Idream media
Idream media
1960-70 మధ్య పుట్టిన జనరేషన్ చాలా విచిత్రాలు చూసింది. అన్ని తరాలు మంచిచెడు చూస్తాయి కానీ, టెక్నాలజీలో పురాతన కాలం నుంచి డిజిటల్ విప్లవం వరకూ చూసిన తరం మాది.
అందని ద్రాక్షగా , ఒక కలగా ఉన్న సినిమాని అరచేతిలో చూస్తామని ఎప్పుడూ ఊహించలేదు. థియేటర్ యజమాని అంటే ఒక స్టేటస్ సింబల్, ఇప్పుడు అదే థియేటర్ గుదిబండ. థియేటర్ పరిసరాల్లో ఫిలిం ముక్కలు ఏరుకుని సంతోషించేవాళ్లం. ఇప్పుడు ఫిలిం లేని కాలం. నటులు మేకప్ లేకుండా ఎలా వుంటారో తెలియదు. ఇప్పుడు వాళ్ల ఏడు తరాల జాతకాల్ని యూట్యూబ్‌లో చూడొచ్చు.
ఫొటో తీయించుకోవాలంటే ఒక రోజు ఈవెంట్. స్టూడియోకి వెళ్లి గంటసేపు కాచుకుని , పౌడర్ పూసుకుని , ఫొటోగ్రాఫర్ సూచనల్ని పాటించి , ఆయన నల్లటి ముసుగులోకి దూరుకుంటే జడుసుకుని , Smile ఇచ్చేవాళ్లం. వారం రోజులు స్టూడియో చుట్టు తిరిగితే ప్రేమ్ కట్టిన బ్లాక్ అండ్ వైట్ ఫొటో. అది ఇంట్లో గోడకి చాలా ఏళ్లు వేలాడేది. గోడల నిండా మేకులు కొట్టే కాలం. ఇప్పుడు మేకులు కనపడవు. మనుషులే తమని నాలుగు గోడల మధ్య మేకులతో బిగించుకుంటున్నారు.
మనుషులు నేరుగా మాట్లాడుకునే కాలం. ఫోన్‌లు అవసరం లేని రోజులు. ఉత్తరాల్లో మాట్లాడేవాళ్లు. నేరుగా కలిస్తే గంటలు గంటలు విడిపోకుండా మాట్లాడేవాళ్లు. ఇంట్లో ల్యాండ్ ఫోన్ మోగింది. STD బూత్‌లు వచ్చాయి. సెల్‌ఫోన్ రాకతో ప్రతి మనిషి 10 నెంబర్లగా మారిపోయాడు. ఫీడ్ చేసుకోకపోతే మన ఇంట్లో వాళ్ల నెంబర్లు కూడా గుర్తుండవు.
టీవీలొచ్చాయి. బ్లాక్ అండ్ వైట్‌లో వచ్చే చిత్రలహరి కోసం ఎదురు చూశాం. ఇళ్ల నెత్తి మీద యాంటెనాలు ఊగుతుండేవి. టీవీలో గీతలు కనిపిస్తే యాంటెనాని అటుఇటు తిప్పడమే. డిష్ కనెక్షన్‌తో దూరదర్శన్‌కి అంత్యక్రియలు. చెవుల్లో రేడియో పెట్టుకుని అర్థం కాని కామెంట్రీ విని ఎగిరే గంతులేసే కాలం పోయి , నేరుగా క్రికెట్ మ్యాచ్ చూసే కాలం. కలర్ టీవీలొచ్చాయి. గోడ నిండా సరిపోయే పెద్ద స్క్రీన్‌లు కూడా వచ్చాయి. తెరలు పెద్దవయ్యే కొద్ది మనుషులు తెరమరుగై రోబోలుగా మారిపోతున్నారు.
బ్యాంక్‌లకు వెళితే టోకెన్ తీసుకుని , గంటల పాటు ఎదురు చూపులు పోయాయి. ATMలో అర నిమిషం పని. డబ్బులు డిపాజిట్ చేయాలంటే ఫోన్‌పేలో సెకెండ్లలో. కరెంట్, ఫోన్ బిల్లులకి పొడుగాటి క్యూలు గతం.
