iDreamPost
iDreamPost
సహజంగా ఏపీలో పచ్చ మీడియాలో రెండు రకాల వార్తలుంటాయి. ఒకటి తెలుగుదేశం పార్టీ చేసే విమర్శలను వార్తలుగా మలచడం. రెండోది టీడీపీ ప్రశ్నించబోయే విషయాలను వార్తలుగా ముందుకు తీసుకురావడం. ఏబీఎన్ రాధాకృష్ణ నుంచి అందరిదీ ఇదే తంతు. అందుకే ఇప్పుడు తాజాగా ఆర్కే చెత్త పలుకు అంటూ పలువురు విమర్శించే రాతల్లో వచ్చిన ప్రశ్నని కూడా అదే పరంపరలో చూస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజధానులకు సంబంధించిన బిల్లులో పలు మార్పుల కోసం జగన్ ఒక అడుగు వెనక్కి వేశారు. అంతలోనే రెండడుగులు ముందుకేస్తున్నట్టు ప్రకటించారు. జగన్ వెనకడుగు వేశారని వేడుకలకు కావలిలో స్వీట్లు కొని, విజయవాడ సెంట్రల్ లో సంబరాలకు మీడియాను కూడా ఆహ్వానించిన టీడీపీ అంతలోనే మరో బిల్లు ముందుకు రావడంతో అవాక్కయ్యింది. మాట మార్చేసి మరిన్ని విమర్శలకు పూనుకుంది. ఈ నేపథ్యంలో వచ్చిన రాధాకృష్ణ రాతల్లో పెద్ద విశేషం లేకపోయినా ఓ కొత్త ప్రశ్న వినిపించింది.
రెండున్నరేళ్లలో అటు విశాఖలో గానీ, ఇటు కర్నూలులో గానీ రాజధాని కోసం ఒక్క బిల్డింగ్ అయినా కట్టారా అనేది ఇప్పుడు రాదాకృష్ణ అడగడంతో త్వరలో చంద్రబాబు నోటి నుంచి ఈ మాట రాబోతోందనే విషయం సుస్పష్టం. విశాఖ, కర్నూలు నగరాల్లో రాజధానుల కోసం కొత్త భవంతుల నిర్మాణం చేపట్టలేకపోయారనేది ప్రభుత్వం మీద వారు వేయబోతున్న అపవాదు. కానీ అసలు వాస్తవం వాటన్నంటినీ తామే అడ్డుకున్నామనే విషయాన్ని అటు ఆర్కే, ఇటు చంద్రబాబు కూడా కప్పిపుచ్చేపనిలో పడ్డారు. ఆ రెండు నగరాల అభివృద్ధికి జగన్ పూనుకోవడమే నేరమననట్టుగా ఇన్నాళ్లు నిందా ప్రచారం చేసి, దానికి అనేక అపోహలు, అబద్ధాలు తోడేసి చివరకు న్యాయస్థానాల్లో ఫిర్యాదులు చేసిన బ్యాచ్ ఇప్పుడు కొత్త రాగం అందుకోవడం విస్మయకరం.
విశాఖలో పలు కార్యాలయాల ఏర్పాటు కోసం రంగం సిద్ధం చేయగానే అదిగో తరలిపోతోందంటూ కోర్టుల్లో పిటీషన్ల మీద పిటీషన్లు వేసిందెవరు?కర్నూలులో లోకాయుక్త, మానవహక్కుల సంఘం కార్యాలయాలకు ముందే విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ సహా పలు ఆఫీసులు తరలించబోతే నిలువరించేందుకు న్యాయస్థానంలో కేసులు వేసిందెవరు? వాటన్నింటినీ జనం మరచిపోయారనుకుంటున్నారా..లేక జనాలు మరచిపోయేలా చేద్దామనుకుంటున్నారా. వాస్తవాలను దాచిపెట్టి జనాలను పక్కదారి పట్టించే పనిలో ఉన్నట్టు ఈ వ్యవహారం చాటుతోంది. జగన్ చేసిన ప్రయత్నాలకు అడ్డుపడి ఇప్పుడు జగన్ చేయలేకపోయారనే నిందలకు పూనుకోవడం వారి నైజాన్ని చాటుతోంది.
ఐదేళ్లలో ఒక్క శాశ్వత భవనం కూడా పూర్తిచేయలేకపోయిన చంద్రబాబు వైఫల్యాన్ని కప్పిపుచ్చి, ఇప్పుడు జగన్ కొత్త రాజధానులు కట్టలేకపోయారనే ప్రచారానికి పూనుకోవడం అందరినీ విస్మయపరుస్తోంది. 2020లో పాలనా వికేంద్రీకరణ బిల్లు ఆమోదానికే అడ్డుపడ్డారు. మండలిలో సెలక్ట్ కమిటీ కథ నడిపారు స్వయంగా చంద్రబాబు గ్యాలరీకి వెళ్లి గందరగోళం సృష్టించారు. రెండోసారి అదే ఏడాది జూలైలో బిల్లు మండలికి వస్తే ఆమోదించడమో, తిరస్కరించడమో జరగకుండా తమకున్న మెజార్టీని దుర్వినియోగపరిచారు. మండలి అంటే కేవలం అసెంబ్లీ సలహాలిచ్చే సభ మాత్రమేననే విషయాన్ని మరచి వ్యవహరించారు. ఇక బిల్లులను గవర్నర్ ఆమోదించిన మరుక్షణమే వరుసగా న్యాయస్థానాల్లో కేసుల పరంపర ఎవరి పని అనేది ప్రజలకు తెలియదని ఆర్కే, బాబు భ్రమిస్తున్నారా?
పాలనా వికేంద్రీకరణ కు అడ్డంకులు లేకుండా ఉంటే ఈపాటికే ఫలితాలు దక్కేవని ఇప్పటికే నిండు సభ సాక్షిగా జగన్ ప్రకటించారు. అంటే అడ్డంకులు పెట్టిన వారే దానికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు అడ్డగోలుగా ఓవైపు సకల అడ్డంకులు సృష్టిస్తూనే జగన్ కి మాత్రం రాజధానులు కట్టడం చేతకాలేదని విమర్శలకు పూనుకోవడం విడ్డూరంగా ఉంటుంది. అత్త తెడ్డు నాకి కోడలికి బుద్ధి చెప్పిన చందంగా కనిపిస్తోంది. ముందు చంద్రబాబు వేయించిన పిటీషన్లు ఉపసంహరిస్తే రెండేళ్లలో పాలనా కేంద్రాలకు ఓ రూపు తీసుకురావడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని జగన్ సన్నిహితులు చెబుతుంటే బాబు అండ్ కో బ్యాచ్ విడ్డూరపు వాదనలు విచిత్రంగా కనిపిస్తున్నాయి.