iDreamPost
iDreamPost
గత ఏడాది భీష్మతో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టాక నితిన్ రెండు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే రంగ్ దే విడుదలను మార్చ్ 26కు బ్లాక్ చేసుకోగా తాజాగా చెక్ కూడా రెడీ అవుతోంది. ఇవాళ దీని టీజర్ ని ఫస్ట్ గ్లిమ్ప్స్ పేరుతో విడుదల చేశారు. స్క్రీన్ ప్లేతో కనికట్టు చేసి విభిన్న చిత్రాలతో మెప్పిస్తారని పేరున్న చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వం వహిస్తున్న చెక్ లో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. మొదలుకావడం, పూర్తి చేయడం చాలా వేగంగా కానిచ్చేశారు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందుతున్న చెక్ మీద ఇప్పటిదాకా పెద్దగా అంచనాలు లేవు కానీ ఈ వీడియో చూసాక మాత్రం ఆసక్తి రేగడం ఖాయం.
ఇందులో కథ అధిక భాగం జైలు ప్లస్ కోర్ట్ లో సాగుతున్నట్టు కనిపిస్తోంది. చేయని నేరానికి తీవ్రవాదిగా ముద్రపడి జైలుకు వస్తాడు ఆదిత్య(నితిన్). ఇతను చెక్ ఆటలో అద్భుత నైపుణ్యం కలిగినవాడు. అతనితో పాటు పట్టుబడిన మరో నలుగురికి కలిపి అందరికి ఉరిశిక్ష విదిస్తుంది న్యాయస్థానం. కానీ అతనే తప్పు చేయలేదని గుర్తించిన లాయర్(రకుల్ ప్రీత్ సింగ్)తన కోసం వాదించేందుకు సిద్ధపడుతుంది. మరోవైపు చెరసాలలో ఆదిత్యకు ఎన్నో అవమానాలు, అవహేళనలు. మరి బయటికి రాలేని ఈ పద్మవ్యూహం నుంచి ఎలా తప్పించుకున్నాడు, అసలు దోషులు ఎవరు లాంటి ప్రశ్నలకు సమాధానం తెరమీదే చూడాలి.
సింగల్ లొకేషన్ అయినా మంచి ఇంటెన్సిటీ కనిపించింది. ట్రైలర్ లో హీరో హీరోయిన్ తో పాటు జైలర్ గా నటించిన సంపత్ రాజ్ ని తప్ప ఇంకెవరిని రివీల్ చేయలేదు. సింపుల్ గా అనిపించినా సినిమా చూస్తున్నప్పుడు చాలా టిపికల్ గా అనిపించేలా కథనం రాసుకునే చంద్రశేఖర్ యేలేటి ఇందులో కూడా తన మార్క్ మేకింగ్ తో మేజిక్ చేసినట్టు తెలుస్తోంది. చాలా గ్యాప్ తర్వాత కళ్యాణి మాలిక్ సంగీతం వినిపించనుంది. రాహుల్ శ్రీవాత్సవ్ ఛాయాగ్రహణం సమకూర్చారు. మొత్తానికి ఆసక్తి రేపడంలో యేలేటి సక్సెస్ అయ్యారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన చెక్ టీమ్ విడుదల ఎప్పుడనేది మాత్రం చెప్పలేదు
Link Here @ http://bit.ly/3naJJGY