iDreamPost
iDreamPost
నేను ఏడుస్తున్నది పాఠశాల తగులబడినందుకు కాదు. మా హెడ్మాస్టర్ ఆ మంటల్లో పడనందుకు అని వెనకటికి ఓ విద్యార్థి చెప్పాడట! టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తీరు కూడా అలాగే ఉంది. సినీ పరిశ్రమ సమస్యలపై చర్చలకు వెళ్లిన సందర్భంగా స్వశక్తితో ఎదిగిన మెగాస్టార్ చిరంజీవి లాంటి వారు సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని ప్రాధేయపడాలా? అని ఆయన తెగ బాధపడిపోతున్నారు. సోమవారం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ తెలుగు సినిమా పరిశ్రమని జగన్‌రెడ్డి కించపరిచారని, సీఎం జగన్‌ను చిరంజీవి ప్రాధేయపడడం బాగాలేదని వ్యాఖ్యానించారు.
చంద్రబాబు అసలు బాధ వేరే..
నిజానికి ముఖ్యమంత్రితో మాట్లాడేటప్పుడు చిరంజీవి సంస్కారవంతంగా వ్యవహరించి, చక్కటి భాషతో సమస్యలను ఒక్కొక్కటిగా వివరించిన తీరు ఆకట్టుకునేలా ఉంది. ఎవరైనా చర్చలకు వెళ్లినప్పుడు అలాగే మాట్లాడతారు కూడా. అంతేగాని చంద్రబాబు, ఇతర టీడీపీ నాయకుల్లా ముఖ్యమంత్రిని నోటికొచ్చినట్టు సంబోధించరు కదా? చిరంజీవి ఒక పద్ధతిగా మాట్లాడి సమస్యల పరిష్కారానికి సానుకూల వాతావరణం ఏర్పరిస్తే ,అందరూ సంతోషిస్తుంటే చంద్రబాబుకు వచ్చిన ఇబ్బంది ఏమిటి? స్వశక్తితో మెగాస్టార్ అయిన చిరంజీవిది ఎదిగేకొద్దీ ఒదిగి ఉండాలనే పద్ధతి. ఇది వ్యక్తుల్లో అరుదుగా చూస్తాం. అంతటి చక్కటి వ్యక్తిత్వం ఉన్న ఆయనను మెచ్చుకోవాల్సింది పోయి ప్రాధేయపడ్డారని అభివర్ణించడం ఏమిటి?
రాజకీయాల్లో కూడా కేంద్రమంత్రి స్థాయికి ఎదిగిన చిరంజీవికి ముఖ్యమంత్రితో ఎలా మాట్లాడాలో తెలియదా? చంద్రబాబు నుంచి నేర్చుకోవాలా? ఇంతకీ చంద్రబాబు అసలు బాధ సినీ సమస్యల విషయమై సీఎం జగన్‌మోహన్‌రెడ్డి, పరిశ్రమ ప్రముఖుల మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడలేదని.. సమస్యలు సామరస్యంగా పరిష్కారం అయిపోతున్నాయి అని తప్ప ఆయనకు చిరంజీవి మీద అభిమానం కాదు అని వైఎస్సార్ సీపీ నేతలు అంటున్నారు.
ఎప్పుడూ వంకర దృష్టేనా?
పీఆర్సీ కోసం ఉద్యోగులు చేస్తారనుకున్న సమ్మెపై చంద్రబాబు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ అంశాన్ని రాజకీయంగా వాడుకోవాలని చూశారు. అయితే
ఆందోళనబాట పట్టిన ఉద్యోగులను చర్చలకు పిలిచి వారి సమస్యలను సీఎం పరిష్కరించడంతో చంద్రబాబు చాలా నిరుత్సాహపడ్డారు.ఆ తర్వాత సినీ ప్రముఖులతో జరిగిన చర్చలన్నా విఫలమవుతాయేమో, రాజకీయం చేసేద్దాం అనుకున్నారు. ప్చ్ అదీ సాధ్యపడలేదు. ఈ రెండు సందర్భాల్లో ముఖ్యమంత్రి చొరవ తీసుకొని సమస్యలను పరిష్కరించడం జీర్ణించుకోలేని చంద్రబాబు ఫ్రస్టేషన్‌తో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని అధికార పార్టీ నేతలు తప్పుపడుతున్నారు. మొన్నటి వరకు నలుగురు ఉద్యోగ సంఘాల నాయకులపై రచ్చ చేసిన పచ్చబ్యాచ్,, ఇప్పుడు చిరంజీవిపై పడుతున్నారని అంటున్నారు. రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం ఉంటే చంద్రబాబుకు నిద్రపట్టదని, అందుకే ఎప్పుడూ వంకర దృష్టితో ఆలోచిస్తూ విమర్శలు చేస్తారని అధికార పార్టీ నేతలు విమర్శిస్తున్నారు.