Idream media
Idream media
సినిమా టికెట్ల ధరలపై ప్రభుత్వం, సినీ పరిశ్రమ ఒకేతాటిపైకి వచ్చేలా కనిపిస్తున్నాయి. దీనిపై అధ్యయనానికి రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీ ఈ మేరకు దాదాపు కసరత్తు పూర్తి చేసింది. సినీ పెద్దల విన్నపాలను, సామాన్యుల పరిస్థితులను కూడా పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి ఈ నివేదికను అందజేశారు. టికెట్ల ధరలపై ప్రభుత్వ నిర్ణయాన్ని విభేదిస్తూ సినీ పరిశ్రమకు చెందినవారు హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యం గురువారం విచారణకు రానుంది. ఈ నేపథ్యంలో మంత్రి నాని ఈ నివేదికను ముఖ్యమంత్రికి సమర్పించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. గత నెల 13న కూడా చిరంజీవి సీఎం జగన్‌తో భేటీ అయ్యారు. రెండు మూడు వారాల్లో కమిటీ నివేదిక వస్తుందని, దీనిపై సినీపరిశ్రమకు చెందిన వారితో.. చర్చించాకే ఉత్తర్వులు జారీచేస్తానని ఈ సందర్భంగా చిరంజీవితో సీఎం చెప్పారు.
భేటీకి ప్రముఖ హీరోలు..
ఇదిలా ఉండగా.. సినీ హీరో, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి సీఎం జగన్‌తో గురువారం భేటీ కానున్నట్లు తెలుస్తోంది. చిరంజీవితో పాటు ఈ భేటీకి హీరోలు నాగార్జున, మహేశ్‌బాబు, జూనియర్ ఎన్టీఆర్‌తోపాటు ఆర్‌ఆర్‌ఆర్, రాధేశ్యామ్ నిర్మాతలు కూడా ఈ భేటీకి హాజరవుతారని ప్రచారం జరుగుతోంది. సినిమా టికెట్ల ధరల తగ్గింపుపై వివాదం చెలరేగిన నేపథ్యంలో హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం అధ్యయనానికి మంత్రి పేర్ని నాని అధ్యక్షతన ఓ కమిటీని వేసింది. ఒకవైపు న్యాయస్థానంలో వ్యాజ్యం విచారణ, మరోవైపు చిరంజీవి బృందంతో భేటీ నేపథ్యంలో.. సినిమా టికెట్ల వ్యవహారంపై సీఎం జగన్ గురువారం స్పష్టమైన అభిప్రాయాన్ని ప్రకటిస్తారనే ప్రచారం జరుగుతోంది. మంత్రి పేర్ని నేతృత్వంలోని కమిటీ అందించిన నివేదికలో బీ, సీ కేంద్రాల్లో సినిమా టికెట్ల ధరలు కనీసం రూ.40 నుంచి రూ.45 వరకు చేసే వీలుందని తెలుస్తోంది.