iDreamPost
iDreamPost
గబ్బర్ సింగ్ రూపంలో పవన్ కళ్యాణ్ తో ఇండస్ట్రీ హిట్ కొట్టి అందరి దృష్టి తనమీద పడేలా చేసుకున్న దర్శకుడు హరీష్ శంకర్ ఆ తర్వాత అంత గొప్ప విజయాన్ని అందుకోనప్పటికీ సరైన సబ్జెక్టు పడితే మాస్ హీరోయిజంని అద్భుతంగా చూపడంలో ఇప్పటికీ ఇతన్ని నమ్మొచ్చు. అందుకే పవర్ స్టార్ ఏరికోరి తనకు మరో ఛాన్స్ ఇచ్చాడు. అయితే ఇప్పట్లో సెట్ మీదకెళ్లే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. వకీల్ సాబ్ అయ్యాక పవన్ వెంటనే అయ్యప్పనుం కోశియుమ్ రీమేక్ మొదలుపెడతాడు. నెక్స్ట్ పెండింగ్ లో ఉన్న క్రిష్ భారీ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్లాల్సి ఉంటుంది. ఎంతలేదన్నా ఇవన్నీ అయ్యేలోపు 2022 వచ్చేస్తుంది.
ఈ మధ్యలో చెప్పుకోదగ్గ గ్యాప్ వస్తుంది. దాన్ని ఎలా వాడుకోవాలా అని ఎదురు చూస్తున్న హరీష్ శంకర్ మరో మెగా ఆఫర్ తలుపు తట్టినట్టు ఇన్ సైడ్ టాక్. లూసిఫర్ రీమేక్ సుజిత్ నుంచి వివి వినాయక్ చేతికి వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా స్క్రిప్ట్ విషయంలో ఏకాభిప్రాయం రాని కారణంగా ఇప్పుడు తెరమీదకు హరీష్ శంకర్ పేరు వచ్చిందట. ఇలాంటి కమర్షియల్ పొలిటికల్ ఎంటర్ టైనర్ ని అతనైతే బాగా డీల్ చేయగలడని చిరుతో పాటు రామ్ చరణ్ భావించడంతో ప్రస్తుతం చర్చలు జరుగుతున్నట్టు సమాచారం. అంతా ఓకే అనుకున్న తర్వాతే ప్రకటిస్తారు. లేదా కథ మళ్ళీ మొదటికే వస్తుంది.
లాక్ డౌన్ టైం నుంచి రీమేకుల మీద మనసు పెడుతున్న చిరంజీవి రిస్కుకు దూరంగా ఉంటున్నారు. వేదాళం చేయడం పట్ల ఇప్పటికే అభిమానుల్లో మిశ్రమ స్పందన ఉంది. అది చాలదు అన్నట్టు ప్రైమ్ లో తెలుగు వెర్షన్లోనే చాలా మంది చూసేసిన లూసిఫర్ మీద ఇంత పట్టు ఎందుకు పడుతున్నారని తమలో తామే చర్చించుకుంటున్నారు. ఇటీవలే కరోనా పాజిటివ్ వచ్చి మళ్ళీ నెగటివ్ గా క్లియర్ రావడంతో రిలాక్స్ అయిన మెగాస్టార్ త్వరలోనే ఆచార్య షూట్ లో పాల్గొనబోతున్నారు. విడుదల మరోసారి వాయిదా పడొచ్చన్న వార్తలకు చెక్ పెడుతూ వచ్చే వేసవికి రిలీజయ్యేలా దర్శకుడు కొరటాల శివ పక్కా ప్లానింగ్ తో ఉన్నారు.