iDreamPost
android-app
ios-app

చంద్రజ్యోతి పత్రికాధిపతి గోపికృష్ణ తపస్సు ఎందుకు?

చంద్రజ్యోతి పత్రికాధిపతి గోపికృష్ణ తపస్సు ఎందుకు?

పాతాళ భైరవి’ సినిమాలో ఎన్టీఆర్ దగ్గరుండే అమ్మవారి ప్రతిమ; ఎక్కడికైనా సరే ఆకాశంలో ఎగురుకుంటూ తీసుకెళ్ళే ఏఎన్నార్ ‘కీలుగుర్రం’; ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ సినిమాలో చిరంజీవికి దొరికే మహిమలు గల ఉంగరం; ‘హ్యారీ పోటర్’లో పిల్లోడి చేతిలో ఉండే మంత్రదండం; ‘మిస్టర్ ఇండియా’ సినిమాలో లాగా చేతికి కట్టుకుంటే మాయమైపోయే వాచీ …

వీటన్నిటి కోసం చంద్రజ్యోతి పత్రికాధిపతి గోపికృష్ణ తపస్సు చేయాలని డిసైడ్ అయిపోయాడు.

“మనం ఎవరికైనా ప్రత్యక్షమైతే ఏదో ఒక వరమిస్తాం కానీ తపస్సు మొదలుపెట్టడమే ఇన్ని డిమాండ్లతో ఏమిటో ” అని అర్ధం కాక ముక్కోటి దేవతలు హుటాహుటిన ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతో ఒక ప్రత్యేక త్రిసభ్య కమిటీ వేయాలని మెజారిటీ సభ్యుల వాదన, కొందరేమో కమిటీలో శివుడు ఉండటానికి వీల్లేదని, ఆయన రాక్షసులందరికీ వరాలిచ్చినందువల్లనే అందరూ ఇలా తపస్సులు చేస్తున్నారు. ఆయన కమిటీలో ఉంటే రిపోర్టును ప్రభావితం చేయగలడని కొందరు గగ్గోలు పెట్టడంతో ఇంద్రుడు ఓటింగ్ నిర్వహించాడు. మెజారిటీ సభ్యులు ముందుగా అనుకున్నట్టుగానే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతో కమిటీ వేసేందుకే మొగ్గు చూపడంతో ఇంద్రుడు త్రిసభ్య కమిటీని, దాని విధివిధానాల్ని, నివేదిక సమర్పించవలసిన గడువు తేదీని ప్రకటించాడు. కొంతకాలం పాటు ముగ్గురూ కలిసి ఎంత ఆలోచించినా గోపికృష్ణ కోరిక వెనకాల కారణం ఏంటో వారికే అర్ధం కాలేదు. ఇక చేసేదేమి లేక భూలోకానికి వచ్చి గోపికృష్ణ ముందు ప్రత్యక్షమయ్యారు.

“నీ భక్తికి మెచ్చి కాదు, నీ బుర్రలో ఉన్న కోరికల జాబితా తెలిశాక పిచ్చి ఎక్కి వచ్చాం. అన్ని వెరైటీల వస్తువులు దేనికి నాయనా ? ” అని కమిటీ క్వశ్చన్ చేసింది.

దానికి గోపికృష్ణ సమాధానం – “ప్రపంచ బాబును ముఖ్యమంత్రిని చేయడానికి”

విష్ణుమూర్తి : “అప్పుడు అదొక్కటి అడగచ్చుగా – ఇవన్నీ దేనికి ?”

“పాతాళ భైరవి సినిమాలోలా ప్రతిమ ఉంటే అమ్మవారి దయతో ముఖ్యమంత్రి అవ్వడమే కాక అన్ని కట్టడాలు ఆటోమేటిగ్గా రాత్రికి రాత్రే అయిపోతాయి; ఆ ‘కీలుగుర్రం’ ఉంటే ప్రపంచ బాబు గారు ఎంచక్కా ఏ దేశానికైనా వెళ్ళచ్చు – రేపు “పెట్టుబడుల కోసం నేను గుర్రం మీద వెళ్ళాను” అని చెప్పుకోవచ్చు కదా, చిరంజీవి ఉంగరం ఉంటే ప్రపంచ బాబు గారు అలా అసెంబ్లీలో వేలు చూపించగానే ప్రతిపక్షాల వాళ్ళు సైలెంట్ అయిపోతారు, మంత్రదండం చేతిలో ఉంటే ప్రతీ ఎన్నికల్లో ప్రచారానికి వెళ్ళినప్పుడు జనాన్ని హిప్నాటైజ్ చేయడానికి” అని గుక్క తిప్పుకోకుండా చెప్పాడు.

