Idream media
Idream media
మూలిగే నక్క మీద తాటికాయ పడ్డ చందంలా మారింది తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తున్న పనబాక లక్ష్మి పరిస్థితి. అసలే ప్రస్తుతం రాష్ట్రంలో టీడీపీ పరిస్థితి అంతంత మాత్రమే. ఈ నేపథ్యంలో పోటీలో ఉండాలా, వద్దా అనే మీమాంసలో మొదటి నుంచీ పనబాక ఉన్నట్లుగా అనేక వార్తలు వెల్లువెత్తాయి. ఆ వార్తలకు తగ్గట్టుగానే పనబాక వ్యవహార శైలి కూడా ఉండేది. అందరి కంటే ముందుగానే అభ్యర్థిగా డిక్లేర్ అయినప్పటికీ దాన్ని ఉపయోగించుకోకుండా చాన్నాళ్లు పనబాక సైలెంట్ గానే ఉన్నారు. ఓ క్రమంలో ఆమె బీజేపీ వైపు చూస్తున్నారన్న వార్తలూ వచ్చాయి.
ఈ క్రమంలో తిరుపతి లోక్ సబ ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదలయ్యాక చంద్రబాబు నిర్వహించిన తొలి సమావేశంలో పాల్గొన్న పనబాక పోటీకి సిద్ధమన్న క్లారిటీ ఇచ్చారు. అందరి కంటే ముందుగానే అభ్యర్థిగా తెరపైకి వచ్చిన పనబాక ఆలస్యంగా ప్రచారం మొదలుపెట్టి ఏదో విధంగా మిగిలి ఉన్న టీడీపీ శ్రేణులను కలుపుకుని ముందుకు వెళ్తున్నారు. కొంత మంది ప్రచారంలో ఆమెకు కలిసి వచ్చేవారు. మండల, పరిషత్ ఎన్నికలపై చంద్రబాబు చేసిన ఆ ప్రకటనతో పనబాక ప్రచారంలో ఒక్కసారిగా జోరు తగ్గింది. కొంత మంది ప్రచారానికి దూరం అయ్యారు.
వైసీపీ 2019 సాధారణ ఎన్నికల్లో తిరుపతి లోక్ సభ స్థానాన్ని భారీ మెజార్టీతో గెలుచుకుంది. ఆ పార్టీ తరపున బరిలో దిగిన బల్లి దుర్గా ప్రసాద్ భారీ విజయం నమోదు చేశారు. అంతకుముందు 2014 ఎన్నికల్లో కూడా ఈ స్థానం వైసీపీదే. ఆ ఎన్నికల్లో వరప్రసాద్ గెలిచారు. కానీ, ఆయన 2019లో ఏపీ అసెంబ్లీ కి పోటీ చేయడంతో ఆయన స్థానంలో బల్లి దుర్గా ప్రసాద్ బరిలో దిగి గెలిచారు. మొన్నటి ఎన్నికల్లో మొత్తం 16,50,453 ఓట్లకు గానూ దాదాపు 80 శాతం పోలింగ్ అయ్యింది. పోలైన 13 లక్షల పైచిలుకు ఓట్లలో వైసీపీ 55 శాతం దక్కించుకుంది. ఆ పార్టీ అభ్యర్థికి 7,22,877 ఓట్లు దక్కాయి. 2019లో కూడా పనబాకే తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేశారు. ఆమె 4,94,501 ఓట్లు అంటే 37 శాతం సాధించారు. దీంతో ఉప ఎన్నికలో టీడీపీ టికెట్ ఆమెకే ఇచ్చింది. కనీసం ద్వితీయ స్థానంలో అయినా నిలబడాలనే తపనతో టీడీపీ శ్రేణులను కలుపుకుని పనబాక ప్రచారం నిర్వహిస్తున్నారు.
Also Read : గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు వైసీపీ కుట్రట.. జనసేనకు అసలు నిబంధనలు తెలుసా..?
