iDreamPost
android-app
ios-app

Child hood fear – దెయ్య‌మంటే భ‌యం!

Child hood fear – దెయ్య‌మంటే భ‌యం!

దేవుడి కంటే దెయ్య‌మంటేనే ఎక్కువ ఇష్టం. చిన్న‌ప్పుడు చాలా గుళ్లూ, గోపురాలు తిరిగాను. పూజారులే త‌ప్ప దేవుడు క‌నప‌డ‌లేదు. సినిమాల్లో మాదిరి క‌ష్ట‌కాలాల్లో క‌నిపిస్తాడేమోన‌ని ఎదురు చూశాను. రాలేదు. దెయ్యాలైనా క‌నిపిస్తాయ‌నుకుంటే అవ‌న్నీ రాజ‌కీయాల్లో , సినిమాల్లో , కార్పొరేట్ ఉద్యోగాల్లో సెటిలైపోయాయి.

మా తాత ఒక క‌థ చెప్పేవాడు. బ‌హుశా ప్ర‌పంచంలోని అంద‌రి తాత‌లు ఈ క‌థ‌నే చెప్పే వుంటారు. అర్ధ‌రాత్రి, అడ‌విలో వెళుతూ వుంటే మేక‌పిల్ల అరుపు. ఆనందంగా భుజాల‌కి ఎక్కుంచుకున్నాడు. కాసేప‌టికి ఒక‌టే బ‌రువు. ఆయాసం పెరిగింది. భుజాలు మోయ‌లేనంత బ‌రువు పెరుగుతున్న మేక‌పిల్ల‌. అర్థ‌మైంది. విసిరి కొట్టాడు. “త‌ప్పించుకున్నావురా కొడ‌కా” అని మేక‌పిల్ల‌లోని దెయ్యం మాయం.

దెయ్యం వేరు, పిశాచి, భూతాలు వేర్వేరు అనుకుంటాం. అదంతా క‌వుల క‌ల్ప‌నే. మంచి దెయ్యాలు, చెడ్డ దెయ్యాలు సినిమా వాళ్ల భ్రాంతి. రాంగోపాల్‌వ‌ర్మ దెయ్యాల సినిమాలు ఎక్కువ ఎందుకు తీశాడంటే ఆయ‌న బుర్రే డెవిల్స్ వ‌ర్క్‌షాప్ కాబ‌ట్టి.

మ‌నుషులు విచిత్రంగా ప్ర‌వ‌ర్తిస్తే నీకేమైనా దెయ్యం ప‌ట్టిందా? అంటారు. మాన‌సిక జబ్బుల‌కి మ‌న‌వాళ్లు పెట్టిన పేరు దెయ్యం. ఒక‌సారి గుంత‌క‌ల్లు స‌మీపంలోని క‌సాపురం ఆంజ‌నేయ‌స్వామి దేవాల‌యంలో దెయ్యాలు ప‌ట్టిన అనేక మంది ఆడ‌వాళ్ల‌ని చూశాను. జుత్తు విర‌బోసుకుని ఏదేదో మాట్లాడ్తున్నారు. దుక్కం వ‌చ్చింది. మాన‌సిక వైద్యులు లేని ఈ దేశంలో, ఉన్నా పేద‌వాళ్ల‌కు అందుబాటులో లేన‌ప్పుడు దేవుడే ఒక డాక్ట‌ర్‌.

చిన్న‌ప్పుడు మా ఇంటికి కొంత దూరంలో బంగ్లా వుండేది. అక్క‌డ ధ‌న‌పిశాచి తిరుగుతోంద‌ని చెప్పుకునే వాళ్లు. రాత్రిపూట కాళ్ల‌కు గ‌జ్జెలు క‌ట్టుకుని ఘ‌ల్లుఘ‌ల్లుమ‌ని తిరుగుతూ “రా, న‌న్ను సొంతం చేసుకో” అని అరిచేద‌ట‌! నిజానికి ఆ ఇంటి య‌జ‌మానే డ‌బ్బు పిశాచిలా వుండేవాడు. వ‌డ్డీల‌కి అప్పులిచ్చి పేద‌ల ర‌క్తం తాగేవాడు. ఆ రోజుల్లోనే ఆయ‌న‌కి షుగ‌ర్‌. జ‌నాల‌కి తిండిలేకుండా బ్లాక్ మార్కెట్ వ్యాపారం చేసేవాడికి క‌డుపు నిండా తిండి వుండేది కాదు. కోర్టుల్లో న్యాయం దొర‌క్క‌పోవ‌చ్చు. కానీ ప్ర‌కృతి (కొంద‌రి దృష్టిలో దేవుడు) లెక్క‌లు వేరే. అంద‌రూ ఇక్క‌డ బాకీ తీర్చుకునే వెళ్లాలి.

సృష్టిలో అన్ని జీవులూ స‌మాన‌మే. కానీ మ‌నిషి ఎక్కువ స‌మానుడు. అందుకే ఆత్మ అన్ని జీవుల్లో ఉన్న , ప్రేతాత్మ‌లు మ‌నిషికి మాత్ర‌మే వుంటాయి. ఒక కుక్క‌, పిల్లి చ‌చ్చిపోయి దెయ్యాలుగా మారుతాయంటే న‌మ్మం, భ‌య‌ప‌డం.

