iDreamPost
android-app
ios-app

రాజమండ్రిలో రేపు చిరంజీవి, ఎల్లుండి పవన్ కళ్యాణ్

  • Published Sep 30, 2021 | 5:39 AM Updated Updated Mar 11, 2022 | 10:42 PM
రాజమండ్రిలో రేపు చిరంజీవి, ఎల్లుండి పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ రాజకీయాలు చివరకు సొంత కుటుంబీకులను కూడా చిక్కుల్లో నెడుతున్నాయి. రిపబ్లిక్ సినిమా వేడుక సాక్షిగా ప్రారంభించిన వేడి చల్లారలేదు. సినిమా ప్రమోషన్ కోసం పవన్ ని పిలిస్తే ఆయన తన పొలిటికల్ ప్రయోజనాలకు అనుగుణంగా దానిని మలచుకున్నారనే ఆవేదన చివరకు సాయి ధరమ్ తేజ్ అభిమానుల్లో కూడా కనిపిస్తోంది. సినిమా దర్శకుడు దేవ్ కట్టా కామెంట్స్ దానికి సాక్ష్యంగా ఉన్నాయి. సినిమా ప్రమోషన్ మొత్తం పక్కకిపోవడంతో వారంతా తలపట్టుకుంంటున్నారు.

అదే వేదికపై నుంచి పవన్ చేసిన వ్యాఖ్యలను నిర్మాత దిల్ రాజు కూడా తప్పుబట్టాల్సి వచ్చింది. తమకు సంబంధం లేదని వివరణ ఇచ్చుకోవడానికి బందరు వరకూ వెళ్లాల్సి వచ్చింది. దానికితోడు ప్రాధేయపడవద్దని చిరంజీవి కూడా చెప్పండంటూ పవన్ చేసిన కామెంట్స్ చిరు అభిమానులను సైతం నిరాశ పరిచాయి. అన్నయ్యకు కూడా సలహాలిచ్చే స్థాయిలో పవన్ ఉన్నాడా అనే ప్రశ్నలు ఆ శిబిరం నుంచి వస్తున్నాయి. దాంతో పవన్ కూడా కొంత వెనక్కి తగ్గి మంగళగిరి మీటింగులో వాటి ప్రస్తావన కూడా చేయకుండా జాగ్రత్తపడ్డారని తెలుస్తోంది.

Also Read : ప‌వ‌న్ ది ప్ర‌భుత్వంపై అక్క‌సా? ఉక్కు ఉద్య‌మంపై చిన్న‌చూపా?

ఇప్పుడు వ్యవహారం రాజమహేంద్రవరానికి మారుతోంది. ఒకేరోజు వ్యవధిలో ఈ ఇద్దరు అన్నదమ్ములు అక్కడికి వెళుతున్నారు. అక్టోబర్ 1వ తేదీన చిరంజీవి రాజమహేంద్రవరం హోమియో కాలేజీలో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడే తన మామ అల్లూ రామలింగయ్య విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. ఆ కాలేజీ అల్లు రామలింగయ్య పేరుతోనే ఉండడం విశేషం. ఈ కార్యక్రమానికి ఏపీ మంత్రులు కన్నబాబు, విశ్వరూప్, చెల్లుబోయిన వేణు సైతం హాజరవుతున్నారు. దాంతో అధికారిక కార్యక్రమం మాదిరిగా అది జరుగుతోంది. చిరంజీవి రాక కోసం కూడా దానికి అనుగుణంగానే ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఆ మరునాడే అక్టోబర్ 2న శ్రమదానం పేరుతో పవన్ కళ్యాణ్ గోదావరి తీరానికి వెళుతున్నారు. ఆరోజు ఉదయం ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద శ్రమదానం చేస్తామని జనసేన ప్రకటించింది. తమ పార్టీ అధినేత అక్కడ హాజరవుతారని తెలిపారు. అయితే కాటన్ బ్యారేజ్ నిర్మాణం పనులు సాంకేతికంగా చేయాల్సి ఉంటుంది. పైన పైన మట్టి వేసి కప్పేయడానికి అది సాధారణ రోడ్డు కాదు. కాబట్టి పవన్ కి గానీ మరొకరికి గానీ బ్యారేజ్ పై అనుమతులు ఉండవని నీటిపారుదల శాఖ ప్రకటించింది. ఈ నేపథ్యంలో పవన్ పర్యటన ఆసక్తి రేపుతోంది.

Also Read : మనిషి మారెను,భాష మారెను .. కులం మీద పవన్ యూ టర్న్

రెండు రోజుల వ్యవధిలో చిరు, పవన్ కూడా రాజమహేంద్రవరంలో అడుగుపెడుతుండడం ఆసక్తిగా కనిపిస్తోంది. ఇప్పటికే రాజకీయంగా పవన్ వైఖరి స్పష్టమయ్యింది. త్వరలో ఆయన బీజేపీ స్నేహం వదిలేసుకుని టీడీపీతో జతగట్టబోతున్నారు. అదే సమయంలో దాని ప్రభావం ఉభయ గోదావరి జిల్లాల్లో ఏదో మేరకు ఉంటుందన్నది కాదనలేని వాస్తవం. కాబట్టి అదే ప్రాంతంలో పవన్, చిరు కూడా భిన్నమైన కార్యక్రమాలతో ముందుకు సాగుతుండడం చర్చనీయాంశం అవుతోంది