Idream media
Idream media
మూడు రాజధానుల ప్రతిపాదనను ఊపసంహరించుకోవాలంటూ వైసీపీ ప్రభుత్వానికి 48 గంటల డెడ్‌లైన్ విధించిన చంద్రబాబు.. డెడ్‌లైన్ గడువు ముగియడంతో ఈ రోజు సాయంత్రం ఐదు గంటలకు ముందుగా చెప్పినట్లుగానే జూమ్ ద్వారా మీడియాతో మాట్లాడారు. తన సవాల్ స్వీకరించకుండా ప్రభుత్వం పిరికిపందలా పారిపోయిందని బాబు వ్యాఖ్యనించారు. తన సవాల్‌ను స్వీకరించి ఎన్నికలకు వెళ్లాలని మళ్లీ డిమాండ్ చేశారు. రాజధానిపై వైసీపీ నేతలు మాట్లాడిన వీడియోలను ప్రసారం చేసి చూపించారు. అమరావతినే కొనసాగించాలని ఎవరో సోషల్ మీడియాలో పెట్టిన వీడియోను చూపించి, ఇలా మాట్లాడిన వ్యక్తిని కొనియాడారు.
అమరావతి కోసం ప్రజలందరూ సంఘటితం కావాలని, ఉద్యమం చేయాలని చంద్రబాబు మరోమారు కోరారు. లేదంటే భవిష్యత్ అంథకారం అవుతుందని హెచ్చరించారు. రాష్ట్ర ప్రజలు, మేథావులు, ఉన్నత విద్యావంతులు.. అందరూ సీనియర్‌గా తాను చెబుతున్న అంశాలపై ఆలోచన చేసి ఉద్యమించాలని పదే పదే విజ్ఞప్తి చేశారు. అమరావతి తన కోసమో, తన కుటుంబం కోసమో, టీడీపీ కోసమో కాదన్నారు. అమరావతి లేకపోతే రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుందని పేర్కొన్నారు.
అయోధ్యలో పవిత్ర మట్టి, జలాలతో రామ మందిర్ నిర్మాణానికి శంకుస్థాపన చేలా చేశారో.. అమరావతి కోసం కూడా ప్రధాని మోదీ అలానే చేశారని చంద్రబాబు అన్నారు. అయోధ్యలో సమస్య పరిష్కారం చేసినట్లే అమరావతి సమస్యను పరిష్కరించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలోని పవిత్ర స్థలాలు, నదులు, రాష్ట్రంలోని 13 వేల గ్రామాల నుంచి పవిత్రమైన మట్టి, జలాలు తీసుకొచ్చి అమరావతిని పునీతం చేశామని చంద్రబాబు పేర్కొన్నారు. అమరావతి దేవతల రాజధాని అంటూ అభివర్ణించారు.
ఇకపై రెండు రోజులకు ఒకసారి ప్రజల ముందుకు వచ్చి అమరావతిపై లైన్ ఇస్తుంటానని చంద్రబాబు చెప్పారు. అమరావతిపై తాను చెప్పే వాస్తవాలను ప్రజలందరూ చర్చించుకోవాలని కోరారు. అమరావతి ఉద్యమానికి నాంథి పలుకుతున్నామని, ఏమి చేయాలో అన్నీ చేస్తామన్నారు. కరోనా సమయంలో ప్రజలు బయటకు వచ్చి పోరాటం చేయలేరు కాబట్టి సోషల్ మీడియా ద్వారా ఉద్యమం చేయాలని సలహా ఇచ్చారు. ఈ ప్రభుత్వం రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తోందన్నారు.
రాష్ట్ర విభజన సమయంలో కూడా ఈ నేతలు గట్టిగా మాట్లాడకుండా ఉండడంతో విభజన జరిగిందని చంద్రబాబు చెప్పారు. విభజన జరగకుండా ఉంటే అసలు సమస్యే ఉండేదికాదన్నారు. మనిషికి ఎన్ని నాలుకలని ప్రశ్నించారు.
కాగా, అమరావతినే రాజధానిగా కొనసాగిస్తామంటే తాను రాజీనామా చేసేందుకు సిద్ధమని విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా చంద్రబాబు చెప్పారు. తనకు ఈ పదవులు అవసరం లేదన్నారు. హైకోర్టు మార్చే అధికారం ప్రభుత్వానికి లేదన్నారు. మూడు రాజధానులు పెట్టే అధికారం ప్రభుత్వానికి ఎవరికి ఇచ్చారని ప్రశ్నించారు. ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారన్నారు. ప్రభుత్వానికి కనువిప్పు కావాలన్నారు.