iDreamPost
android-app
ios-app

నేనేం తప్పు చేశానో అర్థం కావడం లేదు.. ప్రజలు నన్ను అర్థం చేసుకోలేదు.. చంద్రబాబు ప్రవచనాలు

నేనేం తప్పు చేశానో అర్థం కావడం లేదు.. ప్రజలు నన్ను అర్థం చేసుకోలేదు.. చంద్రబాబు ప్రవచనాలు

ఆంధ్రప్రదేశ్‌లో అధికారం మారి రెండేళ్లు అయినా.. గత ఎన్నికల్లో ఘోర ఓటమి గల కారణాలను ఇప్పటికీ తెలుసుకోలేకపోతున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ప్రజలను తనను సరిగా అర్థం చేసుకోలేదంటూ కొత్త పల్లవి ఎత్తుకున్నారు. అర్థం చేసుకోకపోవడం వల్ల తనకు నష్టం లేదని, వారే నష్టపోతున్నారంటూ.. తనలాంటి గొప్ప పరిపాలకుడును దూరం చేసుకున్నారనే అర్థం వచ్చేలా మాట్లాడుతున్నారు. అదే సమయంలో లక్ష కోట్ల అవినీతిని చేసిన వ్యక్తిని సరిగా విశ్లేషించలేని ప్రజల వల్ల తమకు బాధలు తప్పడం లేదంటూ పొంతనలేని వ్యాఖ్యలు చేస్తున్నారు. తాను ఏం తప్పు చేశానో అర్థం కావడంలేదంటూ పాతపాటే పాడారు. 2024లో టీడీపీ తప్పక విజయం సాధిస్తుందని, ఇందులో అనుమానమే లేదంటూ ఎన్‌ఐఆర్‌లతో జూమ్‌లో మాట్లాడుతూ ధీమా వ్యక్తం చేశారు.

నిద్ర నటించేవాళ్లను లేపడం సాధ్యమా..?

నిద్ర పోయేవాళ్లను లేపవచ్చు.. కానీ నిద్ర పోతున్నట్లు నటించే వాళ్లను లేపలేమనేది ఓ నానుడి. ఇది చంద్రబాబుకు అతికినట్లు సరిపోతుంది. తాను ఏం తప్పు చేశానో అర్థం కావడంలేదంటూ రెండేళ్లు తర్వాత కూడా బాబు మాట్లాడుతుండడం విడ్డూరంగా ఉంది. సీనియర్‌ రాజకీయ నాయకుడైన చంద్రబాబుకు ఎన్నికల్లో ఓటమికి గల కారణాలను తెలుసుకోలేకపోవడం ఆయన అసమర్థతకు నిదర్శనం. కానీ ప్రజలు చంద్రబాబును ఎందుకు ఆదరించలేదో.. అందరికీ బాగా తెలుసు. రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ, నిరుద్యోగభృతి, కాపు రిజర్వేషన్లు.. ఇలా 650 హామీలు ఇచ్చిన చంద్రబాబు వాటిలో ఎన్ని అమలు చేశారో తెలుసుకుంటే.. ఎందుకు ఓడిపోయారో ఇట్టే తెలుస్తుంది. దాంతోపాటు ఐదేళ్ల పాలనలో అరచేతిలో వైకుంఠం చూపించిన తీరు తన అనుకూల పత్రికలను తిరగేస్తే కనిపిస్తుంది. ఈ రెండు అంశాలను పరిశీలిస్తే.. ఏం తప్పు చేశారో చంద్రబాబుకు తెలుస్తుంది. తాను చేసిన తప్పులను వదిలేసి.. తనకు ఓట్లు వేయకపోవడమే ప్రజల తప్పు అనేలా వారిని నిందించడం బాబు రాజకీయానికి పరాకాష్ట. ప్రజలను తప్పుబడుతున్న చంద్రబాబు.. అదే సమయంలో వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తామని చెబుతున్నారు. మరి అప్పుడు ఓట్లు వేయాల్సింది ఎవరో..?

జగన్‌పై అవే తేలిపోయిన ఆరోపణలు..

11 సంవత్సరాలుగా వైఎస్‌ జగన్‌పై చేసిన ఆరోపణలనే ఇప్పటికీ చంద్రబాబు చేస్తుండడం ఆయన నిస్సహాయతకు నిదర్శనంగా నిలుస్తోంది. జగన్‌ లక్ష కోట్ల అవినీతి చేశారంటూ 2014 ఎన్నికల్లో చెప్పారు. అయినా ప్రజలు విశ్వసించలేదు. 2019 ఎన్నికల్లో అవే ఆరోపణలు చేసిన చంద్రబాబు అండ్‌ కో.. అదే సమయంలో తాము చేసిన ఆరోపణలు తప్పునేలా వారు చేసిన వ్యాఖ్యల ద్వారా అందరికీ అర్థమైంది.

ఎన్నికల్లో ప్రజలకు డబ్బు పంచేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్‌.. వైఎస్‌ జగన్‌కు వెయి కోట్ల రూపాయలను పంపుతున్నారని, వాటిని సరిహద్దుల వద్దే ప్రజలు అడ్డుకోవాలంటూ చంద్రబాబు, లోకేష్‌లు ఎన్నికల ప్రచారంలో పదే పదే విమర్శించారు. ఈ విమర్శతోనే.. జగన్‌పై వారు చేసిన లక్ష కోట్ల అవినీతి ఉత్త బురదజల్లుడు కార్యక్రమమేనని తేలిపోయింది. వైఎస్‌ జగన్‌ వద్ద లక్ష కోట్ల రూపాయలు ఉంటే.. ఎన్నికల ఖర్చు కోసం కేసీఆర్‌ వద్ద వెయి కోట్ల రూపాయలు తీసుకోవాల్సిన అవసరం ఏమిటి..? లక్ష కోట్ల రూపాయల్లో వెయి కోట్ల రూపాయలు అంటే.. ఒక్క శాతం మాత్రమే. తర్కంలేని విమర్శలు, ఆరోపణలు చేసిన చంద్రబాబు.. మళ్లీ అవే ఆరోపణలు ఇప్పటికీ చేస్తుండడం జగన్‌ పాలనపై విమర్శలు చేసేందుకు బాబుకు ఎలాంటి అవకాశం లభించడంలేదని అర్థమవుతోంది.

Also Read : బాబు నువ్వు వద్దు,నీ మద్దతు వద్దూ