iDreamPost
android-app
ios-app

కోనసీమ లో 186 ఏళ్లుగా జరుగుతున్న చెడీతాలింఖానా గురించి తెలుసా..?

  • Published Oct 10, 2021 | 5:27 AM Updated Updated Oct 10, 2021 | 5:27 AM
కోనసీమ లో 186 ఏళ్లుగా జరుగుతున్న చెడీతాలింఖానా గురించి తెలుసా..?

దేశ స్వాతంత్య్ర పోరాట ఉద్యమ స్ఫూర్తితో మొదలు పెట్టిన విద్య నేడు సంస్కృతి సంప్రదాయాల్లో భాగమైంది. నాడు ఆత్మరక్షణ కోసం.. దేశ స్వేచ్ఛా, స్వాతంత్య్రల కోసం అవసరమైతే యుద్ధానికి కూడా సిద్ధం కావాలని ఉద్యమ నేతలు ఇచ్చిన పిలుపు మేరకు యువకులు కర్రలు.. కత్తులు.. లేడి కొమ్ములు.. అగ్గిబరాటాలతో విద్య నేర్చుకున్నారు. తరువాత కాలంలో అది చెడీతాలింఖానాగా పేరొందింది. అదే నేడు దసరా సంభరాల్లో ప్రదర్శనగా మారింది. 186 ఏళ్లుగా అమలాపురంలో దసరా పండుగలో విజయదశమి నాడు ఈ ప్రదర్శన విజయవంతంగా కొనసాగుతుంది.

పచ్చని కోనసీమ కేంద్రమైన అమలాపురం చెడీతాలంఖానా ప్రదర్శనకు పెట్టింది పేరు. దసరా ఉత్సవాలు సమీపిస్తుండడంతో తాలింఖానా ప్రదర్శనకు యువకులు కరసర్తు చేస్తున్నారు. కోనసీమంటేనే పలు సంస్కృతులకు నిలయంగా పేరొందింది. ముఖ్యంగా పండుగల సమయంలో ఇక్కడ జరిగే పలు ప్రదర్శనలు, తీర్థాలకు జాతీయస్థాయిలో గుర్తింపు ఉంది. సంక్రాంతి సమయంలో జరిగే ప్రభల తీర్థాలకు ఉన్న గుర్తింపు తెలియనది కాదు. ఏకంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఈ పండుగ విశిష్ఠితను అభినందిస్తూ ట్విట్టర్‌ ద్వారా సందేశాన్ని పంపించారు. అలాగే మరో పెద్ద పండుగ దసరా. ఈ సమయంలో అమలాపురంలో నిర్వహించే చెడీతాంలిఖానాకు సైతం మంచి గుర్తింపు ఉంది.

గగుర్పాటుకు గురి చేసే ప్రదర్శన.. 

అమలాపురం పట్టణంలో ఏడు వీధులకు చెందిన యువకుల దగ్గర నుంచి వృద్ధుల వరకు చేసే చెడీతాలింఖానా విన్యాసాలు గగుర్పాటుకు గురి చేస్తాయి. కళ్లకు గంతలు కట్టుకుని కత్తులు తిప్పుతారు. మనిషి శరీరంపై ఉంచిన అరటి, కొబ్బరి, బీర, సొరకాయలను కత్తితో నరుకుతారు. అగ్గిబరాటాలను గాలిలో తిప్పుతూ ముచ్చటగొల్పుతారు. యువకులు కర్రలతో దాడి చేస్తుండగా, లేడి కొమ్ములతో కాచుకుంటూ చేసే పోరాటం నభూతో అన్నరీతిలో సాగుతుంది. ఈ పోరాటాలన్నీ ఎంతో సాహసం, నేర్పుతో చేయాల్సి ఉంటుంది. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా మనిషి ప్రాణానికే ప్రమాదం. దసరా ఉత్సవాల్లో పాల్గొనే మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్లమెంట్‌ సభ్యులు కూడా ఈ విన్యాసాలలో పాల్గొని ప్రేక్షకులను అలరిస్తుంటారు.

Also Read : దేశంలోనే మొదటి హరికథా పాఠశాల ఏపీలో ఎక్కడ ఉందో తెలుసా..?

186 ఏళ్ల చరిత్ర..

