Idream media
Idream media
ఆంధ్రజ్యోతి అంటే నాకు ఇష్టం. 16 ఏళ్లు పని చేశాను. ఆఖరి జీతం రూ.16 వేలు. దానికి బాధ లేదు. రాధాకృష్ణ అంటే గౌరవం. 2002లో జర్నలిస్టులంతా కష్టాల్లో ఉన్నప్పుడు సాహసంతో రీస్టార్ట్ చేసారు. ఉపాధి కల్పించారు. జ్యోతి అసలు ఓనర్లు చంద్ర బాబు, సీఎం రమేశ్, విజయ ఎలక్ట్రికల్స్ ఇలా ఎన్నో పేర్లు వినిపించినా ,ఏది నిజమో తెలియదు .
జ్యోతి అంటే ఎందుకిష్టమంటే, అక్కడ పూర్తి స్వేచ్ఛ వుండేది. అందుకే కొన్ని వందల ప్రత్యేక కథనాలు రాయగలిగాను. జర్నలిస్టుగా నేను మెరుగు పడడమే కాదు, ఎంతో మంది పేదల జీవితాలు కూడా బాగుపడ్డాయి. ఒక పదేళ్ల పసిపాపని యజమానురాలు చిత్రహింసలు పెట్టిన సంఘటనని (అనంతపురంలో 2004లో జరిగింది) కథనంగా రాస్తే నాకు రాష్ట్రస్థాయి ఉత్తమ జర్నలిస్టు అవార్డు ఇచ్చారు. 2006లో అవార్డు వస్తే ఆ ఏడాది నాకు ఇంక్రిమెంట్ రూ.300 ఇచ్చారు. తమ పేరుని తెలుగులో సరిగా రాసుకోలేని వాళ్లు కూడా ప్రత్యేక నైపుణ్యాలతో జీతాన్ని బాగా పెంచుకోగలిగారు. నేను ఆ నైపుణ్యం లేనివాన్ని. గంజాయి మొక్కలకి గౌరవం పెరుగుతున్న చోట ఉండడం తగదని 2007లో సంస్థని వదిలేశాను. అన్నీ రాధాకృష్ణకి తెలిసి జరగాలని రూలు లేదు. గొప్ప వాళ్లు అంతే, సమాజం హెచ్చుతగ్గుల్ని పరిశీలిస్తారు కానీ, పక్కనున్న వాళ్లని తూకం వేయలేరు.
అయినా నాకు ఆంధ్రజ్యోతి అంటే ఇష్టమే. ఎందుకంటే విభిన్న స్వరాలు వినిపించే చోటు. మిగతా పత్రికల్లో స్పేస్ లభించని అనేక వర్గాల వాయిస్ అక్కడ అచ్చులో కనిపించేది. అయితే అది రానురాను జగన్ వ్యతిరేక స్వరంగా , రాధాకృష్ణ సొంత గొంతుగా, చంద్రబాబు మారు గొంతుగా మారిపోయింది.
జగన్ మానసిక స్థితి సరిగా లేదని రాధాకృష్ణ చేస్తున్న ప్రచారం, జర్నలిస్టు దబాయింపు చాలా విచిత్రంగానూ, రాధాకృష్ణపై జాలి కలిగే విధంగా ఉంది. జర్నలిస్టులు సోర్స్ చెప్పరని, ఆయన కంటే ముందు కాలమ్స్ రాసిన కొందరి పేర్లు కూడా ఉదహరించారు. నిజమే వాళ్లంతా విధానాలపై వ్యతిరేకంగా రాశారు కానీ, వ్యక్తిత్వాలకి వ్యతిరేకంగా కాదు. తెలుగుదేశం వీరాభిమాని ఐ.వెంకట్రావ్ కూడా ఏనాడూ కూడా కోట్ల విజయభాస్కర్‌రెడ్డికి మతిస్థిమితం లేదని, చెన్నారెడ్డికి కలలో దేవుడు కనిపిస్తాడని రాయలేదు. ఈ కొత్త తరహా జర్నలిజానికి ఒక పత్రిక యజమానే పూనుకోవడం విచిత్రం. అసలు జగన్ గురించి చెప్పిన ఐఏఎస్ అధికారి మానసిక స్థితి ఏమిటనేది ప్రశ్న.
దేన్నైనా నిర్భయంగా నిలదీస్తామనే రాధాకృష్ణ ఎప్పుడైనా బాబును నిలదీశారా? అనేక సందర్భాల్లో బాబు మతిస్థిమితం లేని మాటలు మాట్లాడారు. అప్పుడు ఆయన స్థితిపై ఒక్క వాక్యమైనా రాశారా? లోకేశ్ అపరిపక్వతతో నోటికొచ్చింది మాట్లాడుతుంటే ఒక్క కాలమ్‌లోనైనా దీన్ని ప్రశ్నించారా? ఇంత శూన్యతతో ఉన్న వ్యక్తికి పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ కీలక పదవులు ఇస్తే ఒక్క సారైనా కేవలం చంద్రబాబు కొడుకుగా తప్ప ఈయనకున్న అర్హతలేంటి అని నిలదీశారా? లేదు, ఎందుకంటే మీరు నిజాలే రాస్తారు, కానీ అవి మీకిష్టమైన నిజాలై ఉండాలి. సత్యాన్నే శోధిస్తారు . కానీ అది మీకు నచ్చిన సత్యమై వుండాలి.
