iDreamPost
iDreamPost
మలయాళ సీనియర్ హీరోలు మోహన్ లాల్, మమ్మూట్టి వంటి వారు విభిన్న చిత్రాలు, విభిన్న పాత్రలతో అలరిస్తుంటే.. మన తెలుగు సీనియర్ హీరోలు మాత్రం ఇప్పటికీ కుర్ర హీరోయిన్లతో స్టెప్పులేస్తున్నారు. ఈ సంక్రాంతికి వీరసింహారెడ్డితో బాలకృష్ణ, వాల్తేరు వీరయ్యతో చిరంజీవి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ రెండు కూడా ఫ్యాన్స్ ని, మాస్ ని దృష్టిలో పెట్టుకొని తీసిన సినిమాలు. పైగా వీటికి వింటేజ్ అనే ట్యాగ్ కూడా తగిలించారు. అసలు వింటేజ్ అంటే ఏంటి?.. ఎప్పటివో పాత కథలు, సన్నివేశాలు తీసుకొని.. పాత గెటప్పుల్లో హీరోలను చూపించడమే వింటేజ్ ఏమోనని అనిపించక మానదు ఈ సినిమాలు చూస్తే.
సమరసింహారెడ్డి, నరసింహనాయుడు సినిమాల దగ్గర నుంచి బాలకృష్ణ సినిమా అంటే.. అదే ఫ్యాక్షన్ స్టోరీ, అదే నరకడాలు. వీరసింహారెడ్డి కూడా ఏమాత్రం కొత్తదనం లేకుండా అలా తెరకెక్కినదే. వింటేజ్ అంటే బాలకృష్ణ చేత వైట్ అండ్ వైట్ వేయించి.. కత్తి పట్టి నరికించడమేనా?.
ఇక వాల్తేరు వీరయ్య పరిస్థితి కూడా అలాగే ఉంది. కథలో ఏమాత్రం కొత్తదనం లేదు. ఎంత మాస్ సినిమా అయినా.. జైచిరంజీవ లాంటి ఓ కథ తీసుకొని, చిరంజీవి చేత ముఠామేస్త్రి లాంటి గెటప్ వేయించి ఇదే వింటేజ్ అనుకోమంటే ఎలా?.
చిరంజీవి కామెడీ టైమింగ్ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అప్పట్లో ఆయన డ్యాన్స్ లతో పాటు అదేస్థాయిలో ఆయన కామెడీ టైమింగ్ కి కూడా ప్రేక్షకులు ఫిదా అయ్యేవారు. అలాంటి చిరంజీవి కామెడీ టైమింగ్ ని ప్రేక్షకులకు మరోసారి చుపించాలనుకోవడం నిజంగా మంచి ఆలోచన. కానీ రూపొందించిన విధానమే ఆకట్టుకునేలా లేదు. కామెడీ సన్నివేశాలు చిరు స్థాయికి తగ్గట్లుగా లేవు. కొన్నిచోట్ల అతిగా కూడా అనిపించింది. ఏదైనా కొత్త కథాంశం తీసుకొని, క్యారెక్టరైజేషన్ లో కొత్తదనం చూపిస్తూ.. చిరంజీవి కామెడీ టైమింగ్ ని వాడుకొని ఉంటే బాగుండేది. అప్పటి కథ, అప్పటి సన్నివేశాలు, అప్పటి గెటప్ తో మమా అనిపించేసి.. ఇదే వింటేజ్ సినిమా అంటే ఎలా?. ఈమాత్రం దానికి మళ్ళీ ప్రత్యేకంగా సినిమా తీయడం ఎందుకు.. ఎలాగూ రీరిలీజ్ ల ట్రెండ్ నడుస్తోంది కదా. అప్పటి సినిమాలను మళ్ళీ విడుదల చేస్తే.. తమ వింటేజ్ హీరోని తెరపై చూసుకొని అభిమానులు ఇంతకంటే ఎక్కువ ఆనందం పొందుతారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.