iDreamPost
android-app
ios-app

బాబు ‘స్వయం ఖాతా’లో చేరిన మరో ఘనత..!

బాబు ‘స్వయం ఖాతా’లో చేరిన మరో ఘనత..!

ఈ ప్రకృతిలో ఎక్కడో ఉన్న వారికి మరెక్కడో జరిగిన సంఘటనతో సంబంధం ఉంటుందని ఏదో సినిమాలో విన్నట్లు గుర్తు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తాజాగా చేసిన ఓ ప్రకటనతో ఆ సినిమా డైలాగ్‌ ఇప్పుడు గుర్తుకు వచ్చింది. ఎవరు ఏమనుకున్నా, ఔనన్నా, కాదన్నా.. కొన్ని విజయాలను, చారిత్రక సంఘటనలను తన ఖాతాలో వేసుకుంటారు చంద్రబాబు నాయుడు. ఈ విషయంలో ఆయనకు సాటి మరొకరు లేదు. తాను చేసిన పనులను తానే చెప్పుకోవడానికి సాధారణ ఎమ్మెల్యే కూడా కొంచెం సంకోచిస్తాడు. ఎమ్మెల్యే చేసిన పనులను ఆయన అనుచరులు చెప్పడం సాధారణంగా చూస్తుంటాం. కానీ చంద్రబాబు మాత్రం తాను చేసిన పనులను కాదు.. తాను చేయని వాటిని కూడా తానే చేశానని చెప్పుకోవడానికి ఏ మాత్రం సంకోచించరు. పైగా పదే పదే ‘‘ నేనే.. నా వల్లే..’’ అంటూ గొప్పగా చెప్పుకుంటారు.

ఈ స్వయం ఖాతాలో భాగంగానే చంద్రబాబు తాజాగా మరో విషయం తన ఖాతాలో వేసుకున్నారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 100వ జయంతి ఇందుకు సందర్భమైంది. పీవీ జయంతి సందర్భంగా నివాళులర్పించిన చంద్రబాబు ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ మేరకు ట్విట్టర్‌లో సందేశం పెట్టారు. ఇంత వరకూ బాగానే ఉంది. పీవీ నరసింహారావుకు దేశ రాజధాని ఢిల్లీలో స్మృతి చిహ్నం ఏర్పాటు చేయాలంటూ తెలుగుదేశం హయంలో 2014లో రాష్ట్ర శాసన సభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపామని చెప్పారు. దాని ఫలితంగా ఆయన మరణించిన పదేళ్లకు ఢిల్లీలోని ఎక్తాస్థల్‌ వద్ద పీవీ స్మారక చిహ్నం నిర్మించారని చెప్పారు. ఇతర విషయాల్లాగే పీవీ స్మారక చిహ్నాన్ని చంద్రబాబు తన ఖాతాలో ద్విగ్విజయంగా వేసుకున్నారు.

ఇదే కాదు గతంలోనూ ఇలాంటి చాలా విషయాలను చంద్రబాబు తన స్వయం ఖాతాలో వేసుకున్నారు. అబ్ధుల్‌ కలాంను భారత రాష్ట్ర పతిని తానే చేశానని, 1999లో దేశ ప్రధానులను తానే ఎంపిక చేశానని, హైదరాబాద్‌ నగరాన్ని నిర్మించానని, శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టు నిర్మించానని, రింగు రోడ్డు నిర్మించానని, పీవీ సింధు షటిల్‌ క్రీడలో రాణించడానికి తానే స్ఫూర్తి అని, నదులను అనుసంధానం చేశానని, సెల్‌ఫోన్‌ తానే కనిపెట్టానని, భారత్‌కు ఐటీ తన వల్లే వచ్చిందని, డ్వాక్రా సంఘాలను తానే ఏర్పాటు చేశానని.. ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్‌ చాలనే ఉంది.

తాజా విషయానికి వస్తే.. పీవీ నరసింహారావు కాంగ్రెస్‌ నేత. ఆ పార్టీ తరఫున ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి అయ్యారు, కేంద్ర మంత్రి అయ్యారు. దేశ ప్రధాని అయ్యారు. మరి ఓ కాంగ్రెస్‌ నేతకు.. ఆ పార్టీకి బద్ధశత్రువైన టీడీపీ అధినేత వల్ల స్మారక చిహ్నం ఏర్పాటు జరిగిందని చెప్పడమే ఇక్కడ విడ్డూరంగా ఉంది. పీవీ మరణించిన పదేళ్లకు చంద్రబాబు ప్రభుత్వం చేసిన తీర్మానం వల్ల ఆయన స్మారక చిహ్నం ఢిల్లీలో ఏర్పాటైందంటే నిజంగా చంద్రబాబు బలం అంచనా వేయలేనిది. మరి ఇలాంటి బలం కలిగిన నేత, తమ ప్రత్యర్థి పార్టీ నేతకు స్మారక చిహ్నం ఏర్పాటు చేయించిన సత్తా ఉన్న చంద్రబాబు.. తమ పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి అయిన ఎన్టీ రామారావుకు భారత రత్న ఎందుకు ఇప్పించలేకపోయారన్నది అర్థం కావడంలేదు.

ఎన్టీఆర్‌ చనిపోయిన దాదాపు 25 ఏళ్లు అవుతోంది. ప్రతి ఏడాది తెలుగుదేశం పార్టీ ఆర్భాటంగా నిర్వహించే మహానాడులో ఎన్టీఆర్‌కు భారత రత్న ఇవ్వాలని తీర్మానాలు చేస్తారు. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నా, అధికార పక్షంలో ఉన్నా ఈ తీర్మానాలు చేయడం మాత్రం సర్వసాధారణం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్టీఆర్‌కు భారత రత్న సాధించలేకపోయారనుకోవచ్చు. మరి అధికారంలో ఉన్నప్పుడు, పైగా చంద్రబాబు కేంద్రంలోని ప్రభుత్వంలో భాగస్వామి అయినప్పుడు కూడా ఎందుకు ఎన్టీఆర్‌కు భారతరత్న ఇప్పించలేకపోయారో రాష్ట్ర ప్రజలకే కాదు ఆ పార్టీ కరుడుకట్టిన కార్యకర్త, చంద్రబాబు వీరాభిమానులకు కూడా అర్థం కావడంలేదు. ఎందరికో ఎన్నో ఇప్పించిన చంద్రబాబు తనకు పిల్లనిచ్చిన మామ, పార్టీని ఇచ్చిన వ్యక్తికి భారత రత్న ఇప్పించలేకపోవడం నిజంగా విచారకరం.