Also Read : అవసరాలకోసం అడ్డదారులు తొక్కే విలన్లేనా అంతా?RK కొత్తపలుకులు అర్థమేమిటి?
ప్రతి వారం జర్నలిజం విలువల గురించి మాట్లాడ్తారు. మంచిదే, అయితే సజ్జలని సాక్షి ఆఫీస్‌లో పనిచేసే గుమాస్తా అని బాబు అంటే, మీరు దాన్ని ఖండించారా? దశాబ్దాల జర్నలిజం అనుభవంతో సాక్షి పత్రికకి ఎడిటోరియల్ డైరెక్టర్‌గా ఆయన పనిచేశారు. యాజమాన్య హక్కుని పక్కకి పెడితే మీరూ, ఆయన సమానమే హోదాలో. ప్రభుత్వంతో ఉంటే ఆయన జర్నలిస్టు కాకుండా పోతారా? బాబు నోటి దురుసు గురించి ఒక్క సారైనా మందలించారా? లేదు. మీకు ఇష్టులు మాట్లాడిన ప్రతిదీ ప్రజాస్వామ్యమే.
జగన్ మానసికంగా ఎంత బలవంతుడో ప్రజలకి తెలుసు. సాక్షాత్తు ఈ దేశాన్ని శాసించే సోనియాగాంధీ ఆగ్రహానికి , కక్ష సాధింపులకు గురై అష్టకష్టాలు పడినప్పుడే ఆయన జంకలేదు. ఓడిపోతే రెట్టింపు పట్టుదలతో పోరాడారు. ప్రజల్లో ఒక దశాబ్దం పాటు తిరిగిన నాయకుడు గతంలో ఎవరైనా ఉన్నారా? జగన్‌ని వేరే విధంగా ఎదుర్కోలేక ఈ రకం ప్రచారం చేస్తే నరకంలో ఉన్న గోబెల్స్ కూడా షాక్‌కు గురై మళ్లీ చచ్చిపోతాడు.
నిష్పక్షపాతమే మీ అభిమతమైతే సుదీర్ఘ కాలం పోరాటం చేసిన జగన్‌ని మెచ్చుకుంటూ ఒక్క సారైనా రాశారా? టీ బంకుల దగ్గర రాజకీయాలు మాట్లాడే వాళ్లకి కూడా జగన్ అధికారంలోకి వస్తాడని అర్థమైనప్పుడు, ఇంత అనుభవం ఉన్న మీరు చంద్రబాబు ఓడిపోతున్నాడని ధైర్యంగా రాయగలిగారా? లేదు. ఎందుకంటే మీకు నచ్చనిది నిజం కాదు, మీకు అప్రియమైనది సత్యం కాదు.
ఐదేళ్లు తప్ప మిగతా అన్ని ప్రభుత్వాలతో ఘర్షణ పడ్డానని మీరే చెప్పుకున్నారు. ఆ ఐదేళ్లు ప్రభుత్వం తప్పులే చేయలేదా? అన్నీ ఒప్పులు చేస్తే బాబు ఎందుకు ఓడిపోయారు.
మీ పేరు చెప్పుకుని సోషల్ మీడియా, యూట్యూబ్ బాబులు డబ్బులు సంపాయిస్తున్నారని రాశారు. పోనీలేండి. మీ సంస్థలో జీతాలు ఎలాగూ పెరగవు. మీ సంస్థలో చేసేవాళ్ల కంటే బయట మీ పేరు చెప్పుకున్న వాళ్లే సంతోషంగా ఉన్నారు.
ఇది రాసినందుకు నేను సాక్షి పేటిఎం బ్యాచ్ కాదు. అక్కడ ఉద్యోగం మానేసి ఏడేళ్లైంది. మీకు నచ్చని రాజకీయ నాయకులనే కాదు, మీకు నచ్చని రాతలు రాసే జర్నలిస్టుల్ని కూడా నిందించడం మీ హక్కు. ఇప్పుడు కూడా ఆంధ్రజ్యోతి అంటే గౌరవమే. అర్ధసత్యాలు, అబద్ధాలు రాయాలంటే చాలా ధైర్యం, దమ్ము ఉండాలి!
Also Read : పాత్రికేయ విలువలు విడిచి విషం కక్కుతున్న కలం ఆంధ్రజ్యోతి