Idream media
Idream media
అమరావతిలో జరిగిన ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు ముమ్మరం చేసింది. పేదలైన తెల్లకార్డుదారులను ముందు పెట్టి పెద్ద ఎత్తున భూములు కొన్న ఆ ‘పెద్దలు’ ఎవరు? ఈ వ్యవహారంలో ప్రత్యక్ష పాత్ర ఎవరిది? వెనకుండి నడిపించినదెవరు? అనే అంశాలపై కీలక ఆధారాలు సేకరిస్తోంది. విదేశాల నుంచి హవాలా మార్గంలో వచ్చిన డబ్బు, చేతులు మారిన నల్ల డబ్బు గురించి ఈడీ జాయింట్ డైరెక్టర్ అభిషేక్ గోయల్ ఆరా తీస్తున్నారు. పలువురిని బెదిరించి తక్కువ ధరకే భూములు కొట్టేయడం, మోసం చేయడం, చంపుతామని బెదిరించడం, కిడ్నాపులు చేయడంపై బాధితుల నుంచి రహస్యంగా వివరాలు సేకరించినట్లు తెలుస్తోంది. ఈడీ ఇచ్చిన భరోసాతో చాలా మంది బాధితులు వివరాలు అందించడానికి ముందు వస్తున్నట్లు సమాచారం.
2014 రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి కొత్త రాజధాని ఎక్కడ పెడుతున్నారు అనే దానిపై ముందే సమాచారం ఇవ్వడం ద్వారా మాజీ సీఎం చంద్రబాబు ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారని మంత్రివర్గ ఉపసంఘం నిర్ధారించిన విషయం తెలిసిందే. చంద్రబాబుతోపాటు బంధువులు, కుటుంబసభ్యులు, బినామీలు టీడీపీ ముఖ్యులు రాజధాని ప్రతిపాదిత ప్రాంతంలో 4,069 ఎకరాలను కొన్నట్లు తేల్చింది. ఈ వ్యవహారమంతా నిజమేనని సీఐడీ సైతం నిర్ధారించింది. కేసులు కూడా నమోదు చేసింది. ఈ వ్యవహారంలో మనీ ల్యాండరింగ్, అక్రమ ఆదాయం వంటి అంశాలు ఉండడంతో ఈడీ, ఐటీ శాఖలకు వివరాలను అందజేసింది. వెంటనే రంగంలోకి దిగిన ఈడీ కీలక ఆధారాలను సాధించే పనిలో పడింది. ఇదిలాఉండగా కేసును చెన్నై నుంచి హైదరబాద్‌లోని జోనల్ కార్యాలయానికి బదిలీ చేశారు.