ఇదిలా ఉండగా, పనబాక ప్రచారంలో మూడు రోజుల క్రితం వరకూ ఉన్న తెలుగు తమ్ముళ్లలో చాలా మంది ఇప్పుడు కనిపించడం లేదు. అందుకు కారణం చంద్రబాబే కారణం గమనార్హం. దీనికి కూడా ఆ ప్రకటనే కారణం. మండల, పరిషత్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని తిరుపతి లోక్ సభ పరిధిలోని నియోజకవర్గాల్లోని మండలాలకు చెందిన నేతలు పనబాక తో కలిసి ప్రచారంలో కలిసి వచ్చేవారు. ఎన్నికలను టీడీపీ బహిష్కరిస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించడంతో వారి ఉత్సాహం నీరు గారింది.
ఈ లోక్ సభ పరిధిలో 7 నియోజకవర్గాలు ఉండగా, వాటి పరిధిలో 40 మండలాలు ఉన్నాయి. సర్వేపల్లి నియోజకవర్గం లోని పొదలకూరు, తోటపల్లిగూడూరు, ముత్తుకూరు, వెంకటాచలం, మనుబోలు, గూడురు నియోజకవర్గంలోని గూడూరు, చిలకూరు, కోట, వాకాడు, చిత్తమూరు.. సూళ్ళూరుపేట నియోజకవర్గంలో ఓజిలి, నాయుడుపేట, పెల్లకూరు, దొరవారిసత్రం, సూళ్ళూరుపేట, తడ.., వెంకటగిరి నియోజకవర్గంలో కలువోయ, రాపూరు, సైదాపురం, డక్కిలి, వెంకటగిరి, బాలాయపల్లి.., తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గంలో తిరుపతి, తిరుమల, తిరుపతి, అక్కరాంపల్లి, తిరుపతిలోని కొంత భాగం, శ్రీకాళహస్తి నియోజకవర్గంలో శ్రీకాళహస్తి (పట్టణ), రేణిగుంట, ఏర్పేడు, శ్రీకాళహస్తి (గ్రామీణ), తొట్టంబేడు.., సత్యవేడు అసెంబ్లీ నియోజకవర్గంలో సత్యవేడు, నిండ్ర, బుచ్చినాయుడు కండ్రిగ, వరదయ్యపాలెం, కె.వి.బి.పురం,
పిచ్చాటూరు, నాగలాపురం, నారాయన వణం మండలాలు ఉన్నాయి.
సర్వేపల్లి, గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి, తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాలలోని మండలాలకు చెందిన కొంత మంది నేతలు మండల పరిషత్ ఎన్నికల్లో టీడీపీ తరఫున గతంలో నామినేషన్లు దాఖలు చేశారు. కొందరు వైసీపీలోకి వెళ్లిపోయినా ఇంకొందరు మాత్రం టీడీపీ నుంచే పోటీకి సిద్ధంగా ఉన్నారు. వారిలో చాలా మంది ఉప ఎన్నిక ప్రచారంలో తమ అనుచరులతో కలిసి పాల్గొనేవారు. అనూహ్యంగా పరిషత్ నోటిఫికేషన్ విడుదల కావడం, ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు విచిత్రంగా చంద్రబాబు ప్రకటించడం పార్టీపైనే కాదు, తిరుపతి ఉప ఎన్నికపై కూడా ప్రభావం చూపుతోంది. ఈ ఎన్నిక జరుగుతుండగానే చంద్రబాబు అలా ప్రకటించడంపై పనబాక తల పట్టుకుంటున్నట్లు తెలుస్తోంది. ఏరకంగా చూసినా ఆ నిర్ణయం పనబాకకు శాపంగా మారినట్లే.
Also Read : తిరుపతి ఉప ఎన్నిక కేంద్రానికి, టీడీపీకి మధ్య యుద్ధమని బాబుకు తెలుసా పనబాక లక్ష్మీ గారు..?