Idream media
Idream media
ప్రభుత్వం ఒక పథకం ప్రారంభించబోతోందంటే ఎంతో హాడావుడి. భారీ బహిరంగ సభ. పదిహేను రోజుల ముందు నుంచే సభకు సంబంధించిన ఏర్పాట్లు. కలెక్టర్లు, జిల్లా ఎస్పీ సమీక్షల హడావుడి. టీవీలు, పేపర్లలో ప్రకటనలు. ఫ్లెక్సీలు, మంది తరలింపు, ఆర్టీసీ బస్సుల ఉపయోగంతో ప్రయాణికుల ఇక్కట్లు. సభ జరిగే జిల్లాతోపాటు చుట్టుపక్కల జిల్లాల నుంచి జనాలను తరలింపు బాధ్యతల తీసుకున్న నేతల ఉరుకుల పరుగులు. మహిళల తరలింపునకు అంగన్‌వాడీలు, డ్వాక్రా సీవోల పాట్లు. గంటల కొద్దీ సీఎం ప్రసంగం. సభలో సీఎంను పొగుడుతూ లబ్ధిదారులు ప్రసంగాలు. అందుకోసం వారికి ముందే శిక్షణలు. థ్యాంక్యూ సీఎం సర్ అనే ప్లకార్డులు. ఆపై సీఎం చెక్కులు పంపిణీ.. మీడియా ప్రతినిధులు పాట్లు.. ఇంత హడావుడి జరిగితేగానీ ఓ సంక్షేమ పథకం ప్రారంభం అయ్యేది కాదు. కానీ ఆరు నెలల్లో ఎంత మార్పు.
లక్షల మందికి కొత్త పింఛన్ల మంజూరు, కొత్త – పాత లబ్ధిదారులు 54.64 లక్షల మందికి ప్రయోజనం చేకూరేలా ఇంటి వద్దకే పింఛన్ నగదు తీసుకొచ్చి ఇచ్చే పింఛన్ డోర్ డెలివరీ పథకం. ఏ హడావుడి లేదు. ఆర్బాటం లేదు. సభలేదు. సీఎం స్పీచ్ లేదు. లబ్ధిదారుల పొగడ్తలు లేవు. తన కార్యాలయంలో సీఎం కూర్చున్నారు. ఒకటో తేదీన ఆరు గంటలకే పింఛన్ నగదు లబ్ధిదారులు ఇంటి వద్దకే వెళ్లి ఇవ్వాలని ఆదేశించారు.
ఆదేశాలు అందడమే తరువాయి.. వాలంటీర్లు కదిలారు. కోడి కూయగానే లేచారు. మొహంపై చన్నీళ్లు చల్లుకుని.. ఒక చేతిలో నగదు సంచి. మరో చేతిలో ఫోన్, స్కానర్ పట్టుకుని బయలుదేరారు. అప్పటికింకా చీకట్లు తొలగలేదు.. సూర్యుడు సుభోదయం చెప్పలేదు. లబ్ధిదారులు ఇంటి వద్ద వాలంటీర్లు ప్రత్యక్షమయ్యారు. నిద్ర మంపు పోకముందే వృద్ధులు, వికలాంగులు, వితంతువుల చేతిలో పింఛన్ నగదు పెట్టారు.
ఓ పక్క పింఛన్ ఇస్తూ వెళుతుంటే.. మరో పక్క లబ్ధిదారులు రోజు వారీ పనుల్లో నిమగ్నమయ్యారు. మగదిక్కును కోల్పోయి.. కుటుంబ భారం మోసేందుకు పొలం పనులకు వెళ్లిన ఆ అక్కకు పింఛన్ ఇచ్చేందుకు పొలం వద్దకే వాలంటీర్ వెళ్లాడు. నడవలేని స్థితిలో ఇంటì లో తన మంచానికే పరిమితమైన వికలాంగుల వద్దకు.. ఇలా లబ్ధిదారులు ఎక్కడుంటే అక్కడకు వెళ్లి పింఛన్ నగదు ఇచ్చారు.
భారత్ దేశంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు మునుపెన్నడూ అమలు చేయని పథకాన్ని ఈ విధంగా సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. పింఛన్ డోర్ డెలివరే ఒక చరిత్ర అనుకుంటే.. ఏ మాత్రం హాడావుడి, ప్రచారం లేకుండా ప్రారంభించడం మరో చరిత్ర. ఓట్ల వేట కోసం సంక్షేమ పథకం ప్రారంభం అనే స్థాయి నుంచి పథకం ప్రజల సంక్షేమం కోసం అనే స్థితికి ప్రభుత్వ పరిపాలన రావడం సుభపరిణామం.