స్వాతంత్య్రనికి పూర్వం బ్రిటీష్‌ సేనలతో పోరాడేందుకు భారతీయుల్లో ఐక్యత తీసుకువచ్చేందుకు బాలగంగాధర్‌ తిలక్‌ దసరా, వినాయక చవితి ఉత్సవాలను ప్రోత్సహించారు. ఈ ఉత్సవాల్లో కర్రలు, కత్తుల సాముల కోసం యువతకు తర్ఫీదు ఇచ్చేవారు. ఇదే స్ఫూర్తితో 1856లో అమలాపురానికి చెందిన రైతు, స్వాతంత్య్ర సమరయోధుడు అబ్బిరెడ్డి రామదాసు ఈ విద్యకు అంకురార్పణ చేశారు. నాటి నుంచి నేటి వరకు 186 దసరా రోజున ఈ ప్రదర్శన నిర్వహిస్తారు. కొంకాపల్లిలో 1835లో మొదటి తాలింఖానా ప్రదర్శన ప్రారంభమైంది. తమ రాజ్యానికి వ్యతిరేకంగా ఈ ప్రదర్శనలు జరుగుతున్నా, నాటి బ్రిటీష్‌ ప్రభుత్వం దీనిని ఒక కళగా గుర్తించి తామరపత్రం బహూకరించడం విశేషం. 1856లో మహిపాలవీధిలో ప్రారంభిస్తే, ఆయన మనుమడు రాందాసు ఉత్సవాలను నిర్వహించేవారు. ఆయన తరువాత అతని కుమారుడు మల్లేష్‌ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. మూడు పదుల వయస్సులో ఉన్న మల్లేష్‌ విద్యావంతుడు కావడం విశేషం. ప్రస్తుతం అతను అమెరికాలోని టెక్సాస్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా ఉంటున్నారు.

దసరాకు వారం రోజులు ముందే వచ్చి చెడీతాలింఖానా ప్రదర్శనకు కసరత్తు చేస్తుంటారు. అలాగే స్థానిక గండువీధిలోని మైనర్ పార్టీకి చెడీతాలింఖానా ప్రదర్శనలో వందేళ్లకు పైగా అనుభవం ఉంది. 1867లో దీనిని స్థాపించారు. నల్లా వీధిలో చెడీతాలింఖానా ప్రదర్శన 1867 నుంచి మొదలయ్యింది. శ్రీరామపురంలో మైనర్ పార్టీ చెడీ తాలింఖానా 1945 నుంచి మొదలైంది. రవణం మల్లయ్య వీధి, కోకాపల్లి, మహిపాల వీధి, రమణం వీధిల తాలింఖానా ప్రదర్శనలకు సైతం వందేళ్ల చరిత్ర ఉంది.

పురవీధుల్లో నడియాడే ఇంద్రధనస్సులు..

చెడీతాలింఖానా ప్రదర్శనతోపాటు విజయదశమి నాడు జరిగే వాహనాల ఊరేగింపు కన్నులపండుగగా సాగుతుంది. వివిధ వీధులకు చెందిన వాహనాల ప్రదర్శన రాత్రి ఏడు గంటల నుంచి ఆరంభమై.. తరువాత రోజు ఉదయం వరకు కొనసాగుతుంది. ఆయా వాహనాలను రంగురంగు విద్యుత్‌ దీపాలతో అలంకరించి ఊరేగిస్తారు. నింగిన ఉండే ఇంద్రధనస్సులు రాత్రి పురవీధుల్లో నడియాతున్నట్టుగా ఉంటుంది. కొంకాపల్లి నుంచి ఏనుగు అంబారీ వాహనం, ఆంజనేయస్వామి వాహనం, మహిపాల వీధి రాజహంస, గండువీధి శేషశయన, రవణం వీధి మహిషాసరమర్దని, రవణం మల్లయ్య వీధి గరుడ విష్ణు, నల్లా వీధి శ్రీ విజయదుర్గమ్మవారు, శ్రీరామపురం హంస, శ్రీకృష్ణుడు, వినాయ వాహనాలు పురవీధుల్లో ఊరేగుతాయి.ఒకవైపుల విద్యుత్‌ దీపాలతో అలంకరించిన వాహనాలు, మరోవైపు చెడీతాలింఖానా, బాజాభజంత్రీలు, శక్తి వేషాలు, డప్పు వాయిద్యాలు, తీన్‌మార్‌, బుట్టబొమ్మలు, మ్యూజికల్‌ సాంగ్స్‌తో అమలాపురం మారుమ్రోగుతుంది. కాలం ఎంతమారినా.. జీవనం పరుగులు పెడుతున్నా దసరా సంప్రదాయ కళ చెడీతాలింఖానాకు ఆదరణ పెరుగుతుందే తప్ప.. తగ్గడం లేదు.

Also Read : కోనసీమలో ఉన్న తమిళ ఊరు తెలుసా..?