iDreamPost
iDreamPost
కరోనా వైరస్ యావత్ ప్రపంచాన్ని ఎంతలా వణికించేస్తోందో అందరూ చూస్తున్నదే. వైరస్ పుట్టినల్లయిన చైనాలోని వూహాన్ లో మొట్టమొదటి కేసు నమోదైనపుడు దాన్ని అంతుచిక్కని న్యుమోనియాగా నిపుణులు, డాక్టర్లు అభిప్రాయపడ్డారట. చాలా రోజుల తర్వాత కానీ ఇది కరోనా వైరస్ అన్న విషయాన్ని గుర్తించలేకపోయినట్లు చైనా విడుదల చేసిన శ్వేతపత్రంలో స్పష్టం చేసింది. ప్రపంచంలో వైరస్ చేస్తున్న విధ్వంసానికి చైనానే కారణమని, డ్రాగన్ దేశమే బాధ్యత వహించాలనే డిమాండ్లు పెరిగిపోతున్న నేపధ్యంలో చైనా ఒత్తిడికి లొంగి చివరకు వాస్తవ వివరాలంటూ ఓ ప్రకటన చేసింది.
మొట్టమొదట వూహాన్ లో డిసెంబర్ 17వ తేదీన అనారోగ్యంతో ఓ వ్యక్తి ఆసుపత్రిలో చేరినపుడు న్యుమోనియా అనుకున్నారట. మనిషి నుండి మనిషికి సోకే వైరస్ అన్న విషయం జనవరి 19వ తేదీ వరకూ తమకూ తెలీదని చెప్పింది. ఎప్పుడైతే వైరస్ మనిషి నుండి మనిషికి సోకుతుందన్న విషయాన్ని గుర్తించగానే యుద్ధప్రాతిపదిక చర్యలు తీసుకున్నట్లు డ్రాగన్ దేశం చెప్పింది.
అయితే పేషంట్ తాలూకు వివరాలను డిసెంబర్ 31వ తేదీన డబ్ల్యూహెచ్ఓ ఉన్నతాధికారులతో పంచుకున్నట్లు చైనా తెలిపింది. తీవ్రత పెరిగిపోతుండటంతో జనవరి 3వ తేదీన నిపుణులు రంగంలోకి దిగారట. జనవరి 4వ తేదీన అంతుచిక్కని న్యుమోనియాగానే దీన్ని డాక్టర్లు, నిపుణులు గుర్తించారు. జనవరి 5వ తేదీన జాతీయ స్ధాయిలో చర్చలు మొదలుపెట్టారట. జనవరి 12వ తేదీన వైరస్ జన్యుక్రమాన్ని విడుదల చేసినట్లు శ్వేతపత్రంలో ప్రభుత్వం చెప్పింది.
జనవరి 14 నుండి వైరస్ నియంత్రణపై డబ్ల్యూహెచ్ఓ నిపుణులతో కలిసి పని మొదలుపెట్టారట. జనవరి 19 వ తేదీన వైరస్ మనిషి నుండి మనిషికి సోకుతుందన్న విషయాన్ని గుర్తించినట్లు చైనా వెల్లడించింది. వైరస్ తీవ్రతపై జనవరి 24న మొదటి నివేదికన డ్రాగన్ విడుదల చేసినట్లు శ్వేతపత్రంలో స్పష్టం చేసింది. సరే శ్వేతపత్రంలో విషయాలు ఎలాగున్నా వైరస్ వ్యాప్తి, నియంత్రణ విషయంలో చైనా ఉద్దేశ్యపూర్వకంగానే ప్రపంచాన్ని దెబ్బ కొట్టిందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపణలు అందరూ చూస్తున్నది. ట్రంప్ వాదనతో మెజారిటి దేశాలు ఏకీభవిస్తున్నాయి.
అందుకనే వైరస్ పుట్టుక, వ్యాప్తి తదితర అంశాలపై దర్యాప్తు చేయాలన్న అమెరికా డిమాండ్ కు మెజారిటి దేశాలు మద్దతుగా నిలిచాయి. ఈ విషయంలో భారత్ కూడా అమెరికాకే మద్దతిచ్చింది. మొత్తం మీద ప్రపంచ దేశాల ఒత్తిడికి లొంగిన చైనా దర్యాప్తుకు అంగీకరించింది. ఇదే సమయంలో చైనాకు డబ్ల్యూహెచ్ఓ మద్దతుగా నిలబడుతోందన్న కారణంతోనే అమెరికా నుండి అందుతున్న నిధులను కూడా ట్రంప్ నిలిపేశాడు. ఇటువంటి సమయంలోనే హఠాత్తుగా చైనా ప్రకటించిన శ్వేతపత్రంపై ప్రపంచదేశాలు ఎలా స్పందిస్తాయో చూడాల్సిందే.