iDreamPost
iDreamPost
పరిపాలనాదక్ష్యుడు అంటూ ఓ వర్గం మీడియా కల్పించిన పెద్ద స్థాయి ప్రచారం ఎంత పెద్ద బోగస్ అన్నది ఒక్క ఫ్లై ఓవర్ నిరూపించింది. అడ్మినిస్ట్రేటర్ ముద్ర వేయించుకుని అందరినీ నమ్మించిన చంద్రబాబు పాలనా తీరుని ప్రస్ఫుటంగా చాటింది. ఐదేళ్లలో ఓ ఫ్లైఓవర్ పూర్తిచేయలేని ఆయన నిస్సహాయతను ప్రదర్శించింది. కేంద్రం నుంచి నిధులు వచ్చినా పనులు చేయలేని సమర్థను బయటపెట్టింది. అందులోనూ అత్యుత్తమ రాజధానిగా నిర్మిస్తామని చెప్పుకున్న అమరావతిలో అడుగుపెట్టేందుకు అవసరమైన మార్గంలోనే ఎంత అలసత్వం చూపారో అన్నది బహిరంగమయ్యింది.
సీన్ కట్ చేస్తే చంద్రబాబు వైఫల్యాలను ప్రజలు గ్రహించారు. మొన్నటి ఎన్నికల్లో బుద్ధిచెప్పారు. కానీ బాబు ప్రచారయావ ఏమాత్రం తగ్గలేదని అనేక అంశాల్లో నిరూపితం అయ్యింది. చివరకు విజయవాడలోని కనకదుర్గ ఫ్లైఓవర్ విషయంలో మరోసారి ప్రదర్శితమవుతోంది. 2013లో ప్రణాళికలు వేసి, 2015లో పనులు ప్రారంభించినప్పటికీ 2019 మధ్య వరకూ దానిని పూర్తి చేయలేక చేతులెత్తేసిన చంద్రబాబు ఇప్పుడు నా వల్లే అని చెప్పుకోవడానికి సిద్దమయ్యారు. చంద్రబాబు కృషి వల్లే ఈ ఫ్లైఓవర్ నిర్మాణం అంటూ కొన్ని మీడియా సంస్థలు మొదలెట్టేశాయి. నాలుగేళ్ల వైఫల్యం జనం మరచిపోయారని వారు భ్రమిస్తున్నారు. రెండేళ్లు నిండకుండానే జగన్ ప్రభుత్వం ఫ్లైఓవర్ ప్రారంభానికి చేసిన ప్రయత్నాలను ప్రజలు గ్రహించకూడదని భావిస్తున్నారు. అంత గొప్పగా చెప్పుకునే విజయవాడకి కూడా చంద్రబాబు చేసిన అన్యాయం సామాన్యులు గుర్తించకూడదనే ఆశతో సాగుతున్నారు.
సకాలంలో ఈ ఫ్లైఓవర్ పూర్తి చేసి ఉంటే ప్రభుత్వానికి 200కోట్లు మిగిలేది. కానీ ఉద్దేశపూర్వకంగా కాలయాపన చేసి కాంట్రాక్టర్లకు మరింత ప్రయోజనం కలిగించేందుకు ప్రభుత్వమే తోడ్పడిన విషయం ఇక్కడ తేటతెల్లం అవుతోంది. 223 కోట్ల ప్రాజెక్టు 450 కోట్లు దాటిపోవడం వెనుక బండారం అందరకీ అర్థమవుతోంది. ఈ వ్యవహారంలో టీడీపీ నేతల వాటా ఉంటుందనే విషయంలో ప్రజల ఊహాకు అందనిది కాదు. ఇంత బాహాటంగా ప్రజాధనం లూటీ చేసి ఇప్పుడు మళ్లీ తమ వల్లే ఈ ఫ్లై ఓవర్ అని చెప్పుకునే ప్రయత్నం చేయడమే విశేషంగా మారింది. ప్రచారంతో ప్రజలను ఎల్లవేళలా మభ్యపెట్టాలనే ఆతృత వెల్లడవుతోంది. ప్రజల మనసులను గెలిచేందుకు మంచి పనులు చేసి కాకుండా, మీడియా సాయంతో క్రెడిట్ కొట్టేసి, సమర్థుడనే ముద్రలతో ఎంతకాలమైనా సాగిపోవాలనే ఆలోచన కనిపిస్తోంది. కానీ కాలం మారింది..2020 లలో కూడా ముప్పై ఏళ్ల నాటి ఎత్తుగడలు పనికిరావని బాబుకి అర్థంకాకపోవడంతోనే విజయవాడ లో ప్రారంభానికి సిద్ధమయిన ఫ్లైఓవర్ లో క్రెడిట్ కోసం బాబు చేస్తున్న ప్రయత్నాలని భావించవచ్చు.