Idream media
Idream media
కరోనా వైరస్ అన్ని రంగాల వారికి కొత్తదారులను ఎతుక్కునేలా చేసింది. వ్యాపారం, ఉద్యోగం ఆఖరుకు రాజకీయం కూడా కొత్తదారుల్లో నడుస్తూ సరికొత్త పుంతలు తొక్కుతోంది. అధికారంలో ఉండే పార్టీలు తమ పాలన, పథకాల ద్వారా ప్రజల్లో ఉంటుండగా.. ప్రతిపక్ష పార్టీలకు కరోనా వల్ల ఆ అవకాశం లేకపోయింది. ప్రజా సమస్యలుపై నిరసనలు, ఇతర కార్యక్రమాల ద్వారా ప్రజల్లో ఉండాల్సిన ప్రతిపక్ష పార్టీలను కరోనా వైరస్ ఇళ్లలోనే కూర్చొపెట్టింది. యువ నాయకులు కొంత మంది ధైర్యం చేసి బయటకు వస్తున్నా.. చంద్రబాబు లాంటి వృద్ధ నేతలు మాత్రం బయటకు వచ్చేందుకు సాహసం చేయడం లేదు. పైగా వైరస్ తగ్గే వరకూ తాను బయటకు రానని చంద్రబాబు తేల్చి చెప్పారు.
ఎప్పుడు పూర్తిగా తగ్గుతుందో తెలియని కరోనా వైరస్ నేపథ్యంలో పసుపు పార్టీ అధినేత చంద్రబాబు ఆన్‌లైన్ రాజకీయాన్ని ఎంచుకున్నారు. ఇందులో భాగంగా ట్విట్టర్, జూమ్ వంటి ఆన్‌లైన్ వేదికలను బాబు ఎంచుకున్నారు. మార్చి నుంచి బాబు తన రాజకీయాన్ని ఆన్‌లైన్ వేదికల ద్వారానే నడుపుతున్నారు. ట్విట్టర్‌పై ప్రభుత్వంపై విమర్శలు, పార్టీ నేతలతో సమావేశాలు, ప్రెస్ మీట్లకు జూమ్ ను ఉపయోగిస్తున్నారు.
పార్టీ నేతలు, మీడియా సమావేశాలను జూమ్ ద్వారా నడుపుతున్న చంద్రబాబు తాజాగా ప్రజలతో కూడా ఆన్‌లైన్ ద్వారానే రాజకీయ సంబంధాలు నడపాలని నిర్ణయించారు. ఈ మేరకు తాజాగా ఏపీ ఫైట్స్ కరోనా అనే వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. కరోనా వచ్చి ప్రజలు ఇబ్బందులు పడి.. ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొంటున్న తరుణంలో ప్రజలు తమ సమస్యలు తెలపాలని చంద్రబాబు వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేయడం దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగిన చందంగా ఉన్నప్పటికీ పసుపు పార్టీ అధినేతకు ఇంత కన్నా మరో దారి కనిపించనట్లుగా ఉంది.
చంద్రబాబు ప్రారంభించిన వెబ్‌సైట్ ద్వారా ప్రజలకు మేలు జరిగేది ఏమీ ఉండదని అందరికీ తెలుసు. కానీ ఇలాంటి రాజకీయ జిమ్కిక్కులు చేయడంలో చంద్రబాబు ఆరితేరారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అమరావతి ఉద్యమంలో పాల్గొనాలని రాష్ట్ర ప్రజలకు హైదరాబాద్ నుంచి పిలుపు ఇచ్చిన చంద్రబాబు… ఎవరూ పట్టించుకోకపోవడంతో ఆఖరుకు ఓ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. ప్రజలు అమరావతికి మద్ధతుగా వెబ్‌సైట్‌లో ఓటు వేయాలంటూ కోరారు. రెండు మూడు రోజులు ఈ వెబ్‌సైట్ గురించి బాబు అనుకూల మీడియా ఊదరగొట్టింది. ఆ తర్వాత షరా మామూలుగానే మరచిపోయింది. ప్రస్తుతం ఆ వెబ్‌సైట్ గురించిన ఊసును బాబు గానీ, అనుకూల మీడియా గానీ ఎత్తకపోవడం గమనార్హం. ప్రస్తుతం కరోనా పై ప్రారంభించిన వెబ్‌సైట్ కూడా ఈ తరహాలోనిదేనన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.