iDreamPost
android-app
ios-app

టీడీపీ.. త‌ర‌చూ ఈ హెచ్చ‌రిక‌లు త‌గునా?

టీడీపీ.. త‌ర‌చూ ఈ హెచ్చ‌రిక‌లు త‌గునా?

రాజ‌కీయ పార్టీ అన్న త‌ర్వాత అధికారంలోకి రావాల‌ని ఉండ‌డం స‌హ‌జం. ఆ ల‌క్ష్యంతోనే పార్టీ కార్య‌క్ర‌మాలు, ప్ర‌ణాళిక‌లు కూడా ఉంటాయి. మ‌నం అధికారంలోకి వ‌స్తామా, లేదా అనేది ప్ర‌జ‌ల చేతుల్లో ఉంటుంది. వారి వేసే ఓట్ల‌పై ఆధార‌ప‌డి ఉంటుంది. అయితే, ప్ర‌జ‌లు ఎటు వైపు ఉన్నార‌నేది ప‌రిస్థితుల‌ను బ‌ట్టి కాస్త ప‌సిగ‌ట్టవ‌చ్చు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని రాజ‌కీయ ప‌రిస్థితుల‌ను బ‌ట్టి ప్ర‌స్తుతం అక్క‌డ ఏ పార్టీ కి భ‌విష్య‌త్ ఉంటుంద‌ని చిన్న పిల్లాడిని అడిగినా ఇట్టే చెప్పేస్తాడు. ఇటీవ‌ల జ‌రిగిన వ‌రుస ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను చూసినా ఎవ‌రికైనా అర్థం అయిపోతుంది. సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ఇంకా మూడేళ్ల స‌మ‌యం కూడా ఉంది. పోనీ ఆ లోపు ఏమైనా అంచ‌నాలు తారుమారు అవుతాయా? అంటే సీఎం జ‌గ‌న్ ప‌ని విధానం చూస్తే మ‌రో ప‌దేళ్లు వైసీపీకి ఢోకా లేద‌ని మెజార్టీ ప‌రిశీల‌కులు భావిస్తున్నారు. కానీ, టీడీపీ జాతీయ అధ్య‌క్ష‌, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు చంద్ర‌బాబునాయుడు, నారా లోకేష్ మాత్రం త్వ‌ర‌లో అధికారంలోకి వ‌చ్చేస్తున్నాం .. జాగ్ర‌త్త అంటూ త‌ర‌చూ అధికారులకు హెచ్చ‌రిక‌లు జారీ చేయ‌డం విమ‌ర్శ‌ల‌కు తావిస్తోంది.

టీడీపీ అధినేత చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ తాజాగా విశాఖపట్నం వెళ్లారు. ఇక్కడ ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన డాక్టర్ సుధాకర్ కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. ఈ క్రమంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చేది టీడీపీ ప్రభుత్వం.. అధికారుల లెక్కలు బయటకు తీస్తాం!!  అంటూ.. చెప్పుకొచ్చారు. గతంలో కార్పొరేష‌న్ ఎన్నిక‌ల ప్ర‌చారం సంద‌ర్భంగా చంద్ర‌బాబునాయుడు కూడా ఇలాగే మాట్లాడారు. అధికారుల‌ను బెదిరింపుల‌కు గురి చేసేలా వ్యాఖ్యానించారు. ఇద్ద‌రూ అదే పంథా అవ‌లింభించ‌డం వెనుక అస‌లు ఉద్దేశం ఏంట‌ని అధికార వ‌ర్గాల్లో చ‌ర్చ‌కు దారి తీస్తున్నాయి. క్షేత్రస్థాయిలో పరిస్థితిని ఏ మాత్రం.. అంచనా వేసుకోకుండానే లోకేష్.. అధికారంలోకి వచ్చేది టీడీపీనే అని కామెంట్లు చేయడం ఆసక్తిగా మారింది. నిజానికి ఇటీవల జరిగిన తిరుపతి పార్లమెంటు ఎన్నికలో కానీ కొన్నాళ్ల కిందట జరిగిన స్థానిక ఎన్నికలో కానీ.. టీడీపీ ఓటు బ్యాంకు భారీగా తగ్గింది.

అయిన‌ప్ప‌టికీ అధికారంలోకి వ‌చ్చేస్తాం అంటూ త‌ర‌చూ చెబుతుండ‌డం టీడీపీ నేత‌ల అక్ర‌మాల‌ను అడ్డుకోకుండా అధికారుల‌ను ప‌రోక్షంగా బెదిరించేందుకే అన్న అభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి. అలాగే, విషయం లేకపోయినా.. ధీమా వ్యక్తం చేయడం.. పార్టీలో లోపాలు ఉన్నా..ఏమీలేవని.. కలరింగ్ ఇవ్వడం ద్వారా.. పార్టీ పుంజుకునే ప్రయత్నం చేసే వ్యూహంగాలో భాగ‌మ‌ని మ‌రికొంద‌రు విశ్లేషిస్తున్నారు. అయితే.. ఇలాంటి ఎత్తుగడలు.. అన్ని వేళలా.. అన్ని పార్టీల్లోనూ సక్సెస్ అయిన పరిస్థితి లేదనే విశ్లేషకులు కూడా చెబుతున్నారు. అందులోనూ ప్ర‌స్తుతం అధికారంలో ఉన్న వైసీపీ రోజురోజుకూ ప్ర‌జ‌లకు మ‌రింత చేర‌వవుతోంది. జ‌గ‌న్ తీసుకుంటున్న విప్ల‌వాత్మ‌క చ‌ర్య‌లు అంద‌రినీ ఆక‌ర్షితుల‌ను చేస్తున్నాయి. ఈ ప‌రిస్థితుల్లో టీడీపీ అధికారంలోకి రావ‌డం క‌ల్ల అనే విమ‌ర్శ‌లు వ్య‌క్తం అవుతున్నాయి.