iDreamPost
iDreamPost
చంద్రబాబు జీవితంలో అనేక మెట్లు ఎదిగారు. ఆయన రాజకీయ ప్రస్థానంలో తన ఎదుగుదల కోసం అనేక మందిని పావులుగా వాడుకున్నారనే అపకీర్తి కూడా ఆయనకుంది. ఆ విషయాన్ని కొంతకాలం పాటు చంద్రబాబుకి అత్యంత సన్నిహితులుగా మెలిగిన వారు కూడా అనేకమార్లు చెప్పడం అందరికీ తెలిసిందే. చంద్రబాబు తోడల్లుడు నుంచి ఆయన మాజీ సన్నిహితులు ఎవరిని కదిపినా ఈ విషయంలో ఒకటే మాట చెబుతూ ఉంటారనేది వాస్తవం. అంతగా చంద్రబాబు తన అవసరాల కోసం ఏం చేయడానికైనా తెగించే మనస్తత్వం ఉన్న నేతగా పేరు గడించారు.
ఇక సమీప వర్తమాన చరిత్ర పరిశీలించినా అనేక మంది అనుభవం దానికి తగ్గట్టుగా ఉంటుంది. ఉదాహరణకు మోత్కుపల్లి నర్సింహులు జీవితం చాలామందికి పెద్ద పీఠం కూడా. గతం వదిలేస్తే వర్తమానంలో కూడా వర్ల రామయ్య విషయం అందుకు తగ్గట్టుగానే ఉంటుంది. అధికారంలో ఉన్నంత కాలం పెద్దగా పనికిరాని ఈ మాజీ పోలీస్ అధికారిని చంద్రబాబు అన్నింటికీ వాడేస్తున్నట్టు కనిపిస్తోంది. పరిపాలనలో ఉండగా రాజ్యసభ సీటుకి పనికిరాని వర్ల రామయ్యని ఇప్పుడు ఓడిపోతామని తెలిసిన సీటులో పోటీ చేసేందుకు కూడా వెనుకాడని నైజం చంద్రబాబుది. అయితే చంద్రబాబు ఏం చెప్పినా చేయడానికి సిద్ధపడుతున్న వర్ల రామయ్య వ్యవహారమే ఇప్పుడు విశేషంగా మారుతుంది. భవిష్యత్తులో ఏమవుతుందోననే చర్చకు ఆస్కారం ఇస్తుంది. మరోసారి పలువురి పూర్వ చరిత్ర పునరావృతం అయ్యే అవకాశం లేకపోలేదని భావించాల్సి వస్తోంది.
వాస్తవానికి వర్ల రామయ్యకు చంద్రబాబు చాలా పెద్ద ఆశలే కల్పించారు. కానీ వాటిని పాటించకుండా చివరకు కన్నీరు కూడా మిగిల్చారు. అయినా వర్ల రామయ్య వాటిని మనసులో పెట్టుకున్నట్టుగా లేదు. బాబుకి నమ్మిన బంటుగా వ్యవహరించేందుకు ఆయన సిద్ధపపడం విశేషం. గతంలో తన కన్నా సీనియర్ నేతల అనుభవాలు ఎదురుగా ఉన్నప్పటికీ వర్ల రామయ్య తెగింపు ఆసక్తికరమే. అందుకు తగ్గట్టుగానే చంద్రబాబు ఇప్పుడు ఒక ప్రెస్ మీట్ పెట్టాలన్నా వర్ల రామయ్యనే, పోలీసులకు ఓ ఫిర్యాదు చేయాలన్నా ఆయనే, చివరకు గెలిచే అవకాశం ఏ కోశాన లేని రాజ్యసభ కూడా ఆయనకే. ఇలా వైఎస్సార్సీని ఎదుర్కోవడంలో ఆయన్ని కీలక అస్త్రంగా మలచుకుంటున్నారు.
చంద్రబాబు సీఎంగా ఉన్న కాలంలో అనేకమంది నేతలకు కీలక పదవులు కట్టబెట్టారు. అసలు ఎన్నడూ టీడీపీ జెండా మోసిన అనుభవమే లేని కారం శివాజీ వంటి వారికి కూడా ఎస్సీ, ఎస్టీ కమిషన్ పదవిని అప్పగించారు. కానీ వర్ల రామయ్యకు మాత్రం రాజ్యసభ, ఎమ్మెల్సీ ఆశ చూపించి దీర్ఘకాలం ఎదురుచూపులు మిగిల్చారు. చివరకు ముణ్నాళ్ల ముచ్చటగా అనివార్యమయిన పరిస్థితిలో ఆర్టీసీ చైర్మన్ పదవిని కట్టబెట్టి సంతృప్తిపిచారు. అయినా వర్ల రామయ్య తనకు జరిగిన అన్యాయాన్ని మరచిపోయి, తనకన్నా జూనియర్లకు ప్రధాన పదవులు కట్టబెట్టిన విషయాన్ని మనసులో పెట్టుకోకుండా చంద్రబాబు కోసం దేనికైనా సిద్ధపడుతున్నారు. చంద్రబాబు ఆదేశాలను తూచా పాటిస్తున్నారు. లేనిపోని ఆరోపణలకు సైతం సిద్ధమవుతున్నారు. ఆ క్రమంలో తాజాగా నిమ్మగడ్డ లేఖలో వర్ల రామయ్య ప్రమేయంపై చట్టపరమైన సమస్యల్లో కూడా ఇరుక్కుంటున్నారు. అయినా చంద్రబాబు మీద విశ్వాసంతో వర్ల రామయ్య సాగుతున్న తీరు విశేషంగానే చెప్పాలి. చంద్రబాబు గత చరిత్ర రీత్యా వర్ల రామయ్య అనుభవం కూడా అవసరం తీరిన తర్వాత ఏమవుతుందోననే అనుమానాలు కూడా పలువురు టీడీపీ నేతల్లో కూడా వ్యక్తమవుతుండడం విశేషం. కులం కార్డు రీత్యా ప్రస్తుతం చంద్రబాబుకి రామయ్య అవసరం ఉన్నప్పటికీ బాబు గురించి బాగా తెలిసిన వారందరికీ భవిష్యత్ మాత్రం ఇట్టే బోధ పడుతున్నట్టు ఉంది