Idream media
Idream media
ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. మూడు రాజధానుల ప్రకటన మిగతా పార్టీలతో పోలిస్తే టీడీపీకి తీవ్ర నష్టం చేకూర్చిందని చెప్పొచ్చు. అందుకు పార్టీ అధినేత చంద్రబాబునాయుడు స్వయం కృతాపారాధమే కారణమని పార్టీ వర్గాల్లోనే ప్రచారం జరుగుతోంది. కార్యనిర్వాహక రాజధానిగా విశాఖను వ్యతిరేకించడంతో తెలుగుదేశానికి కష్టాలు మొదలయ్యాయి. ప్రధానంగా ఉత్తరాంధ్రలో ఆ ఎఫెక్ట్ ఎక్కువగా ఉన్నప్పటికీ రాష్ట్రంలోనే పార్టీ కి కష్టాలు మొదలయ్యాయి. మూడు రాజధానుల ప్రకటనతో అటు వైసీపీ కి ఊహించని మద్దతు లభిస్తోంది. మరోవైపు కేంద్రం నిర్ణయంతో ఏపీ బీజేపీ కూడా మూడు రాజధానులకు వ్యతిరేకంగా మాట్టాడడం మానేసింది. దీంతో ఆ ప్రకటనను వ్యతిరేకించిన టీడీపీకే చంద్రబాబు నిర్ణయంతో తీవ్ర నష్టం వాటిల్లింది.
ప్రధాన నేతలు వైసీపీ వైపు.. మాజీలపై బీజేపీ ఫోకస్..
తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రధాన నేతలు, ఎమ్మెల్యేలు ముఖ్యంగా విశాఖకు చెందిన వారు వైసీపీ వైపు మొగ్గు చూపుతున్నారు. టీడీపీ మాజీ మంత్రులను, ద్వితీయ శ్రేణులను బీజేపీ టార్గెట్ చేసింది. దీంతో టీడీపీ పరిస్థితి అడకత్తెరలో పోకచక్కలా మారింది. వైసీపీపై కనీస విమర్శలు చేస్తున్న టీడీపీ.. బీజేపీని మాత్రం పల్లెత్తు మాట అనలేకపోతోంది. ఉత్తరాంధ్రలో ఎన్టీఆర్ రాక ముందు కాంగ్రెస్, కమ్యూనిస్టుల మధ్య ప్రధానంగా పోరు సాగేది. ఆ తర్వాత కాలంలో కాంగ్రెస్, టీడీపీ మధ్య పోరులా మారింది. ఈ పోరులో అర్బన్ ప్రాంతాలు కాంగ్రెస్ వైపు, రూరల్ ప్రాంతాలు టీడీపీకి పట్టం కట్టేవి. ఓ దశలో అర్బన్ ప్రాంతాలలోనూ టీడీపీ హవా కొనసాగేది. ఇందుకు ఉత్తరాంధ్రలోని బీసీ సమీకరణాలే కారణం. నిన్న, మొన్నటి వరకు కూడా ఉత్తరాంధ్ర టీడీపీకి కంచుకోటగా ఉండేది.
రాజధాని రాకతో..
విశాఖ రాజధాని ప్రకటనతో వైసీపీకి ప్రాధాన్యం పెరిగింది. కీలక నేతల దృష్టి అంతా ఇప్పుడు ఆ పార్టీపైనే పడింది. ఇప్పటి నుంచే ఆ పార్టీలో కొనసాగితే మున్ముందు తమ రాజకీయ భవిష్యత్ కు మంచి బాటలు ఏర్పడతాయని చాలా మంది భావిస్తున్నారు. టీడీపీలో కీలకంగా ఉండే విశాఖ డెయిరీ కుటుంబం, పార్టీ రూరల్ అధ్యక్షుడిగా వ్యవహరించిన మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, తాజాగా విశాఖ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ వైసీపీ వైపు మళ్లారు. దీంతో భారతీయ జనతా పార్టీ కూడా వైసీపీ కి పోటీగా ఆపరేషన్ ఆకర్ష్ కు తెర తీసింది. గతంలో ఉత్తరాంధ్రలో కాస్తో కూస్తో ప్రభావం చూపిన అనుభవంతో తెలుగుదేశానికి చెందిన మాజీలపై దృష్టి సారించింది. వారిని పార్టీ వైపు తిప్పుకునేందుకు స్థానిక నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ పరిణామాలతో తెలుగుదేశానికి తీవ్ర నష్టం వాటిల్లడం ఖాయంగా కనిపిస్తున్నాయి.