థియేటర్ బుకింగ్‌లలో దూరి కుయ్యోమొర్రో అని అరుస్తూ, అరచేతిలో టికెట్లు పట్టుకుని ప్రపంచ విజేతలా వచ్చిన రోజులు ఇక రావు. బుక్ మై షో ఈజీ చేసేసి సినిమా థ్రిల్ పోగొట్టింది.
మూడు రూపాయలకి మటన్ బిరియానీ, ఐదు పైసలకి ఇడ్లీ , పది పైసలకి వడ తిన్న రోజుల్లో అరిటాకుని కూడా తినేసేంత ఆకలి వుండేది. చెట్నీస్ రెస్టారెంటులో వంద రూపాయలు పెట్టి ఇడ్లీ, ఆరు రకాల పచ్చళ్లతో ఉన్నా తినబుద్ధి కావడం లేదు. లక్ష్మీవిలాస్ హోటల్‌లో బకెట్‌తో తెచ్చే సాంబారు, ఓనర్ నారాయణరావు స్టేషన్లు మారుస్తున్నప్పుడు వచ్చే రేడియో గురగుర ఇక ఎప్పటికీ రావు, వినపడవు.
ఆదివారం మటన్ తెస్తారంటే శుక్రవారం నుంచే ఎదురు చూపులు. ఇప్పుడు స్విగ్గీలో 15 నిమిషాల్లో ఏదైనా వస్తుంది. బాల్యాన్ని మన ఇంట ముంగిట నిలబెట్టే యాప్‌ని ఇంకా కనుక్కోలేదు.
ఒకప్పుడు పాట సామూహికం. రేడియోల్లో పెళ్లి మండపాల్లో మార్మోగేది. ఇప్పుడు వ్యక్తిగతం. చెవుల్లోకి దూరింది. హెడ్‌ఫోన్స్ వల్ల ఎవడు ఏం వింటున్నాడో , ఎవరితో మాట్లాడుతున్నాడో తెలియదు.
గుర్రం కష్టంతో జట్కా బండి, మనిషి కష్టంతో రిక్షా వచ్చి వెళ్లిపోయాయి. ఆటోలు, క్యాబ్‌లు వచ్చాయి. ఇంకా ఏం వస్తాయో తెలియదు. నడవడం తగ్గే సరికి సుగర్ పెరిగింది.
వెదురు బెత్తంతో ఉతికే గురువులు పోయి , ఆన్‌లైన్‌లో కనపడే గురువులొచ్చారు. పప్పుండలు, బఠాణీల స్థానంలో కుర్‌కురే వచ్చింది. పుల్ల ఐస్ కరిగిపోయి క్వాలిటీ వాల్స్ వచ్చింది.
షాప్‌కి వెళ్లి బట్టలు మోసుకురావడం ఒక ఆనందం. టైలర్‌కి ఇచ్చి కితకితలు పెడుతూ కొలతలు తీసుకుంటూ వుంటే మహదానందం. పండగ పూట టైలర్ చుట్టూ పడిగాపులు కాస్తే ఇదిగో ఇస్త్రీ, అదిగో బటన్ కుడుతా అంటూ ఎట్టకేలకు తీసుకుని వేసుకున్నప్పుడు అమితానందం.
అన్నింటికి సంక్షిప్త రూపాలు వచ్చాయి. ఈ ఆనందాలన్నీ రెడీమేడ్ షోరూంలో అరగంటలో ముగుస్తాయి.
ప్రతిభకి వేదిక దొరకని కష్టకాలం పోయింది. నీలో విషయం వుంటే యూట్యూబ్ చూపిస్తుంది. ఇదే అద్భుతమైన మార్పు. అమ్మాయిలతో మాట్లాడాలంటే వచ్చీరాని ప్రేమ లేఖలు రాసి నానా చావులు చచ్చే కాలం పోయింది. ఇది ఇంకా మంచి మార్పు.
గతం , భవిష్యత్తే కాదు జీవితంలోని ప్రతి క్షణమూ అద్భుతమే. కాకపోతే అద్భుతాల్ని మనం గుర్తు పట్టం.