లోకాల్ని ఆడించేవాళ్ళకే గోపికృష్ణ ఆలోచనలకు మతిపోయి “మరి చివరిలో ఆ వాచీ ఎందుకు ?” అని అడిగారు. “అది నాకు స్వామీ… అది కట్టుకుని మాయమైపోయి ముఖ్యమంత్రి సూర్యం పక్కనే ఉంటూ అన్ని ప్లాన్లు వినడానికి” అని ఠక్కున చెప్పాడు. “ఇన్ని వరాలు ఉన్నా కూడా మళ్ళీ ఆ గోల నీకు ఎందుకు ?” అని శివుడు ఆగ్రహించాడు. “అయినా కూడా ఏదోలా ప్రపంచబాబు గారిని దెబ్బ తీస్తాడు, అందుకే ముందు జాగ్రత్త కోసం” అంటూ దీనంగా మొహం పెట్టాడు గోపికృష్ణ.

దీనంగా మొహం పెట్టిన గోపికృష్ణ ను చూడగానే శివుడి కి కోపం స్థానే జాలి కలిగింది. ఎంతైనా భోళా శంకరుడు కదా ! ఎంతో మంది రాక్షసులకు వరాలిచ్చాము కదా, ఈయనకు కూడా ఇచ్చేద్దామని నిర్ణయించుకున్నాడు. గోపికృష్ణ “త్వరగా, త్వరగా ఇవ్వండి” అంటూ కంగారు పెట్టాడు. ఆయన అసహనం, బాధ అర్ధం చేసుకున్న ముక్కంటి బోనస్ గా “ఆదిత్య 369 సినిమాలోని ‘టైం మెషీన్’ కూడా ఇస్తాను, అందులో ఇవన్నీ తీసుకెళ్ళి ఒక పదిహేనేళ్ళు ముందుకు వెళ్ళి అసలు ఇంద్రశేఖర్ రెడ్డి గెలవలేని పరిస్థితులు కల్పించు” అన్నాడు. గోపికృష్ణ వెంటనే “అదేదో 1983 దాకా వెళ్ళిపోయి తెలుగు రావ్ బదులు అప్పుడే ప్రపంచ బాబును ముఖ్యమంత్రిని చేయగలిగే అవకాశం ఉంటుందా?!” అని అడిగాడు. నాలుగు తలలతో ఆలోచించినా ఒక వ్యక్తి పైన ఇంత ప్రేమ ఎలా అని బ్రహ్మకు అర్ధం కాలేదు. ఇక వదిలేలా లేడని “నీ కోసం మొత్తం కాలాన్నే వెనక్కు తీసుకెళతా, తధాస్తు” అని కైలాసానికి త్రిమూర్తులు బయల్దేరారు.

 వాళ్ళు అలా రెండు అడుగులు వేయగానే – గోపికృష్ణ మళ్ళీ “స్వామీ … ” అని పిలిచాడు. “ఇంకా ఏమి కావాలి నాయనా ?” అని అడిగాడు విష్ణు.

“అల్లావుద్దీన్ అద్భుతదీపం, అలీ సినిమాలో ‘భవిష్యవాణి’ బుక్ కూడా …” అంటూ సణిగాడు.

“ఇన్ని ఉన్నాయి కదా ? మళ్ళీ అవెందుకు ?” అని ముగ్గురూ ఒకేసారి తిరిగి ప్రశ్నించారు.

“మీకు తెలియదు స్వామి … ఇన్ని ఉన్నా కూడా ప్రపంచ బాబు గారు మళ్ళీ గెలవలేకపోవచ్చు” అనడంతో ముగ్గురూ మాయమైపోయారు.

నేను ఉలిక్కిపడి లేచా – ఉదయం పది అయింది టైం అప్పుడు. ఎదురింటోళ్ళు ఊరెళ్ళారు, వాళ్ళ ఆంధ్రజ్యోతి పేపర్ మా ఇంట్లో వేశాడు పేపర్ బాయ్. కాఫీ తాగుతూ ‘కొత్త పలుకు’ చదువుకుని నా కల నిజమైనా ఆశ్చర్యం లేదనుకున్నా.