గ్లోబల్స్ ప్రచారంలో గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని మించిన వారు ఎవరూ లేరని ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. అన్ని నేనే…అన్ని తానే అంటూ ప్రచారం చేసుకున్న చంద్రబాబు అధికారం కోల్పోయిన తరువాత కొద్దీగా బాణీ మార్చి ఎల్లో మీడియాలో మెయిన్ పేజీలో దర్శనమిస్తున్నారు. ఈ విషయంలో మాత్రమే చంద్రబాబు చాలా గ్రేట్ అంటూ వార్తలు ప్రచారం జరుగుతున్నాయి.
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీసిన ‘రక్త చరిత్ర’ సినిమాలో ఫేమస్ డైలాగ్ ఉంది. ‘క్రైమ్ నెవెర్ ఎండ్స్ బట్ ఇట్ చేంజెస్ ఇట్స్ ఫెజెస్’ అనే డైలాగ్ గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి విషయంలో నూటికి నూరుపాళ్లు రుజువుతోంది. వాస్తవాలు కాకుండా అవాస్తవాలను కూడా ప్రజలకు చెప్పడం కూడా క్రైమ్ లాంటిదే అని మేధావులు ఎప్పుడో చెప్పిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ నిర్మాత నేనే…ఐటీ కంపెనీల విజనీర్ నాదే…సంపద సృష్టించింది నేనే అంటూ మొదలెట్టిన ఆయన ఒకానొక దశలో ప్రధానమంత్రి పదవి ఆఫర్ వచ్చినా రాష్ట్ర అభివృద్ధి కోసం వద్దని చెప్పానని ప్రచారం చేసుకున్నారు. 2003 అక్టోబర్ అలిపిరిలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబుపై బాంబు దాడి జరిగింది. అదృష్టవశాత్తు ఆయన ఆ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. దీంతో ఈ ప్రమాదాన్ని కూడా తనకు అనుకూలంగా వాడుకునేందుకు ఈ పునర్జన్మ మీ కోసమే అంటూ ప్రచారం చేసుకున్న ఘనత ఆయనది.
చంద్రబాబు మార్క్ రాజకీయం
తనకు అనుకూలమైన మీడియాలో ప్రతిరోజూ వార్తలు వచ్చేలా చూసుకునే విజన్ చంద్రబాబుది అంటూ విమర్శలు ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. ఆ ప్రచారం వాస్తవమే అంటూ వైఎస్ఆర్, కేసిఆర్, వైఎస్ జగన్ రుజువలతో పలు సందర్భాలలో నిరూపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ లో మొదలైన ఐటీ విప్లవాన్ని తనకు అనుకూలంగా మార్చుకొని కీర్తి దక్కించుకున్నాడని ఇప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చ జరుగుతూనే ఉంటుంది. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా హవా సాగుతున్న సమయంలో చంద్రబాబు చెప్పిన అవాస్తవాలన్నీ వాస్తవాలుగా ప్రజలకు చేరవేసే ప్రయత్నాలు జరిగాయి. కానీ సోషల్ మీడియా రాకతో చంద్రబాబు గ్లోబల్స్ ప్రచారంపై వాస్తవాలు ప్రజలకు తెలుస్తున్నాయి.
అదే మార్క్ బాణీ మారింది
ఎన్నికల సమయంలో ఇచ్చిన హమీలను అమలు చేయకుండా అన్నీ చేశానంటూ గొప్పగా చెప్పుకున్న చంద్రబాబు చివరి నిమిషంలో ఆడవారి కోసం ‘పసుపు-కుంకుమ’ అంటూ కొత్త పథకాన్ని తీసుకువచ్చారు.కానీ ఏపీ ప్రజలు గతాన్ని మరిచిపోకుండా చంద్రబాబుకు దారుణ పరాజయాన్ని రుచి చూపించారు. టీడీపీకి కేవలం 23 సీట్లు మాత్రమే వచ్చినా చంద్రబాబు తన తీరు మార్చుకోలేదు. రాష్ట్రానికి పనికొచ్చే ఒక్క సలహ కూడా ఇవ్వకుండా ప్రతిరోజూ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. తన అనునాయుల చేత కోర్టులలో కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసులు వేయించడం లాంటివి చేస్తూ వికృతానందం పొందుతున్నారు. మహమ్మారి కరోనా రాష్ట్రంలో విలయతాండవం చేస్తుంటే ఏపీతో తనకు సంబందం లేదంటూ హైదరాబాద్ లో ఉండిపోయారు.
