iDreamPost
iDreamPost
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉద్యమం రాజుకుంటోంది. ప్రజా ప్రతినిధులను కూడా ప్రభావితం చేస్తోంది. ఇప్పటికే తాను రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించిన గంటా శ్రీనివాసరావు చివరకు కార్మికుల ఒత్తిడితో స్పీకర్ ఫార్మేట్ లో రాజీనామా సమర్పించారు. దాంతో టీడీపీ ఖాతా నుంచి మరో ఎమ్మెల్యే చేజారిపోయారు. ఇప్పటికే గెలిచిన 23 మందిలో నలుగురు బాబుని వ్యతిరేకిస్తున్నారు. వల్లభనేని వంశీ, మద్దాల గిరి, కరణం బలాం, వాసుపల్లి గణేష్ నేరుగా జగన్ తో భేటీ అయ్యారు. ప్రస్తుతం మరో ఎమ్మెల్యే రాజీనామా చేసిన తరుణంలో స్పీకర్ ఆమోదిస్తే సభలో చంద్రబాబు బలం 18కి పడిపోతుంది. ఇక ఆయన ప్రతిపక్ష హోదాకి మరింత ముప్పు పొంచి ఉన్నట్టే చెప్పవచ్చు.
ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత హోదా కావాలంటే కనీసం 18 మంది సభ్యులుండాలి. అందులో ఒక్కరు తగ్గినా టీడీపీ అధినేతకు తలనొప్పులు తప్పవు. వాస్తవానికి 1994 నుంచి ఆయన నిరంతరాయంగా క్యాబినెట్ హోదాలో కొనసాగుతున్నారు. అధికారంలో ఉంటే, లేదంటే ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఆయనకు ప్రోటోకాల్ కొనసాగుతోంది. అయితే ఇప్పుడు అలాంటి అవకాశం కోల్పోయే ప్రమాదం రావడం విశేషం. ఇది చంద్రబాబు బహుశా ఊహించని విషయంగా చెప్పవచ్చు. ఏపీలో అందరికన్నా అత్యధిక కాలం పాటు సీఎం, ప్రతిపక్ష నేత హోదాల్లో ఉన్నది ఆయనే. ఇప్పుడు ఆయన సీఎం పదవితో పాటుగా ఏకంగా ప్రతిపక్ష నేత హోదాని కూడా కోల్పోయి సభలో అడుగుపెట్టాలంటే అది ఇబ్బందికరంగా ఉంటుందనడంలో సందేహం లేదు. దాంతో దీనిని ఎలా ఎదుర్కొంటారో చూడాలి
అదే సమయంలో విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యేగా గంటా రాజీనామా ఆమోదిస్తే వెంటనే ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న పార్లమెంట్, అసెంబ్లీ స్థానాల ఎన్నికలకు ఈసీ సన్నాహాలు చేస్తోంది. త్వరలో దానికి సంబంధించిన నోటిఫికేషన్ రాబోతోంది. ఈలోగా విశాఖ ఉత్తరం ఎమ్మెల్యే రాజీనామా ఆమోదం అధికారయుతంగా జరిగితే ఆ నియోజకవర్గానికి కూడా వెంటనే ఎన్నికలు జరపాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది చంద్రబాబు కి మరో పెద్ద తలనొప్పి. ఇప్పటికే తిరుపతి ఉప ఎన్నికల నుంచి గట్టెక్కడం ఆయనకు పెద్ద గండంగా ఉంది. చివరకు అభ్యర్థిగా ప్రకటించిన పనబాక లక్ష్మి పెద్దగా స్పందించడం లేదు. ఈ పరిస్థితుల్లో తిరుపతిలో కనీసం రెండో స్థానం రాకపోతే ఏపీలో టీడీపీ పునాదులు వేగంగా కూలిపోయే ప్రమాదం దాపురిస్తుంది. దానిని నిలువరించేందుకు సర్వశక్తులు ఒడ్డే యత్నం చేస్తుంటే ఇప్పుడు విశాఖ నార్త్ ఉప ఎన్నికలు వస్తే ఇక చంద్రబాబు తట్టుకోలేని స్థితి వస్తుంది.
వాస్తవానికి విశాఖని కార్యనిర్వాహక రాజధానిగా చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలను అడ్డుకుంటున్న చంద్రబాబు సాగరనగరంలో కాలు పెట్టడానికి కూడా పెద్ద సమస్య అవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏకంగా అక్కడ ఉప ఎన్నికలు వస్తే పోటీ చేయడానికి అభ్యర్థి ఎవరు అన్నది కూడా అనుమానమే. గంటా శ్రీనివాసరావు నేరుగా అధినేతకు ఒక్క మాట కూడా చెప్పకుండా రాజీనామా చేసిన నేపథ్యంలో ఆయన మళ్లీ టీడీపీ తరుపున బరిలో దిగే అవకాశం శూన్యం. ఇక టీడీపీకి విశాఖ ఉత్తరం ఉక్కిరిబిక్కిరి చేస్తుందనడంలో సందేహం లేదు.