iDreamPost
android-app
ios-app

సీఎం జగన్ ను కలసిన సినీ ప్రముఖులు

సీఎం జగన్ ను కలసిన సినీ ప్రముఖులు

మన దేశంలో బాలీవుడ్ తర్వాత మళ్లీ అంత పెద్ద ఇండస్ట్రీ టాలీవుడ్ అనే చెప్పాలి. అయితే తెలుగు సినిమా ఇండస్ట్రీకి రెండు తెలుగు రాష్ట్రాలకు మంచి ఆదాయం వస్తోంది. అయితే గతంలో ఉమ్మడి రాష్ట్రంలో సినిమా పరిశ్రమ నుంచి వచ్చే ఆదాయం ఒక్కటిగానే ఉండేది. రాష్ట్రం విడిపోయాక రెండు రాష్ట్రాలకూ ఆదాయం లభిస్తోంది. అందుకే సినీ ఇండస్ట్రీనుంచి ఎవరు వచ్చి ముఖ్యమంత్రులను కలిసినా ఆహ్వానిస్తున్నారు. అయితే ఏపీలో జగన్ ముఖ్యమంత్రి అయి చాలాకాలం గడిచినా సినీ ఇండస్ట్రీనుంచి శుభాకాంక్షలు తెలపడానికో ఇండస్ట్రీ పరిస్థితులు వివరించడానికో లేదా మరే ఇతర కారణాలతోనే పెద్దగా ఎవరూ ముందుకు రాలేదు. ఈ నేపధ్యంలో జగన్ సీఎం కావడం టాలీవుడ్ ప్రముఖులకు ఇష్టం లేదంటూ 30ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్విరాజ్ సంచలన వ్యాఖ్యలు చేసారు.

ఆ తర్వాత ఇండస్ట్రీనుంచి మెగాస్టార్ చిరంజీవి ఏకంగా కుటుంబంతో సహా ముఖ్యమంత్రిని కలిసారు. కొద్దిసేపు చిరంజీవి జగన్ సినీ ఇండస్ట్రీ గురించి చర్చించుకున్నారు. సైరా సినిమా చూడాలని జగన్ ని కోరారు. అనంతరం మహేశ్ భార్య నమ్రతా శిరోద్కర్ ముఖ్యమంత్రి సతీమణి భారతిని కలిసారు. తాము దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తున్న గుంటూరు జిల్లా బుర్రిపాలెం గ్రామానికి నిధులు కావాలని కోరారు. అనంతరం ఎవరూ ముఖ్యమంత్రిని కలవలేదు. ఈక్రమంలో పలువురు మీడియా ప్రతినిధులు రాజేంద్రప్రసాద్ ను ఇదే విషయం అడగగా.. సీఎంను వెంటనే కలవడానికి సినీ నటులేమీ వ్యాపారవేత్తలు కాదన్నారు. జగన్ సీఎం అయితే వెంటనే కలవాలని ఏమైనా ఉందా.. అని ప్రశ్నించారు. వ్యాపారాలుచేసే వారైతే కలుస్తారేమో కానీ అసలు కళాకారులు సీఎంను కలవాలన్న నిబంధన ఏమీ లేదన్నారు. జగన్ ముఖ్యమంత్రిగా కాస్త కుదురుకున్నాక తప్పకుండా కలుస్తామన్నారు.

అయితే ఇదే వ్యాఖ్యలపై మళ్లీ వైసీపీ శ్రేణులు పెద్దఎత్తున విరుచుకుపడ్డారు. రాజేంద్రప్రసాద్ ను వైసీపీ సోషల్ మీడియా అయితే దారుణంగా ట్రోల్ చేసింది. అయితే రాజేంద్రప్రసాద్ సీఎంని కలవాల్సి ఉన్నా ఇంకా కుదరలేదు. మళ్లీ చాలాకాలం తర్వాత సినీ పరిశ్రమకు చెందిన నిర్మాతల బృందం ఇవాళ సీఎం జగన్‌ను తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో కలిసింది. గన్నవరం శాసనసభ్యడు వల్లభనేని వంశీతో పాటు నిర్మాతలు దగ్గుబాటి సురేష్, శ్యాంప్రసాద్‌రెడ్డి, నల్లమలపు బుజ్జి, జెమిని కిరణ్‌లతో కూడిన బృందం సీఎంను కలిసారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. గతంలో విశాఖలో సంభవించిన హుథ్‌ హుథ్‌ తుఫానుకు ఇళ్లు కోల్పోయిన బాధితులకోసం సినీ పరిశ్రమ సాయంతో 320 ఇళ్లు నిర్మించామని, ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకొచ్చామన్నారు. ఇళ్ల నిర్మాణం పూర్తైనందున వాటిని ప్రారంభించి హుథ్‌హుథ్‌ సమయంలో నిరాశ్రయులైన వారికి ఇవ్వాలని సీఎంను కోరామన్నారు. దీనికోసం తెలుగు సినీ పరిశ్రమలోని అందరూ రెండ్రోజులపాటు అన్ని కార్యక్రమాలు నిలిపి వేసి టెలీథాన్‌ పేరుతో ప్రత్యేక షో నిర్వహించామన్నారు. ఆ షో నిర్వహణ ద్వారా వచ్చిన రూ.15 కోట్లతో ఇళ్ల నిర్మాణం చేపట్టామని ఇప్పుడు ఆ ఇళ్లు పూర్తయ్యాయని చెప్పారు. ఈ విషయాన్ని సీఎంకు వివరించామన్నారు. అందుకు ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని వెల్లడించారు.

అయితే ప్రస్తుతం సీఎంని కలిసినవారిలో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూడా ఉండడం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. అయితే వంశీ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తిగానే సీఎంని కలిసినట్టు తెలుస్తోంది. గతంలో వంశీ అదుర్స్, 2009లో వచ్చిన పున్నమినాగు వంటి సినిమాలు నిర్మించారు. అలాగే పలు సినిమాలకు వంశీ ఫైనాన్స్ కూడా చేసారు. అయితే ప్రస్తుతం విజయవాడ పరిసర ప్రాంత నాయకుడు కావడంతోపాటుగా ఇండస్ట్రీతో అనుభవం ఉన్నకారణంతోనే సినీ ప్రముఖులతో కలిసి సీఎంను కలిసినట్టు తెలుస్తోంది. అయితే విశాఖలో ఏర్పాటు చేయనున్న హూధ్ హుధ్ బాధితుల ఇళ్ల ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి హాజరవుతారో లేదో వేచి చూడాలి.