?” అడిగాను.
“ఊరుకోండి సార్, భయంతో ఎన్ని దినాలు బతకతాం” అన్నాడు.
ఆ ప్రకటనలో పోలీసులు అన్యాయంగా పేద ప్రజల్ని హింసిస్తున్నారని , మానుకోకపోతే ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరిక వుంది.
“నాగలి పట్టుకుంటే బతికేకి అయ్యేలేదు సార్, పోలీసోళ్లు దొంగ కేసులు పెడతారు. కోర్టుకు పోయేంత దుడ్డు లేదు, అందుకే గన్ పట్టుకుండాం” అన్నాడు.
ఆ ప్రకటననే అచ్చు వేశాను. మరుసటి రోజు రామకుప్పం రిపోర్టర్ రాజు ఫోన్ చేశాడు.
“ఆ ప్రకటన ఎవరు ఇచ్చిడ్సినారు” అన్నాడు.
బాబు మనిషి ఇచ్చాడని చెప్పాను. ఎలా వుంటాడని అడిగితే చెప్పాను.
“మీరు ఏమారినారు సార్, వాడే బాబు” అన్నాడు. నేను షాక్. సాయంత్రం బస్సు పార్సిల్‌లో ఫొటో చూస్తే Confirm. మోస్ట్ వాంటెడ్ నక్సలైట్ కూల్‌గా వచ్చి అరగంట మాట్లాడి వెళ్లాడు. తర్వాత ఈయన లొంగిపోయి తెలుగుదేశంలో చేరినట్టు గుర్తు.
సినిమా బండిలో పాత్రలు పల్లెటూరి అమాయకులు. ఒక కెమెరా దొరికితే సినిమా తీయాలనుకుంటారు. ఈ రోజుల్లో కూడా మరీ ఇంత ఇదిగా ఉంటారా అంటే ఉంటారు. సినిమాలో ఉన్న మాయ అది. సినిమా ఆఫీసుల్లో పనిచేసే చాలా మంది కుర్రాళ్లు నాకు తెలుసు. పల్లెటూళ్లో సినిమా పిచ్చి ముదిరి హైదరాబాద్ వచ్చేస్తారు. వాళ్లకి సినిమా చూడడమే తప్ప తీయడం తెలియదు. నేర్చేసుకుంటామనుకుని ఆఫీస్ బాయ్స్‌గా పని చేస్తూ వుంటారు. తిరిగి ఊరికెళితే అవమానమని ఇక్కడే కిందామీదా పడుతుంటారు. నూటికి ఒక్కడు కూడా వీళ్లలో డైరెక్టర్ కాలేడు. కానీ ఆ విషయం తెలుసుకోలేరు. సినిమా కథల్లో లాజిక్ వుండదు, అదే విధంగా సినిమా పిచ్చికి కూడా లాజిక్ వుండదు.
సినిమా బండిలో సినిమా తీసి డబ్బు సంపాయిద్దామనుకుని దిగుతారు. చివరికి అది వర్కౌట్ కాదు, అదే విధంగా ఆ స్క్రిప్ట్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. ఇవి వదిలేస్తే బిగినింగ్ నుంచి END వరకు సున్నితమైన కామెడీ నడుస్తూ వుంటుంది. నటులెవరికీ కూడా ముందర కెమెరా వుందని గుర్తు లేదు. సహజంగా అనే పదం కూడా కరెక్ట్ కాదు, దానికి మించి వాడాలి.
వెనుకటికి బాబు అని ఒక ప్రెస్ ఫొటోగ్రాఫర్ ఉండేవాడు. శవాలు తీయడంలో Expert. మనుషులు కదిలితే సరిగా తీయలేడు. సినిమాలో ఫొటోగ్రాఫర్ క్యారెక్టర్ అదే టైప్. మనోడు టైటానిక్ స్పెషలిస్ట్. హీరో బిల్డప్ ఇచ్చే మరిడయ్యల్ని చాలా మందినే చూశాను. మా ఇంటి దగ్గర ఒక కుర్రాడు టీవీలో వచ్చే సినిమాని చూస్తూ కటింగ్, షేవింగ్ చేస్తాడు. మన రక్తం కళ్ల చూడకుండా వదలడు. అంత సినిమా పిచ్చి.
మంగ క్యారెక్టర్ వేసిన అమ్మాయి, కూరగాయలు అమ్మేవాళ్ల బాడీ లాంగ్వేజీని పట్టేసింది. సీరియస్ యాక్టింగ్‌తో పగలబడి నవ్వించింది.
ఆటో డ్రైవర్ Expressions అదుర్స్. మెచ్యూర్ Acting. ఆశనిరాశల్ని పలికించిన తీరు అద్భుతం.
దర్శకుడు ప్రవీణ్ కాండ్రేగుల బలం పల్లెటూరు, పాత్రల పరిశీలన శక్తి. రెండో సినిమాకి రొటీన్‌లో పడతాడో, ఇంకో మంచి సినిమాని తీస్తాడో చూడాలి.