iDreamPost
iDreamPost
ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజా వ్యతిరేకత పెరుగుతోందని తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు కొత్త పల్లవి అందుకున్నారు. అందుకే ప్రజలను పోలీసులతో అణగదొక్కుతున్నారని చెప్పారు. అమరావతి రాజధానికోరుతూ రైతులు చేస్తున్న శాంతియుత పాదయాత్రపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపడం అన్యాయమని అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రైతుల పాదయాత్రను అడ్డుకుని చరిత్ర హీనులుగా మిగలొద్దని ముఖ్యమంత్రిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇప్పటికే రాజధాని అమరావతిని నిర్వీర్యం చేసి 5 కోట్ల ప్రజల భవిష్యత్తును అంథకారంలోకి నెట్టి క్షమించరాని తప్పు చేశారని ఆవేశ పడిపోయారు. పాదయాత్రను కోవిడ్ ఆంక్షల పేరుతో అడ్డుకోవడం సమంజసం కాదని చంద్రబాబు అన్నారు.
నిబంధనలు పాటించకపోతే చర్యలు తీసుకోరా?
న్యాయస్థానం టు దేవస్థానం పేరుతో అమరావతి నుంచి తిరుపతికి మహాపాదయాత్ర పేరిట రైతుల చేస్తున్నది పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా సాగుతోంది. అందుకే రైతులకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. హైకోర్టు కేవలం 157 మంది అమరావతి రైతులు పాదయాత్ర చేయడానికి అనుమతించింది. అయితే ఆ యాత్రను అంతకు రెండింతల తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలతో నిర్వహిస్తున్నారు. పేరుకు రైతు యాత్ర కాని అది తెలుగుదేశం పార్టీ నిర్దేశకత్వంలో సాగుతోందని ఇప్పటికే విమర్శలు వస్తున్నాయి. తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు జంక‌్షన్‌లో మూడు రాజధానులకు మద్దతుగా 400 రోజులుగా నిరాహార దీక్షలు చేస్తున్న బహుజన పరిరక్షణ సమితి నాయకులు రైతుల మహా పాదయాత్రను తూర్పార పడుతున్నారు. ఒక సామాజిక వర్గం ప్రయోజనం కోసం ఈ యాత్ర నిర్వహిస్తున్నారని, ఈ దొంగ యాత్ర ద్వారా అవసరమైతే చంద్రబాబు అల్లర్లు సృష్టించాలనుకుంటున్నారని కూడా వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకు అనుగుణంగానే తెలుగుదేశం నాయకులు కూడా వ్యవహరిస్తూ యాత్రను అడ్డుకుంటే సహించం అంటూ ప్రకటనలు ఇస్తూ, మీడియా ద్వారా హడావుడి చేస్తూ ఈ యాత్రకు హైప్ క్రియేట్ చేయడానికి ప్రయాస పడుతున్నారు.
Also Read : Tdp ,Konatala -కొణతాలకు టీడీపీ ఆఫర్.. ఆ మాజీ ఎమ్మెల్యే పరిస్థితి ఏమిటి..?
తండ్రీకొడుకులిద్దరిదీ అదే దారి..
తెలుగుదేశం నాయకులు, ముఖ్యంగా చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ ఆదివారం వేర్వేరుగా ఈ అంశంపై స్పందించినా ఒకేలా వ్యాఖ్యలు చేశారు. బాబు మీడియాతో మాట్లాడగా లోకేశ్ ప్రకటన ద్వారా వ్యాఖ్యానించారు. అమరావతి రైతుల పాదయాత్రకు ప్రజలు నుంచి వస్తున్న మద్దతు చూసి వైఎస్సార్ సీపీ ఓర్వలేక పోతోందంటూ వీరు ఆవేదన వ్యక్తం చేశారు.. అందుకే పాదయాత్రకు అడుగడుగునా అడ్డంకులు, అవరోధాలు కల్పిస్తోందని ఆరోపించారు. పోలీసులను అడ్దుపెట్టుకుని ఉక్కుపాదం మోపుతోందన్నారు. కోర్టు అనుమతి ఇచ్చిన పాదయాత్రను అడ్డుకునేందుకు ప్రయత్నించడం హేయమైన చర్యగా అభివర్ణించారు. తెలుగుదేశం నాయకుల ఆధ్వర్యం వహిస్తున్న ఈ పాదయాత్రను నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తూ దాన్ని పోలీసులు అడ్డుకుంటే రాద్ధాంతం చేయాలని ఆది నుంచీ ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదో జరిగిపోతోందని కలర్ ఇవ్వడానికి చంద్రబాబు ఈ యాత్రను వాడుకోవాలని తాపత్రయపడుతున్నారు.
అందుకే అసహనం..
అమరావతి రాజధాని అంశాన్ని 29 గ్రామాల రైతుల సమస్యగా వైఎస్సార్ సీపీ నాయకులు ఎప్పటి నుంచో పేర్కొంటున్నారు .దీన్ని 5 కోట్ల ప్రజల భవిష్యత్తుతో ముడిపెట్టి వ్యాఖ్యానించేస్తే రాష్ట్రంలో జనమంతా ఆవేశపడిపోయి ఈ యాత్రకు మద్దతు ఇస్తారని చంద్రబాబు ఆశ. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజా వ్యతిరేకత పెరుగుతుంటే సంతోష పడవలసిన చంద్రబాబులో రోజురోజుకి అసహనం ఎందుకు పెరిగిపోతోంది? ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజకీయంగా ఆయన వేస్తున్న ఎత్తులన్నీ ఎప్పటి కప్పుడు చిత్తవుతున్నాయి. ప్రజాక్షేత్రంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వానికి గ్రాఫ్ రోజురోజుకి పెరుగుతోంది. అందుకే బాబు అండ్ కోకు అసహనం. దాన్ని కప్పి పుచ్చుకోవడానికి ఒకరోజు గంజాయి, మరో రోజు పెట్రోల్, ఇంకోసారి రైతుల పాదయాత్ర అంటూ ఏదో అంశాన్ని తీసుకుని ప్రభుత్వంపై బురద జల్లాలని ఎప్పటినుంచో బాబుగారు ఫిక్స్ అయిపోయారు. జనం ఇవన్నీ గమనించరని ఆయన నమ్మకం. అందుకే ఈ విన్యాసాలు.
Also Read : Pasupu Kumkuma – Dalita Bandhu : బాబు, కేసీఆర్ లను బోల్తా కొట్టించిన పథకాలు