iDreamPost
android-app
ios-app

చింతా మోహ‌న్ స్టైలే వేరు!

చింతా మోహ‌న్ స్టైలే వేరు!

6 సార్లు పార్ల‌మెంట్ స‌భ్యుడిగా గెలిచి, ఒక‌సారి కేంద్ర‌మంత్రిగా ప‌నిచేసి డిపాజిట్ ద‌క్కించుకోవ‌డానికి పోరాడుతున్న ఏకైక వ్య‌క్తి చింతా మోహ‌న్‌. తిరుప‌తి ఉన ఎన్నిక‌లో కాంగ్రెస్ అభ్య‌ర్థిగా పోటీ చేస్తూ , క‌నీసం న‌లుగురు కార్య‌క‌ర్త‌లు కూడా వెంట‌లేని స్థితిలో క‌ర‌ప‌త్రాలు పంచుతూ తిరుగుతున్న ఆయ‌న్ని చూస్తే ఓడ‌లు బండ్లు కావ‌డ‌మంటే ఇదే క‌దా అనుకుంటున్నారు.

84లో టీడీపీ అభ్య‌ర్థిగా , త‌ర్వాత 5 సార్లు కాంగ్రెస్ అభ్య‌ర్థిగా గెలుపొందాడు. పీవీ ప్ర‌భుత్వంలో కేంద్ర‌మంత్రిగా కూడా చేసాడు. ఒకేఊ నియోజ‌క‌వ‌ర్గంలో 6 సార్లు గెలుపొందిన వాళ్లు రాజ‌కీయాల్లో చాలా అరుదుగా ఉంటారు. చింతాది కూడా అరుదైన స్టైలే. ఆయ‌న‌కి ప్ర‌జ‌ల‌తో ఎప్పుడూ సంబంధం లేదు. 2004 త‌ర్వాత కొంచెం మారాడు కానీ, అంత‌కు ముందు ఎప్పుడూ ఢిల్లీలోనే. తిరుప‌తి మొహం కూడా చూసేవాడు కాదు. త‌న ప‌రిధిలోని 7 నియోజ‌క వ‌ర్గాలు తిర‌గ‌డం జ‌రిగేది కాదు. ఢిల్లీ లాబీయింగ్‌తో టికెట్ తెచ్చుకునే వాడు. ప్ర‌జ‌ల‌కు గ‌త్యంత‌రం లేక‌పోవ‌డం, తెలుగుదేశం ఎపుడూ బ‌ల‌హీన అభ్య‌ర్థిని నిల‌బెడుతూ ఉండ‌డంతో ఎదురు లేకుండా పోయింది.

96లో మ‌టుకు అంద‌ర్నీ షాక్‌కు గురి చేస్తూ నెల‌వ‌ల సుబ్ర‌మ‌ణ్యం టికెట్ తెచ్చుకుని గెలిచాడు. చింతా ప‌ని అయిపోయింద‌ని అనుకున్నారు. కానీ మ‌ళ్లీ చ‌క్రం తిప్పాడు. 98 మ‌ధ్యంత‌ర ఎన్నిక‌ల్లో నెల‌వ‌ల నామినేష‌న్ కూడా వేశాడు. బీ ఫారం చింతా తెచ్చుకున్నాడు. అన్యాయం జ‌రిగింద‌ని గాంధీ విగ్ర‌హం ఎదుట నెల‌వ‌ల ధ‌ర్నా చేసినా ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు.

99లో ఎలాగూ ఓడిపోతామ‌ని తెలివిగా టీడీపీ బీజేపీకి ఇచ్చింది. ఆశ్చ‌ర్యంగా ఫ‌స్ట్ టైం బీజేపీ గెలిచింది (ఎన్‌.వెంక‌ట‌స్వామి). ప‌ద‌వి లేన‌ప్పుడు కూడా చింతా మోహ‌న్ జ‌నంలో లేరు. ఢిల్లీ రాజ‌కీయంలో బిజీ. కాంగ్రెస్ టికెట్ మ‌ళ్లీ వ‌చ్చింది. 2 సార్లు మ‌ళ్లీ గెలిచాడు. 2014కి కాంగ్రెస్ ఫినిష్ అయినా చింతా ఏమో గుర్రం ఎగ‌రా వ‌చ్చు అనే ఆశ‌తో ఉన్నాడు.

1989లో ఎన్నిక‌ల‌కి నెల రోజుల ముందు వ‌ర‌కూ ఆయ‌న తిరుప‌తిలో కాలు పెట్ట‌లేదు. ఈ విష‌యాన్ని ప్రెస్‌మీట్‌లో అడిగితే..

“ఎంపీగా గెలిచింది ఢిల్లీలో ఉండ‌డానికి, తిరుప‌తి వీధుల్లో తిర‌గ‌డానికి కాదు” అని వ్యంగ్యంగా స‌మాధానం ఇచ్చాడు.

మిడ్ ట‌ర్మ్‌తో క‌లిపి దాదాపు పాతికేళ్ల‌కు పైగా తిరుప‌తి ప్ర‌తినిధిగా పార్ల‌మెంట్‌లో కూచున్న ఆయ‌న్ను తిరుప‌తి గురించి నోరు విప్ప‌గా విన్న‌వాళ్లు లేరు. తిరుప‌తిలో ఆయ‌న చేసిన అభివృద్ధిని చూసిన వాళ్లు లేరు.

కాలం అన్నిటికి బ‌దులు చెబుతుంది.