Idream media
Idream media
సాధారణ ఎన్నికలు 2024లో జరుగుతాయి. ఇంకా రెండున్నరేళ్ల సమయం ఉంది. అప్పుడు జరిగే ఎన్నికలకు ఇప్పటి నుంచే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సిద్ధమవుతున్నట్లు ఆయన చర్యల ద్వారా అర్థమవుతోంది. ఎన్నికల హామీలను ఇప్పటి నుంచే ఇవ్వడం మొదలుపెట్టారు చంద్రబాబు. ఓటీఎస్ పథకానికి ఎవరూ డబ్బులు కట్టవద్దని, తాను అధికారంలోకి రాగానే ఉచితంగా ఇళ్ల పట్టా ఇస్తానని చెప్పిన చంద్రబాబు.. తాజాగా మరో హామీని ఇచ్చారు. ఈ రోజు ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా.. బాబు దివ్యాంగులను దృష్టిలో పెట్టుకుని ఓ హామీ ఇచ్చారు. దివ్యాంగులను చట్ట సభలకు పంపే బాధ్యత తాను తీసుకుంటానని చంద్రబాబు చెప్పారు. వారికి రిజర్వేషన్లు ఇచ్చే ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు.
ఇన్నాళ్లు ఎందుకు పంపలేదో..?
రాజకీయ పార్టీల అంతిమ లక్ష్యం అధికారంలోకి రావడం. అందు కోసం ప్రజలను ఆకట్టుకోవాలి. చంద్రబాబు అప్పుడు, ఇప్పుడు అదే చేస్తున్నారు. అందులో తప్పుబట్టాల్సిన విషయం ఏమీ లేదు. అయితే చంద్రబాబు చిత్తశుద్ధినే ఇక్కడ దివ్యాంగులు శంకిస్తున్నారు. చంద్రబాబు కొత్తగా పార్టీ పెట్టలేదు. ఆయన టీడీపీ అధినేతగా.. ఐదు సాధారణ ఎన్నికలకు వెళ్లారు. 1999 నుంచి 2019 వరకు.. ఐదు సార్లు బాబు నేతృత్వంలో టీడీపీ ఎన్నికలకు వెళ్లింది. శాసన, లోక్‌సభ అభ్యర్థులను నిర్ణయించే ఏకైక అధికారం చంద్రబాబుదే. మరి ఇన్నిసార్లు ఎన్నికలకు అభ్యర్థులను ఎంపిక చేసిన చంద్రబాబుకు.. ఒక్కసారి కూడా దివ్యాంగులు గుర్తుకు రాలేదా..? అనేదే ప్రశ్న. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ, విభజిత ఆంధ్రప్రదేశ్‌లోనూ ఒక్కంటే ఒక్క సీటు దివ్యాంగులకు ఇవ్వాలని, వారిని చట్టసభలకు పంపాలనే ఆలోచన బాబుకు రాకపోవడం విశేషం. ఇప్పుడు రాజకీయ జీవిత చరమాంకంలో ఆ విషయం గుర్తుకురావడం, ఆ బాధ్యతను ఇప్పుడు తీసుకుంటాననడమే విడ్డూరంగా ఉంది.
రిజర్వేషన్లు.. బాబు మరచిపోని అస్త్రం..
ఇక దివ్యాంగులకు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తానని చంద్రబాబు చెప్పారు. ఓట్ల వేటలో ఇలాంటి హామీలు ఇవ్వడం చంద్రబాబుకు కొత్తేమి కాదు. కాపులను బీసీల్లో చేర్చడం, రజకులను ఎస్సీలలో చేర్చడం.. ఇలా 2014 ఎన్నికల్లో అనేక రిజర్వేషన్ల హామీలు ఇచ్చారు. ఆయా హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేసి ఉంటే.. ఇప్పుడు బాబు చెప్పే మాటలను, ఇచ్చే హామీలను నమ్మే అవకాశం ఉండేది. ప్రజలు నమ్ముతారా..? లేదా..? అనే అంశంతో సంబంధం లేకుండా ఈ తరహా హామీలు ఇవ్వడం అయితే చంద్రబాబు మళ్లీ మొదలు పెట్టారు. రాబోయే రోజుల్లో ఇలాంటి హామీలు.. ఇంకా ఎన్ని రాబోతున్నాయో చూడాలి.
Also Read : TDP, Chandrababu, OTS – డ్వాక్రా సంఘాలు, ఓటీఎస్.. ఓ చంద్రబాబు