iDreamPost
android-app
ios-app

టీడీపీ నేత,పారిశ్రామికవేత్త భ‌వ్య ఆనంద్ ప్ర‌సాద్ మీద చీటింగ్ కేసా?

టీడీపీ నేత,పారిశ్రామికవేత్త భ‌వ్య ఆనంద్ ప్ర‌సాద్  మీద  చీటింగ్ కేసా?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోనే కాదు, తెలంగాణ‌లోని టీడీపీ నేత‌ల‌పై కూడా కేసులు న‌మోదు అవుతున్నాయి. “మా కంపెనీలో పెట్టుబ‌డులు పెడితే భారీగా వాటాలు ఇస్తామ‌న్నారు. న‌మ్మి కోటి రూపాయ‌ల పెట్టుబ‌డులు పెడితే న‌యా పైసా ఇవ్వ‌డం లేదు. గ‌ట్టిగా అడిగితే చంపుతామ‌ని బెదిరిస్తున్నారు” అంటూ ఓ బాధితుడు భ‌వ్య సిమెంట్స్ అధినేత, శేరిలింగంపల్లి నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన వెనిగళ్ళ ఆనంద ప్రసాద్ (భవ్యాస్ ఆనంద్ ప్రసాద్)పై ఫిర్యాదు చేశాడు. ఈ మేర‌కు పోలీసులు అత‌నిపై చీటింగ్ కేసు న‌మోదు చేశారు. అంతేకాదు, ఆనంద్ ప్రసాద్ కొడుకు, కోడ‌లిని అరెస్టు చేశారు.

వెనిగళ్ళ ఆనంద ప్రసాద్ భవ్యా కన్‌స్ట్రక్షన్స్ అధినేత, సినీ నిర్మాత కూడా. అంతేకాకుండా తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబునాయుడికి స‌న్నిహితుడిగా పేరుంది. ఆ క్ర‌మంలోనే 2018లో జ‌రిగిన ఎమ్మెల్యే ఎన్నిక‌ల్లో శేరిలింగంప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్య‌ర్థిగా పోటీ చేశారు. ఎన్నిక‌ల్లో భారీగానే ఖ‌ర్చు చేశారు. కానీ గెల‌వ‌లేక‌పోయారు. ప్ర‌స్తుతం కంపెనీ బాధ్య‌త‌ల‌తో పాటు, ప‌లు సినిమాల‌కు నిర్మాత‌గా ఉన్నారు.

ఆనంద్ ప్రసాద్ 2017లో తమ కంపెనీలో పెట్టుబడి పెట్టాలంటూ దానికి బదులుగా ఏటా నాలుగు శాతం లాభాలు తిరిగి ఇస్తామని చెప్పి తన దగ్గర రూ.కోటి డబ్బు తీసుకున్నారని ఓ బాధితుడు పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. డబ్బు తీసుకొని అసలు ప్రతిఫలం ఇవ్వకుండా దాట వేస్తున్నారని, తిరిగి అడిగితే చంపుతామని బెదిరిస్తున్నారని పేర్కొన్నాడు. ఎన్నికల్లో పోటీ చేసి ఒడిపోయినందున తనకు కొంత సమయం ఇవ్వాలని ఆనంద్ ప్రసాద్ గతంలో కోరినట్లు ఫిర్యాదులో వివరించాడు.

తనకు బాచుపల్లి బరంపేట ప్రాంతాల్లో భూములు ఉన్నాయని, వాటిని మీపేరుపై రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పారని అన్నారు. ఇలా చెప్పి కొన్నాళ్ళు గడిపారని ఎన్నిసార్లు అడిగినా సరైన సమాధానం ఇవ్వకపోగా చంపుతామని బెదిరించడంతో తాను ఇలా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తమనే కాకుండా తన లాగా మరో వంద మంది కూడా మోసం చేసినట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు మోసం చేసిన వెనిగళ్ళ ఆనంద్ ప్రసాద్, అతని భార్య, కుమారుడు, కోడలు, శివ కుమార్ అనే వ్యక్తులపై కేసు నమోదు చేశామని పోలీసులు చెప్పారు. ఇప్పటికే కుమారుడిని, కోడల్ని అరెస్ట్ చేసి ఆనంద్ ప్రసాద్ సహా మిగతా వారి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.

ఆనంద్ ప్రసాద్ ప‌లు సినిమాలు నిర్మించారు. గోపీచంద్‌ హీరోగా శౌర్యం, వాంటెడ్, లౌక్యం, సౌఖ్యం చిత్రాలు.. రవిబాబు దర్శకత్వంలో అమరావతి, తేజ దర్శకత్వంలో నీకూ నాకూ డ్యాష్ డ్యాష్ వంటి చిత్రాలను నిర్మించారు. బాలయ్య-పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో వచ్చిన పైసా వసూల్ సినిమా కూడా ఈయన బ్యానర్ నుంచే వచ్చింది. నారారోహిత్‌తో శమంతకమణి, ఇటీవల సందడి చేసిన మిడిల్ క్లాస్ మెలడీస్, చెక్ వంటి సినిమాలకు ఆనంద్ ప్రసాద్ నిర్మాతగా ఉన్నారు.