Idream media
Idream media
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు సొంత నియోజకవర్గం కుప్పంలో ఇప్పటికే ఎదురుగాలి వీస్తోందని స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల ద్వారా స్పష్టమైంది. దీనికి తోడు ఆయన వ్యక్తిగత కార్యదర్శి మనోహర్ పై స్థానికంగా వెల్లువెత్తుతున్న ఆరోపణలు, ˘నమోదైన కేసులు బాబును మరింత ఇరకాటంలో పెట్టేలా కనిపిస్తున్నాయి. గతంలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ సందర్భంగా వైసీపీ మద్దతుదారులను బెదిరించాడనే నెపంతో కేసు నమోదైంది. అంతకు ముందు.. విగ్రహాల ధ్వంసం కేసులో మితిమీరిన జోక్యం కారణంగా కూడా కేసు నమోదైంది. ఇప్పుడు ఏకంగా చెరు కబ్జా పెద్ద వివాదానికి దారి తీస్తోంది.
తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న గత ఐదేళ్లలో అమరావతి, విశాఖల్లో జరిగిన భూ కుంభకోణాల గురించి అందరికీ తెలిసిందే. రాజధాని నగరాలైన అక్కడే అలా జరిగితే మరి చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో తమ్ముళ్లు చూస్తూ ఊరుకుంటారా..? అందులోనూ.. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు సరిహద్దుగా ఉన్న కుప్పం ప్రాంతంలో కొన్నాళ్లుగా భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం పక్క రాష్ట్రాల రియల్టర్లు కూడా ఆసక్తి చూపడంతో తెలుగుదేశం పార్టీ నేతలు ఖాళీగా ఉన్న స్థలాలను కబ్జా చేసేశారు. భూములే కాదు చివరికి చెరువులను కూడా చెరబట్టేశారు. ఆ క్రమంలోనే కుప్పం బైపాస్ రోడ్ సమీపంలోని వెంకటప్పా చెరువును మింగేశారు.
Also Read:నిన్న కుప్పం, నేడు చిత్తూరు – చిటింగ్ కేసులో అడ్డంగా బుక్కైన చంద్రబాబు పీఏ
సర్వే నం.226/2తో 3.58 ఎకరాల విస్తీర్ణం కలిగిన వెంకటప్పా చెరువు ను చంద్రబాబు పీఏ మనోహర్ అండతో, తప్పుడు సర్వే నంబర్లతో లే అవుట్‌గా మార్చేశారు. కుప్పం సమీపంలోని సీనేపల్లి గ్రామ పంచాయతీలో ప్లాన్ అప్రూవల్ చేసుకోవడం.. ఆ ప్లాన్‌తో కుప్పంలోని సర్వే నం.226/2లోని చెరువులో నిర్మాణం చేసుకోవడం.. ఇలా టీడీపీ నేతలు, మనోహర్ సన్నిహితులు మతిన్ హజరత్, నజీర్, మణి బినామీ పేర్లతో చెరువును ప్లాట్లుగా చేసి తెగనమ్మేశారు. అప్పటి కుప్పం అధికారులకు అంతా తెలిసినా ఏమీ తెలియనట్టే వదిలేశారు. దీంతో స్థానికులు, రైతులు అప్పటి మదనపల్లె్ల సబ్ కలెక్టర్ వెట్రి సెల్వి దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే స్పందించిన సబ్‌కలెక్టర్ 2017 ఆగస్టులో కుప్పం వచ్చి కబ్జాకు గురైన చెరువును పరిశీలించారు.
అక్కడికక్కడే సర్వేకి ఆదేశించి.. హద్దులు ఏర్పాటు చేస్తుండగా.. అదే సమయంలో సదరు సబ్‌కలెక్టర్‌కు అమరావతి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. విధిలేని పరిస్థితుల్లో నామమాత్రపు సర్వే చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అంతే ఆ తర్వాత అక్రమ కట్టడాల జోరు పెరిగిపోయింది. చెరువులో అక్రమ నిర్మాణాలపై స్థానికులు, రైతులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కబ్జాదారులే ముందుగా హైకోర్టును ఆశ్రయించి స్టే తీసుకువచ్చారు. కోర్టుకు వాస్తవాలు వివరించి స్టే వెకేట్ చేయించాల్సిన అధికారులు సరైన సమయంలో అప్పీల్‌కు వెళ్లకుండా కాలయాపన చేస్తూ వచ్చారు. ఇక వివాదం కోర్టులో ఉన్న నేపథ్యంలో కనీసం నిర్మాణాలను అడ్డుకోవాల్సిన అధికారులు ఆ కేసు సాకుతో పట్టించుకోలేదనే చెప్పాలి. ఫలితంగా ఇప్పటికీ అక్రమ నిర్మాణాల జోరు కొనసాగుతూనే ఉంది. ఇటీవలే కుప్పం మండల టీడీపీ కోశాధికారి మణి బినామీ పేరిట అక్కడే మూడంతస్తుల బిల్డింగ్ నిర్మించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
Also Read:హుజూరాబాద్ పై కేసీఆర్ సర్కారు నిర్ణయం కరెక్టేనా?
వెంకటప్పా చెరువు దురాక్రమణ వాస్తవమేనని తహసీల్దార్ సురేష్ పేర్కొంటున్నారు. వేరే సర్వే నంబర్‌తో అప్రూవల్ తీసుకుని 2019కి ముందు అక్కడ అక్రమ నిర్మాణాలు చేపట్టారని అంటున్నారు. ఏదేమైనా చంద్రబాబు నియోజకవర్గంలోని కబ్జా బాగోతంలో ఆయన పీఏ పేరే ప్రధానంగా వినిపిస్తుండడం సంచలనంగా మారింది.