iDreamPost
android-app
ios-app

చిన‌జీయ‌ర్ కీల‌క వ్యాఖ్య‌లు.. శాంతి కల్యాణానికి కేసీఆర్‌ హాజరవుతారా?

చిన‌జీయ‌ర్ కీల‌క వ్యాఖ్య‌లు.. శాంతి కల్యాణానికి కేసీఆర్‌ హాజరవుతారా?

తెలంగాణకు మరింత ఖ్యాతితెచ్చిన సమతామూర్తి క్షేత్రం ప్రారంభోత్సవం రాజకీయంగా హాట్‌ టాపిక్‌గా మారింది. భారీ విగ్రహ ఆవిష్కరణ శిలాఫలకంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేరు లేకపోవడం ఒకటైతే, ప్రధాని మోదీని ఆహ్వానించేందుకు కేసీఆర్‌ వెళ్లకపోవడం మరొకటి. కాగా విగ్రహ ప్రారంభం అనంతరం కేసీఆర్‌ ఆ క్షేత్రం వైపు కన్నెత్తి చూడలేదు. అలాగే.. అంతకు ముందు వరకూ రోజూ పూజల నిమిత్తం దివ్యక్షేత్రానికి వెళ్లిన కేసీఆర్‌ సతీమణి కూడా ప్రారంభోత్సవం అనంతరం వెళ్లడం మానేశారని కూడా వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో త్రిదండి చినజీయర్‌ స్వామీజికి, మై హోం అధినేత రామేశ్వరరావుకు మధ్య విభేదాలు తలెత్తాయని ప్రచారం జరిగింది.

ఈ క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో తనకు ఎటువంటి విభేదాలూ లేవని త్రిదండి చినజీయర్‌స్వామి స్పష్టం చేయడం ఆసక్తిగా మారింది. అయితే.. 108 దివ్యదేశాల్లో శనివారం నిర్వహించే శాంతి కల్యాణ ఉత్సవానికి సీఎం కేసీఆర్‌ను ఆహ్వానించామని, అయితే ఆయన వస్తారో రారో చూడాలి అని చెప్పడం గమనార్హం. ప్రతిపక్షాలను ఎందుకు ఆహ్వానించలేదన్న ప్రశ్నకు తనకు అందరూ సమానమేనని స్పష్టం చేశారు. రాజకీయాల్లోనే ప్రతిపక్షాలుంటాయని, భగవంతుడి వద్ద కాదని తెలిపారు. సహస్రాబ్ది ఉత్సవాలకు మొదటి సేవకుడిని తానేనని సీఎం ప్రకటించారని.. అలాంటి వ్యక్తితో తమకు ఎందుకు విభేదాలుంటాయని ప్రశ్నించారు. ఇది ఎవరో సృష్టించారని పేర్కొన్నారు.

రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లోని తన ఆశ్రమంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సహస్రాబ్ది వేడుకలకు సీఎం పూర్తి సహాయ సహకారాలు అదించారు కాబట్టే ఉత్సవాలు విజయవంతం అయ్యాయని పేర్కొన్నారు. ఆయన సహకారం లేకుంటే.. ఉత్సవాలు జరిగేవా? అని ప్రశ్నించారు. సహస్రాబ్ది ఉత్సవాలకు ప్రభుత్వ యంత్రాంగం మొత్తం పనిచేసిందని ఆయన తెలిపారు. సీఎంను సహస్రాబ్ది ఉత్సవాలకు ఆహ్వానించామని కానీ ఆయన ఉత్సవాలకు హాజరు కాకపోవడానికి అనేక కారణాలు ఉండవచ్చన్నారు. ఆరోగ్య, ఇతర ప్రభుత్వ కార్యక్రమాల దృష్ట్యా కూడా ఆయన రాలేకపోయి ఉంటారని అభిప్రాయపడ్డారు.

సహస్రాబ్ది ఉత్సవాలకు ప్రధాని మోదీని ఆహ్వానించాలని 2016లోనే నిర్ణయం తీసుకున్నామని, ఈ విషయం సీఎంతో కూడా చర్చించామని చినజీయర్‌ చెప్పారు. సీఎం చెప్పిన విధంగానే కార్యక్రమ రూపకల్పన చేశామన్నారు. ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా భద్రతా ఏర్పాట్ల దృష్ట్యా ఢిల్లీనుంచి వచ్చే ఆదేశాలను పాటించాలని సీఎం కేసీఆర్‌ చెప్పారని, ఆ మేరకే తాము నడుచుకున్నామని వివరించారు. కార్యక్రమానికి హాజరయ్యే వారి పేర్లు మాత్రమే శిలాఫలకంలో ఉండాలని పీఎంవో నుంచి ఆదేశాలు ఉన్నాయని, ఆ మేరకు పేర్లు పెట్టామన్నారు. అంతేకానీ సీఎం కేసీఆర్‌కు తనకు ఎలాంటి విభేదాలూ లేవని స్పష్టం చేశారు.