iDreamPost
iDreamPost
తెలుగుదేశం పార్టీకి చీరాల అసెంబ్లీ నియోజకవర్గ పరిణామాలు మింగుడుపడడం లేదు. చివరి నిమిషం వరకూ వేచి చూడాలనే ధోరణిలో చంద్రబాబు ఉన్నారు. వైఎస్సార్సీపీకి జై కొట్టిన సిట్టింగ్ ఎమ్మెల్యే కరణం బలరాం వచ్చే ఎన్నికల్లో తనయుడికి ఛాన్స్ వస్తుందని ఆశిస్తున్నారు. అదే సమయంలో మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కూడా కాచుకుని కూర్చున్నారు. ఈ ఇద్దరిలో ఎవరు నిరాశకు గురయినా అనివార్యంగా తమవైపు వస్తారనే ధీమా టీడీపీ అధినేతలో ఉంది. దానికి అనుగుణంగా చీరాల టీడీపీ వ్యవహారంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు.
ఇటీవల నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా నియమితుడైన యడం బాలాజీ విషయంలో చంద్రబాబు చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారు. అయితే నారా లోకేష్ మాత్రం చీరాలలో వేలుపెట్టడంతో కొత్త సమస్య వచ్చిపడినట్టుగా కనిపిస్తోంది. యడం బాలాజీ నేరుగా మంత్రి బాలినేనితో సన్నిహితంగా ఉంటున్నారనే ప్రచారం లోకేష్ సన్నిహితులు చేస్తున్నారు. అదే విధంగా ప్రభుత్వ సలహాదారు సజ్జలతోనే బాలాజీ టచ్ లో ఉన్నారనే వాదన వినిపిస్తున్నారు. దాంతో అత్యవసరంగా బాలాజీని ఇన్ఛార్జ్ పదవి నుంచి తొలిగించాలని లోకేష్ అండ్ కో ఆశిస్తున్నారు. కానీ చంద్రబాబు మాత్రం దానికి భిన్నమైన ధోరణితో ఉన్నారు. దాంతో చీరాల టీడీపీ వ్యవహారం ఆపార్టీలో కొత్త చిచ్చుకి దారితీసేలా కనిపిస్తోంది.
యడం బాలాజీ గతంలో వైఎస్సార్సీపీలో పనిచేశారు. ఆపార్టీ నాయకులతో సంబంధాలున్నాయి. అయితే ఆయన నేరుగా అధికార పార్టీ పెద్దలతో చేతులు కలిపారనే వాదన విచిత్రంగా ఉందని బాలాజీ వర్గీయులు అభిప్రాయపడుతున్నారు. చీరాలలో టీడీపీని ఓ దారికి తీసుకొచ్చి పార్టీని పట్టాలెక్కించే పనికి లోకేష్ అనుచరుల చర్యల కారణంగా ఆటంకం ఏర్పడుతోందని బాలాజీ అనుచరులు భావిస్తున్నారు. తద్వారా టీడీపీ బలోపేతానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలించకుండా చినబాబు వర్గం అడ్డంకులు సృష్టిస్తోందని అధినేతకు ఫిర్యాదులు చేసేవరకూ వెళ్లారు. ఈ పరిస్థితుల్లో చీరాల టీడీపీ వ్యవహారం చంద్రబాబుకి సైతం చికాకుగా మారింది. క్షేత్రస్థాయిలో పరిస్థితిని చక్కదిద్దలేక, చినబాబుకి సర్ది చెప్పలేక అన్నట్టుగా మారింది.
గత ఎన్నికలకు రెండు నెలల ముందు టీడీపీ నుంచి వైసీపీలో చేరిన ఆమంచి కృష్ణ మోహన్ కు వైసీపీ టికెట్ దక్కటంతో దాదాపు 8 సంవత్సరాలు ఇన్ ఛార్జ్ గా పనిచేసిన యడం బాలాజీ టీడీపీలో చేరి కరణం బలరాం గెలువుకు కృషి చేశాడు.పోటీ చేసింది బలరామే అయినా పోటీ ఆమంచి వెర్షస్ బాలాజీ అన్నట్లు ఎన్నిక జరిగింది.వైసీపీ 151 సీట్లు సాధించినా,2014లో ఆమంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచినా 2019లో మాత్రం బాలాజీ వలనే చీరాలలో టీడీపీ గెలిచిందని విశ్లేషకులు భావించారు.
ఇప్పటికే చీరాలలో వైసీపీ బలంగా ఉంది. ఆపార్టీకి చెందిన రెండు వర్గాలు ఏకతాటిపైకి వస్తే ఎదుర్కోవడం టీడీపీ చాలా కష్టం అవుతుంది. కాబట్టి వాటిని ఐక్యం కాకుండా చూస్తే చాలనే అంచనా టీడీపీ నాయకత్వంలో ఉంది. ఈలోగా టీడీపీలోనే తగాదాలు పెరుగుతుండడం తలనొప్పిని కలిగిస్తోంది. ప్రస్తుతానికి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మార్చే అవకాశం లేదని చంద్రబాబు చెబుతున్నప్పటికీ ఈ పరిణామాలు యడం బాలాజీలో అసంతృప్తిని రాజేస్తున్నట్టు తెలుస్తోంది.