iDreamPost
android-app
ios-app

ప్ర‌జ‌ల కోసం లేఖ రాసింది లేదు కానీ…

ప్ర‌జ‌ల కోసం లేఖ రాసింది లేదు కానీ…

ఏపీ వైసీపీ ఎంపీ ర‌ఘురామ రాజు అరెస్టుపై ఎందుకో కానీ టీడీపీ నేత‌లు ఎక్కువ‌గా స్పందిస్తున్నారు. తెగ గుబులు చెందుతున్నారు. జూమ్ మీటింగ్ లు పెట్టి మ‌రీ బాధ‌ప‌డిపోతున్నారు. ఒక‌రేమో ఏకంగా రాష్ట్రప‌తి జోక్యం చేసుకోవాలి అంటున్నారు.. మ‌రొక‌రేమో ప్ర‌ధాని దృష్టికి తీసుకెళ్తాం అంటున్నారు.. ఇంకొక‌రేమో న్యాయ‌స్థానాలు స‌రైన ఆదేశాలివ్వాలి అంటున్నారు.. వైసీపీ ఎంపీకి, వీళ్ల‌కు ఉన్న బంధం ఏంటో తెలీదు కానీ.. ఆయ‌న అరెస్టు, న్యాయన్యాయాల‌పై ఓ వైపు న్యాయ‌స్థానంలో వాద‌న‌లు జ‌రుగుతుండ‌గానే రామ‌, రామ.. ర‌ఘురామ‌రాజును అరెస్టు చేయ‌డ‌మా అంటూ వాపోతున్నారు. తాజాగా ఎంపీ రఘురామ అరెస్ట్‌పై టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర హోంశాఖ కార్యదర్శికి లేఖ రాశారు.

ప్ర‌స్తుతం రాష్ట్ర ప్ర‌జ‌లు క‌రోనా సృష్టిస్తున్న క‌ల్లోలంతో ఆగ‌మాగ‌మ‌వుతున్నారు.

ఓ ప‌క్క రాష్ట్ర ప్ర‌భుత్వం చేయాల్సిందంతా చేస్తున్నా, కేంద్రం నుంచి రావాల్సిన వ్యాక్సిన్ లు, ఆక్సిజ‌న్ లు స‌కాలంలో రాక‌పోవ‌డంతో అక్క‌డ‌క్క‌డా ఇబ్బందులు ఏర్ప‌డుతున్నాయి. ఇటువంటి విష‌యాల‌పై ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా ఉన్న చంద్ర‌బాబు త‌న వంతుగా కేంద్రంతో మాట్లాడింది కానీ, లేఖ రాసింది కానీ లేదు. ఎంపీ ర‌ఘురామ రాజు అరెస్ట అయిన‌ప్ప‌టి నుంచీ మాత్రం తెగ ఆదుర్దా ప‌డుతున్నారు. అన్యాయం, అక్ర‌మం అంటూ స్టేట్ మెంట్ లు ఇస్తున్నారు. అంత‌టితోనే ఆగ‌లేదు. కేంద్ర హోంశాఖ కార్యదర్శికి లేఖ రాసి మ‌రింత ప్రేమ చాటుకున్నారు.

రఘురామకు వైసీపీ ప్రభుత్వం, పోలీసుల ద్వారా ప్రాణహాని ఉందని, ఇలాంటి పరిస్థితుల్లో ఎంపీ ప్రాణాలు కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని చంద్రబాబు ఆ లేఖలో కోరారు. సీఎం జగన్ నుంచి తనకు ప్రాణహాని ఉందని, ఎంపీ రఘురామ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ ఫైల్ చేస్తే, ఆయనకు భద్రత కల్పించారని గుర్తు చేశారు. కోర్టు ఆదేశాలతో ఆయనకు వై కేటగిరి భద్రత వచ్చిందన్నారు. ప్రతిపక్షాలు నిరసన తెలపడం ప్రమాదమని భావించడమంటే ప్రజాస్వామ్య ప్రాథమిక సూత్రాలను తప్పుగా అర్థం చేసుకోవడమేనని స్పష్టం చేశారు. అంటే ఆ ఎంపీ త‌మ ప‌క్ష‌మ‌ని ఈ లేఖ ద్వారా తెలియ‌జేస్తున్నారో, ఏమో అర్థం కావ‌డం లేదు. జగన్ ప్రభుత్వం ఇలాంటివి చేయడం కొత్తేమీ కాదని కూడా లేఖ‌లో పేర్కొన్నారు. ఆయ‌న వీరి ప‌క్ష‌మే అయినా, కాక‌పోయినా ప్ర‌జ‌ల‌కు, రాష్ట్రానికి వ‌చ్చిన న‌ష్టం, లాభం ఏం లేదు. అయితే, అత‌ని గురించి లేఖ రాసిన చంద్ర‌బాబు, త‌మ క‌ష్టాల‌పై ఇప్ప‌టి వ‌ర‌కూ కేంద్రాన్ని ఎందుకు ప్ర‌శ్నించ‌లేద‌నేదే ప్ర‌జ‌ల ప్ర‌శ్న‌.