చైనా నుంచి మరోసారి ప్రపంచానికి ముప్పు ఏర్పడబోతోందా..?

చైనా నుంచి మరోసారి ప్రపంచానికి ముప్పు ఏర్పడబోతోందా..? అంటే పరిస్థితులు అవుననే అంటున్నాయి. రెండేళ్ల క్రితం చైనాలో వెలుగుచూసిన కరోనా వైరస్‌ ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. రూపాలు మార్చుకుంటూ కరోనా వైరస్‌ ఇప్పటికీ ప్రపంచంపై దాడి చేస్తూనే ఉంది. లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఆర్థికంగా ఎనలేని నష్టం వాటిల్లింది. కరోనా కొత్త వేరియంట్‌ అయిన ఒమిక్రాన్‌ రూపంలో గత ఏడాది ఆఖరులో థర్డ్‌ వేవ్‌ వచ్చింది. భారత్‌లో దాదాపు రెండు నెలలపాటు ఉన్న ఈ వేవ్‌.. ప్రస్తుతం పూర్తిగా తగ్గుముఖం పట్టింది. అమెరికా, రష్యా, జర్మనీ, ఫ్రాన్స్‌ వంటి పాశ్చాత్య దేశాల్లో కరోనా వైరస్‌ కేసులు, కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ కేసులు కూడా నమోదవుతున్నాయి.

మూడో వేవ్‌ తగ్గిపోయిందని, ఇక కరోనా అంతరించి పోయిందని, ముప్పు తప్పిందని వైద్య నిపుణులు అంచనా వేశారు. అయితే చైనాలో తాజాగా నెలకొన్న పరిణామాలు కరోనా వైరస్‌ ముప్పు ఇంకా తప్పలేదని చెబుతున్నాయి. చైనాలో కొత్తగా మరో కరోనా వైరస్‌ వేరియంట్‌ పుట్టింది. ఇది ఒమిక్రాన్‌ సబ్‌ వేరియంట్‌గా గుర్తించారు. దానికి స్టెల్త్‌ ఒమిక్రాన్‌గా పిలుస్తున్నారు. ఈ వైరస్‌ చైనాలో వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటివరకు వచ్చిన కరోనా వైరస్‌ వేరియంట్లలో ఒమిక్రాన్‌ వేగంగా వ్యాపించింది. అయితే ఈ స్టెల్త్‌ ఒమిక్రాన్‌ దానికన్నా వేగంగా వ్యాపిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది.

24 గంటల వ్యవధిలో చైనాలో కొత్తగా 1,337 స్టెల్త్‌ ఒమిక్రాన్‌ కేసులు వెలుగుచూడడం ఆందోళన రేకెత్తిస్తోంది. ఒక్క జిలిన్‌ ప్రావిన్స్‌లోనే 895 కొత్త కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్‌ వెలుగుచూసినప్పటి నుంచి ఇప్పటివరకు ఈ స్థాయిలో జిలిన్‌ ప్రావిన్స్‌లో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. ఈ వైరస్‌ దేశం మొత్తం వ్యాపిస్తుండడంతో చైనా సర్కార్‌ అప్రమత్తమైంది. జిలిన్‌ ప్రావిన్స్‌లో లాక్‌డౌన్‌ విధించింది. డ్రోన్ల ద్వారా వైరస్‌ సంహారిణులను చల్లేందుకు 7 వేల మంది సైనికులను అక్కడకు పంపింది. స్టెల్త్‌ ఒమిక్రాన్‌ చైనా రాజధాని బీజింగ్, వాణిజ్య రాజధాని షాంఘైకు పాకింది. బీజింగ్‌లో ఆరు కేసులు, షాంఘైలో 41 కేసులు వెలుగుచూశాయి. దీంతో కేసులు కనుగొన్న చోట్ల కార్యాలయాలు మూసివేశారు. బస్సు, రైలు సర్వీసులను రద్దు చేశారు. స్కూళ్లు ఆన్‌లైన్‌ తరగతులను నిర్వహిస్తున్నాయి.

ఈ ఏడాది జూన్‌ ఆఖరులో నాలుగో వేవ్‌ ఉంటుందని ఐఐటీ ఖరగ్‌పూర్‌ అంచనా వేసింది. ఆగష్టులో ఈ వేవ్‌ ఉచ్ఛస్థితికి చేరుకుని, అక్టోబర్‌ నాటికి తగ్గిపోతుందని పేర్కొంది. అయితే తమ అంచనాలు నిజం కావడం కొత్త వేరియంట్‌ పుట్టుక, వ్యాక్సినేషన్‌ పై ఆధారపడి ఉంటుందని తెలిపింది. కొత్త వేరియంట్‌ పుడితే నాలుగోవేవ్‌ తప్పదని ఐఐటీ ఖరగ్‌పూర్‌ అంచనా వేసిన నేపథ్యంలో.. చైనాలో వెలుగుచూసి, వేగంగా వ్యాపిస్తున్న స్టెల్త్‌ ఒమిక్రాన్‌ వల్ల అది సంభవిస్తుందనే ఆందోళన ప్రపంచవ్యాప్తంగా నెలకొంది. ఒమిక్రాన్‌ వైరస్‌ వేగంగా వ్యాపించినా.. దాని తీవ్రత తక్కుగానే ఉంది. వ్యాక్సిన్‌ తీసుకోని వారే ఆస్పతిపాలయ్యారు. అందులో అతి తక్కువ మందే ప్రాణాలు కోల్పోయారు. వ్యాక్సిన్‌ తీసుకున్న వారు స్వల్ప లక్షణాలతో కనిష్టంగా మూడు, గరిష్టంగా ఐదు రోజుల్లో కోలుకున్నారు. మరి ఒమిక్రాన్‌ ఉప వేరియంట్‌ అయిన స్టెల్త్‌ ఒమిక్రాన్‌ వ్యాప్తి వేగంగా ఉన్నా, తీవ్రత ఎలా ఉంటుందో..? చూడాలి. ఈ వేరియంట్‌ చైనాకే పరిమితం అయితే.. నాలుగో వేవ్‌ రానట్లే. లేదంటే నాలుగో వేవ్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధం కావాల్సిందే.

Show comments