సినిమా వాళ్ల‌కి కొన్ని ఫార్ములాలుంటాయి. ఆ ప్ర‌కారం హార‌ర్ సినిమా అంటే న‌ల్ల పిల్లి, గుడ్ల‌గూబ వుండాలి. న‌క్క వూళ‌ ఎక్స్‌ట్రా మ్యూజిక్‌. అర్ధ‌రాత్రి 12 గంట‌లు. గోడ గ‌డియారం టంగ్ టంగ్‌మ‌ని కొడుతుంది.

మ‌నుషులు , దెయ్యాలు స‌హ‌జీవ‌నం ప్రారంభించిన త‌ర్వాత టైమింగ్ మారిపోయింది. 12 గంట‌ల‌కి ఎవ‌రూ నిద్ర‌పోవ‌డం లేదు. టీవీ సీరియ‌ల్స్ కంప్లీట్ అయ్యేస‌రికి రాత్రి 10 దాటుతుంది. ఇంకా యూట్యూబ్‌, ఫేస్‌బుక్ లైక్స్ కౌంటింగ్ ముగిసే స‌రికి 12 గంట‌లు. టంగ్‌మ‌నే గోడ గ‌డియారాలు లేవు. సెల్‌ఫోన్స్ వ‌చ్చాక గ‌డియారాలు మ్యూజియ‌మ్ స‌రుకుగా మిగిలిపోయాయి. ఒక వేళ దెయ్యాలు వ‌చ్చి భ‌య‌పెట్టాల‌న్నా చాలా క‌న్ఫ్యూజ‌న్‌. రాత్రి మేల్కొని, ప‌గ‌లు నిద్ర‌పోయే జ‌నాల్ని ఏ విధంగా భ‌య‌పెట్టాలి?

అయినా తెల్లారి లేచిన‌ప్ప‌టి నుంచి వంద ర‌కాలుగా భ‌య‌ప‌డుతూ బ‌తుకుతూ వుంటే మ‌ళ్లీ దెయ్యాల భ‌యం అన‌వ‌స‌రం. హార‌ర్‌ సినిమాలు ఆడ‌క‌పోవ‌డానికి కార‌ణం మ‌నుషుల్లో దెయ్యాల భ‌యం పోవ‌డ‌మే.

క‌రోనా మ‌ళ్లీ వ‌స్తుంద‌నే భ‌యం , ఉద్యోగం పోతుంద‌నే భ‌యం, పెట్రోల్ భ‌యం, నాయ‌కులు బూతులు తిట్టుకుని బంద్‌లు చేస్తార‌నే భ‌యం. ఇన్నింటి మ‌ధ్య బెంబేలెత్తి పోతుంటే మ‌ధ్య‌లో దెయ్యం వ‌చ్చి నిను వీడ‌ని నీడ‌ని నేనే అని పాడితే , క‌ర్ర తీసుకుని చావ‌బాదుతాం.

దెయ్యం తెల్ల‌చీర ఎందుకు క‌డుతుందో తెలుసా, ఒక‌ప్పుడు బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో తెల్ల రంగు మాత్ర‌మే స‌రిపోయేది. వేరే రంగులు వాడితే ఎలివేట్ కావు. దెయ్యం ఎఫెక్ట్ రాదు. దెయ్య‌మైనా, దేవుడైనా మ‌నం చూసింది సినిమాల్లోనే క‌దా!

ఇప్పుడైతే మ‌న డైరెక్ట‌ర్లు టైట్‌జీన్స్‌, ష‌ర్ట్ వేసి దెయ్యంలో కూడా సెక్స్ ఫీల్ చూపించ‌గ‌ల‌రు. రాఘ‌వేంద్ర‌రావైతే దెయ్యం బొడ్డు మీద నిమ్మ‌కాయ‌లు దొర్లించి పాట కూడా తీయ‌గ‌ల‌డు. పండ్ల తోట‌ల రైతుల క‌ష్టాన్ని అర్థం చేసుకుని వాళ్ల‌కి గిట్టుబాటు ధ‌ర క‌ల్పించిన ఏకైక తెలుగు డైరెక్ట‌ర్ రాఘ‌వేంద్ర‌రావు.

దెయ్యాల‌కి ప‌వ‌ర్స్ వుంటాయని అనుకుంటాం కానీ, అది నిజం కాదు. ఎందుకంటే ప‌వ‌ర్సే వుంటే క‌రోనా టైంలో త‌మ‌ని దెయ్యాలుగా మార్చి , త‌మ వాళ్ల‌తో ల‌క్ష‌లు ఫీజులు గుంజిన డాక్ట‌ర్ల‌ని ఎప్పుడో న‌మిలి తినేసేవి. దెయ్యాలు లేవ‌ని డాక్ట‌ర్ల‌కి స్ప‌ష్టంగా తెలుసు. శ‌రీర శాస్త్రం చ‌దివిన వాళ్లు. ఆ లోటు తీర్చ‌డానికే వాళ్లే దెయ్యాల వేషాలు వేస్తున్నారు.

దెయ్యాల సంగ‌తేమో గానీ, నాయ‌కుల‌కి మాత్రం ప‌వ‌రే దెయ్యం.

దేవుడు నిజంగా వుంటే, వాడు ఎక్కువ‌గా దెయ్యాల మీద‌నే ఆధార‌ప‌డ‌తాడు. ఎందుకంటే అత‌ని భ‌క్తుల‌ని చెప్పుకునే అనేక మంది మారువేషాల్లో ఉన్న దెయ్యాలే!