కానీ ఏదో ఒక కారణంతో వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు విమర్శలు చేస్తూనే ఉన్నారు. కానీ తన మార్క్ ప్రచారం కొనసాగిస్తూనే కొద్దీగా బాణీ మార్చారు. అక్రమంగా నిర్మించిన భవనాలకు నోటీసులు ఇచ్చి జగన్ సర్కార్ కూల్చివేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇదే సమయంలో చంద్రబాబు విరుద్ధ ప్రకటనలు చేస్తూ అడ్డంగా దొరికిపోయినా కూల్చివేత ఆపండి అంటూ చేసిన హడావిడిని చూసి ప్రజలు నవ్వుకున్నారు. అవినీతి కేసులలో తమ నాయకులు జైళ్లకు వెళుతుంటే చంద్రబాబు ఇది ప్రభుత్వం కుట్ర అంటూ అరెస్ట్ ఆపండి అంటూ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. జగన్ సర్కార్ చేస్తున్న ప్రతి పనిని కావాలనే చంద్రబాబు అడ్డుకుంటున్నారు.
40 ఇయర్స్ అయితే
జగన్ సర్కార్ అభివృద్ధి పేరిట మూడు రాజధానుల నిర్ణయం తీసుకుంటే ‘అమరావతి’ పేరిట కృత్రిమ ఉద్యమాన్ని 300 రోజుల నుంచి నడిపిస్తున్న ఘనత చంద్రబాబుకే దక్కుతుంది. తమ పరిపాలన సమయంలో ప్రతి దానికి పసుపు రంగు అద్దిన చంద్రబాబు ప్రభుత్వం తమ పథకాలను వాడుకుంటూ తమకే ఓటు వేయాలని ప్రచారం చేసుకున్నారు. కానీ వైసీపీ ప్రభుత్వం పార్టీ చూడం…మతం చూడం..ప్రాంతం చూడం..అంటూ చెబుతుంటే చంద్రబాబు అస్మదీయులు ఓర్వలేని తనంతో కేసులు వేస్తూనే ఉన్నారు. ఆ కేసుల వెనుక చంద్రబాబు ఉన్నారని ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పని చేసిన నాయకుడి నోటి నుంచి రాకూడని మాటలన్నీ చంద్రబాబు యథేఛ్ఛగా వాడేస్తున్నారు.
రాజధాని భూములను పేద ప్రజలకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయిస్తే ఇళ్ళ స్థలాలు ఇవ్వకండి అంటూ చంద్రబాబు పిలుపునిచ్చారు. రాజధానిలో అందరికి నివాసం కల్పించాలనే విషయం చంద్రబాబుకి తెలియంది కాదు. కానీ ఆయనకున్న విజన్ ఒక్కటే ఆ క్రెడిట్ జగన్ కు దక్కకూడదు. అలాగని తాను చేస్తాడా? అది కూడా చేయడు. ఇలాంటి నాయకుడికి 40 సంవత్సరాలు అనుభవం అంటూ చెప్పుకోవడంపై విమర్శలు వినబడుతున్నాయి. పేద విద్యార్థులకు ఇచ్చిన యూనిఫామ్స్ మీద కూడా బాబు గారు నోరు పారేసుకున్నారు. ప్రతిఒక్క విషయంపై ఆయన చేస్తున్న రాద్ధాంతంపై చంద్రబాబు ఇలా చేయడమేంటని ప్రజలు చర్చించుకుంటున్నారు.
అధికారం కోసమే
చేతకాక పోతే అధికారం నుంచి తప్పుకోవాలంటూ చంద్రబాబు వైసీపీ ప్రభుత్వానికి సలహ ఇచ్చారు. ఇప్పటికిప్పుడు అధికారంలోకి రావాలంటూ తపన తప్పా చంద్రబాబుకు అంతకు మించి ఏ ఒక్కటి పట్టదు. అధికారంలో ఉన్నప్పుడూ ఒకలా ప్రతిపక్షంలోకి రాగానే సంప్రదాయాలు, విలువలు గురించి పదే పదే చెప్పడంపై రాష్ట్రంలోనే కాదు దేశంలోని నాయకులు చంద్రబాబు తీరుపై వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు. కానీ బాబు తీరు మారదు. ఎందుకంటే రియల్ ఎస్టేట్ వ్యాపారులు, తాబేదారులు, ఎల్లో మీడియాకు ఆయన ప్రియాతి ప్రియమైన నాయకుడు. తమ నాయకుడు కోసం వారు ఏదయినా చేస్తారు…వారి కోసం చంద్రబాబు ఏదయినా చేసి పెడతారు.
ఇలాంటి నాయకుడు గురించి ఎల్లో మీడియా విజన్ ఉన్న నాయకుడు అంటూ చేస్తున్న ప్రచారంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా చంద్రబాబు తన తీరు మార్చుకోవాలని మెజారిటీ ప్రజలు హితువు పలుకుతున్నారు.