iDreamPost
iDreamPost
కాదేదీ కవితకనర్హం అన్నట్టు..రాజకీయం చేయడానికి టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏదీ అనర్హం కాదు. అది ప్రకృతి వైపరీత్యమైనా, పేదలకు వచ్చిన కష్టమైనా, పండగైనా, పబ్బమైనా, అత్యాచారం అయినా, హత్య అయినా ఏ ఘటన నుంచైనా ఆయన రాజకీయం పిండేస్తారు. పరిస్థితిని తన పార్టీకి అనుకూలంగా, అధికార పక్షానికి వ్యతిరేకంగా మార్చడానికి శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తారు. దీనికి ఎన్ని ఉదాహరణలు అయినా చెప్పుకోవచ్చు. తాజాగా తూర్పు గోదావరి జిల్లా రాజవొమ్మంగి మండలం లోదొడ్డిలో బుధవారం కల్తీ జీలుగు కల్లు తాగి ఐదుగురు మృతి చెందిన ఘటన తనకు అనుకూలంగా మలచుకునేందుకు ట్రై చేశారు.
ఈ ఘటనపై ఆయన స్పందిస్తూ ప్రజల ప్రాణాలు పోతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదన్నారు. దీనిపై ప్రభుత్వం స్పందించకపోవడం దుర్మార్గమన్నారు. అయితే బాధితులకు స్థానిక పీహెచ్సీలో వైద్యం అందించిన అధికారులు అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం కాకినాడ జీజీహెచ్ కు తరలించారు. ఏఎస్పీ అక్కడికి వెళ్ళి ఘటనపై ఆరా తీశారు. గిరిజనులు జీలుగు చెట్టు నుంచి అప్పటికప్పుడు సేకరించి తాగిన కల్లు ఎలా విషపూరితం అయింది అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఎవరైనా గిట్టనివారు కుండలోని కల్లులో విషం కలిపారా? ఎక్కువ మత్తు రావడం కోసం కొందరు గిరిజనులు కల్లులో డైజోఫాం, కొన్ని రకాల టాబ్లెట్స్ కలుపుతుంటారు. అలా కలిపి ఉంటే అది వికటించి మృతిచెందారా? అన్న అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వాస్తవం ఇది కాగా అసలు ప్రభుత్వం స్పందించలేదని, ప్రజల ప్రాణాలు పోతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదని విమర్శలు గుప్పించడం చంద్రబాబు నైజాన్ని బయట పెడుతోంది.
ఈ సీజన్ లో ఎక్కువ..
ఏజెన్సీలో ఈ సీజనులో జీలుగు కల్లును గిరిజనులు ఆడా,మగా భేదం లేకుండా ఎక్కువ తాగుతారు. అందుకోసం సుదూరంలో కొండలు, గుట్టలపై ఉన్న జీలుగు చెట్ల నుంచి కల్లు సేకరిస్తారు. ఒక్కోసారి కుండలో బల్లి వంటి విష పురుగులు పడడం, పొరబాటున పురుగు మందు కలవడం వంటి కారణాలతో కల్లు విషపూరితం అవుతుంది. అటువంటి సందర్భాల్లో తాగినవారు అనారోగ్యం పాలవడం, మృతి చెందడం జరుగుతుందని అధికారులు చెబుతున్నారు. గిరిజనుల్లో చైతన్యం కల్పించడం ద్వారానే ఇటువంటి దుర్ఘటనలు నివారించ వచ్చని చెబుతున్నారు.
చౌకబారు విమర్శలు ఎందుకు?
కల్తీ కల్లు తాగి ఐదుగురు మృతి చెందడం బాధాకరమే. వారి కుటుంబాలు రోడ్డున పడకుండా ఆదుకోవలసిన బాధ్యత ప్రభుత్వానిదే. అయితే ఇటువంటి సందర్భాల్లోనైనా హుందాగా వ్యవహరించకుండా చౌకబారు విమర్శలు చేయడం చంద్రబాబుకు తగదని వైఎస్సార్ సీపీ నేతలు సూచిస్తున్నారు. ప్రభుత్వ మద్యం విధానంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్న బాబు తన హయాంలో మాదిరి మళ్లీ రాష్ట్రమంతా బెల్ట్ షాపుల సంస్కృతి తీసుకురావాలంటారా? అని ప్రశ్నిస్తున్నారు. దశలవారీ మద్య నిషేధం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అందుకే బెల్ట్ షాపులు లేకుండా చేసి, మద్యం దుకాణాల సంఖ్య గణనీయంగా తగ్గించింది. మద్యాన్ని ఆదాయ వనరుగా చూడకుండా ప్రజల సహకారంతో మద్యం మహమ్మారిని రాష్ట్రం నుంచి తరిమేయాలని చూస్తోంది. ఒక సీనియర్ గా ఈ విషయంలో ప్రభుత్వానికి సూచనలు, సలహాలు ఇవ్వకుండా రాజకీయ వ్యాఖ్యలు చేయడం చంద్రబాబుకు తగదని వైఎస్సార్ సీపీ నేతలు అంటున్నారు.
Also Read : ఏపీలో ఎరువుల కొరత ఉందా..? ప్రతిపక్షం ప్రచారంలో నిజమెంత..?