iDreamPost
android-app
ios-app

ఉద్యోగుల దగ్గర మార్కులు కొట్టేయాలని బాబు యత్నం

  • Published Feb 03, 2022 | 1:19 PM Updated Updated Mar 11, 2022 | 10:19 PM
ఉద్యోగుల దగ్గర మార్కులు  కొట్టేయాలని బాబు యత్నం

సంక్షోభాలను అవకాశాలుగా మార్చుకోవాలని తరచు తన కార్యకర్తలకు చెప్పే టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రస్తుతం రాష్ట్రంలో పీఆర్సీ అంశంపై ఉద్యోగులు చేస్తున్న ఆందోళనను తనకు అనుకూలంగా మార్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ఉద్యోగులపై ఎక్కడ లేని ప్రేమ ఒలకబోస్తున్నారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగులను ఉగ్రవాదుల్లా అరెస్టులు చేస్తారా? అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు, ఉపాధ్యాయుల నిరసనలపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు దుర్మార్గమని ఆవేశపడిపోయారు.

ఇన్నాళ్ళూ ఈ ప్రేమ ఎక్కడ దాచారు?

ఉద్యోగులపై తనకున్న అభిప్రాయాలను మనసులో మాట పుస్తకంలో స్పష్టంగా వెల్లడించిన బాబు అందుకు పూర్తి విరుద్ధంగా ఇప్పుడు స్పందించడం వింతగా ఉందని వైఎస్సార్ సీపీ నేతలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు ఇన్నాళ్ళూ ఈ ప్రేమ ఎక్కడ దాచారు? అని ప్రశ్నిస్తున్నారు. ఉద్యోగులను పర్మినెంట్ చేస్తే సరిగా పనిచేయరు. కాంట్రాక్ట్ ప్రాతిపదికన తాత్కాలిక నియామకాలు మాత్రమే చేపట్టాలని చెప్పడమే కాక ఆచరణలో పెట్టిన చరిత్ర మీ సొంతం కాదా అని ఎద్దేవా చేస్తున్నారు. రిటైర్ అయిన వారికి పింఛనులు ఇవ్వడం వల్ల ఖజానాకు భారం, వాటిని రద్దు చేయాలని సెలవిచ్చిన మీరు ఇప్పుడు మొసలి కన్నీరు కారిస్తే ఎవరు నమ్ముతారని ప్రశ్నిస్తున్నారు.

2019 ఎన్నికలకు ముందు ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణ, చంద్రబాబు ఆంతరంగిక సంభాషణలో
ఉద్యోగుల గురించి వ్యక్తం చేసిన దుర్మార్గమైన
అభిప్రాయాలు సోషల్ మీడియా పుణ్యమాని అందరికీ తెలిసిపోయాయని గుర్తు చేస్తున్నారు. ఆ నా .. కొడుకులకు జీతాలు పెంచనక్కర లేదని ఉద్యోగులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను బట్టే వారిపై మీకు ఉన్న అభిప్రాయం తెలిసిందని చెబుతున్నారు. తాను ముఖ్యమంత్రిగా పదవి నుంచి దిగిపోయిన రెండు సందర్భాల్లోనూ అంటే 2004, 2019 లో రెండేసి డీఏలు బకాయి పెట్టి వెళ్లిన సంగతి ఉద్యోగులు, పెన్షనర్లు మరచిపోలేదని అంటున్నారు.

అంగన్వాడీలు, అన్నదాతలు ఉగ్రవాదులా?

ఉద్యోగులను ఉగ్రవాదుల్లా అరెస్టులు చేస్తారా? అని ప్రశ్నిస్తున్న బాబు తన జమానాలో ఆందోళన చేసిన
అంగన్వాడీ కార్యకర్తలను పోలీసులతో, గుర్రాలతో తొక్కించిన సంగతి మరచిపోయారా అని అడుగుతున్నారు. విద్యుత్తు చార్జీలు తగ్గించమని ఉద్యమించిన వారిపై బషీర్ బాగ్ లో కాల్పులు జరిపించి నిండు ప్రాణాలు పొట్టన పెట్టుకున్నప్పుడు ఈ సుద్దులు ఏమయ్యాయి. పశ్చిమ గోదావరి జిల్లా కాల్ధరిలో ఆందోళన చేసిన రైతులపై కాల్పులు జరిపించి ఇద్దరి మరణానికి కారణం అయినప్పుడు అన్నదాతలు చంద్రబాబుకు ఉగ్రవాదులుగా కనిపించారా? అని ప్రశ్నిస్తున్నారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పబ్లిసిటీ కోసం ఆకస్మిక తనిఖీల పేరిట ఉద్యోగులను భయకంపితులను చేసి కొందరి మరణానికి కూడా కారణమైన చంద్రబాబును ఆ కుటుంబాలు ఎప్పటికీ క్షమించవని అంటున్నారు. ఇంత ఘన చరిత్ర కలిగిన చంద్రబాబు ఉద్యోగుల మెప్పు పొందడానికి స్టేట్మెంట్ ఇస్తే ఎవరూ నమ్మరని వైఎస్సార్ సీపీ నాయకులు ఆయన వైఖరిని ఎండగడుతున్నారు.