Idream media
Idream media
ఏడు పదులకు పైబడిన వయస్సు, నాలుగు పదులపైబడిన రాజకీయ జీవితం.. మూడు సార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తి నుంచి ఎలాంటి రాజకీయం ఆశిస్తారు..? నలుగురికి ఆదర్శవంతమైన, నైతిక విలువలతో కూడిన రాజకీయాలు సదరు రాజకీయ నేత నుంచి ఎవరైనా ఆశిస్తారు. రాజకీయాల్లోకి వచ్చే వారు, కొత్తగా వచ్చిన వారు ఆయన నడిచిన బాటలో పయనించేలా ఉండాలనుకుంటారు. కానీ రాజకీయ ప్రయోజనాలే పరమావదిగా వ్యవహరించే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నుంచి ఇలాంటివి ఆశించలేమని మరోమారు రుజువైంది.
తాజాగా మత్తు డాక్టర్ సుధాకర్ మరణంపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఆయన రాజకీయ శైలిని తెలియజేస్తున్నాయి. శవరాజకీయం అంటూ రాజకీయ నేతలు తరచూ మాట్లాడుతుంటారు. చంద్రబాబు చేస్తున్న రాజకీయం ఇలానే ఉంది. మత్తు డాక్టర్ సుధాకర్ గుండెపోటుతో మరణించారు. ఈ విషయం ఆయన కుటుంబ సభ్యులు, వైద్యులు ధృవీకరించారు. అంత్యక్రియలు పూర్తయ్యాయి. అయితే చంద్రబాబు మాత్రం సుధాకర్ మరణాన్ని వైసీపీ ప్రభుత్వానికి, సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి ఆపాదిస్తూ విమర్శలు చేస్తున్నారు.
సీఎం వైఎస్ జగన్ అనుసరిస్తున్న ఎస్సీ వ్యతిరేక చర్యలకు సుధాకర్ మరణించారంటూ చంద్రబాబు ఆరోపించారు. ప్రభుత్వం కక్ష సాధించడం వల్లనే సుధాకర్ మరణానికి కారణమన్నారు. మాస్కులు అడిగిన పాపానికి ఆయన్ను మానసికంగా, శారీరకంగా హింసించి చంపారని, సుధాకర్ కుటుంబానికి కోటి రూపాయల పరిహారం అందించాలంటూ చంద్రబాబు డిమాండ్ చేశారు.
ఇలాంటి విమర్శలు చేయడంతోనే చంద్రబాబు శవ రాజకీయాలు చేస్తున్నారనాలి. మత్తు డాక్టర్ సుధాకర్ వ్యవహారం జరిగి ఏడాదిపైనే అవుతోంది. ఆ వివాదం సమసిపోయింది. ప్రభుత్వాన్ని విమర్శించడం తప్పేనని, తన చర్యలకు చింతిస్తున్నానంటూ సుధాకర్ బహిరంగంగా ప్రకటించారు. టీడీపీ నేతల ప్రోద్బలంతోనే తాను అలా మాట్లాడానంటూ సుధాకర్ చెప్పారు. తాను చేసిన తప్పును మన్నించాలని, తన ఉద్యోగం తనకు ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనను అందరూ మరచిపోయారు.
అయితే అనారోగ్య కారణాలతో సుధాకర్ హఠార్మరణం పొందారు. గుండెపోటు ఆయన్ను బలితీసుకుంది. అయితే దీన్ని కూడా చంద్రబాబు తన రాజకీయానికి వాడుకోవడం ఆయన తీరును తెలియజేస్తోంది. ఏం జరిగినా సీఎం వైఎస్ జగన్‌ను ముడిపెట్టి విమర్శలు చేయడం చంద్రబాబుకు అలవాటుగా మారిపోయింది. వైఎస్ జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడైనా, ఇప్పుడు అధికారంలో ఉన్న సమయంలోనూ.. ఏ మాత్రం సంబంధంలేని ఘటనలను వైఎస్ జగన్‌కు ఆపాదించి, అందులో రాజకీయ ప్రయోజనాలు వెతకడం చంద్రబాబుకు పరిపాటైంది. బాబు తీరును తెలిసిన వారికి ఆయన వ్యవహార శైలి ఆశ్చర్యం కలిగించకపోయినా.. ఈ తరం యువతకు బాబు తీరు విడ్డూరంగా తోస్తోంది.
Also Read : వివాదాస్పద వైద్యుడు హఠాన్మరణం, గుండెపోటు సమస్యగా నిర్ధారణ