Idream media
Idream media
పంజాబ్‌లో రాజకీయాలు తాజాగా నలుపు రంగు, మురికి చుట్టూ చక్కర్లు కొడుతున్నాయి.పంజాబ్ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ ఆమ్ ఆద్మీ పార్టీని “నల్ల ఆంగ్లేయులు” అని పిలవడంతో ఆప్,కాంగ్రెస్‌ల మధ్య మొదలైన మాటల యుద్ధం కాక పుట్టిస్తుంది.
పంజాబ్‌లో ఆప్,కాంగ్రెస్‌ల మధ్య సవాళ్లు,ప్రతిసవాళ్లు కొనసాగుతున్న వేళ మోగా జిల్లాలోని బద్ని కలాన్ సభలో సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ పాల్గొన్నాడు.ఈ సందర్భంగా ఆయన ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ చర్మ రంగు గురించి మాట్లాడి తేనెతుట్టెను కదిలించాడు.అతను (కేజ్రీవాల్) నల్లగా ఉండవచ్చు, కానీ అతని ఉద్దేశాలు స్వచ్ఛమైనవని చెప్పడానికి ఆయన తాపత్రయ పడుతున్నాడని చన్నీ ఎద్దేవా చేశాడు. ఇంకా ఆమ్‌ఆద్మీ పార్టీని ఉద్దేశించి 2022లో గెలవడానికి ‘నల్ల ఆంగ్లేయులు’ తెగ ప్రయత్నిస్తున్నారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ఈసారి పంజాబ్‌లో తదుపరి ప్రభుత్వాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ ఏర్పాటు చేస్తుందని కేజ్రీవాల్ మాట్లాడుతున్నాడు. కానీ పంజాబ్‌లో ప్రజలు నివసించలేదా? పంజాబ్‌లో యువకులు లేరా? పంజాబ్‌లో పంజాబీలు లేరా? ‘కాలే ఆంగ్రేజ్’ (బయటి వ్యక్తులు) ఇక్కడికి వచ్చి పాలిస్తారా? అని సీఎం చన్నీ ప్రశ్నించాడు. దేశం నుండి బ్రిటీష్ వారిని తరిమికొట్టిన తర్వాత బయటి వ్యక్తులు పంజాబ్‌ను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఘాటైన విమర్శలు చేశాడు.
గురువారం పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో తిరంగా యాత్ర చేపట్టారు.ఈ సందర్భంగా తనను నల్లవ్యక్తి, మురికి బట్టలు వేసుకుంటాడని చరణ్‌జిత్ సింగ్ చన్నీ చేసిన వ్యాఖ్యలను కేజ్రీవాల్ తిప్పికొట్టారు. నేను చన్నీ సర్‌ని చాలా గౌరవిస్తాను. ఆప్ ప్రభుత్వం ఏర్పడితే మహిళలకు ప్రతి నెల వెయ్యి రూపాయల ఆర్థిక సహాయం చేస్తామని ప్రకటించిన తర్వాత నుంచి సీఎం సర్ నాపై వ్యక్తిగతంగా పరుష పదాలతో విరుచుకుపడుతున్నారు. మొన్న నేను మురికి బట్టలు ధరిస్తానని సీఎం చన్నీ ఎగతాళి చేశాడు. కానీ నేను పంజాబ్‌లోని ప్రతి తల్లికి, ప్రతి సోదరికి వెయ్యి రూపాయలు ఇస్తాను. వాటితో వారు కొత్త బట్టలు కొంటారు. అందులోనే నాకు ఆనందం ఉందంటూ కేజ్రీవాల్ ఎదురుదాడి షురూ చేశారు.
తన కౌంటర్‌ని కేజ్రీవాల్ కొనసాగిస్తూ నిన్న సీఎం చరణ్‌జిత్ సింగ్ నేను నల్లగా ఉంటానని అన్నారు. కానీ నేను ఆయనలా హెలికాఫ్టర్‌లో తిరగను.భూమిపై ప్రజల మధ్య తిరుగుతాను. అందుకే తన బట్టలు మురికిగానే ఉంటాయని చన్నీకి కౌంటర్ ఇచ్చారు. పంజాబ్ అమ్మలు నాలాంటి నలుపు కొడుకును ఇష్టపడతారని,పంజాబ్ సోదరీలు తనలాంటి నలుపు సోదరుడిని ఇష్టపడతారని కేజ్రీవాల్ అన్నారు. నేను నల్లగా ఉంటాను కానీ నా నిజాయితీ నలుపు కాదు. ఈ మురికి బట్టలు వేసుకునే వ్యక్తే, ఈ నలుపు వ్యక్తే హామీలన్నీ నెరవేరుస్తాడని హామీ ఇస్తున్నానని ఆయన ప్రకటించారు.
ఎన్నికల సమయం దగ్గర పడే కొద్దీ ఇరు పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.పంజాబ్‌లో నువ్వా నేనా అన్నట్లు ఎన్నికల పోరు నడుస్తుండటంతో ఈ దూషణల పర్వానికి ఫుల్ స్టాప్ పడే అవకాశం కనుచూపు మేరలో కానరావటం లేదు.