iDreamPost
iDreamPost
అయ్యో చంద్రబాబు ఏం చెప్పాలనుకుంటున్నారు.
నాలుగున్నర దశాబ్దాల రాజకీయ జీవితం..పద్నాలుగేళ్లు ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రి..సుదీర్ఘకాలం ప్రతిపక్షంలో ఉన్న నాయకుడు..కానీ ఎందుకో తడబడుతున్నాడు. నోటికొచ్చింది మాట్లాడుతున్నారు. తాను ఏది మాట్లాడాలో, ఎందుకు మాట్లాడాలో కూడా తెలియకుండా వ్యవహరిస్తున్నట్టుంది. ఇప్పటికే అనేక అంశాల్లో చంద్రబాబు ఇదే పంథా అవలంభించారు. ఇప్పుడు ఏకంగా వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుల గురించి మాట్లాడుతున్నారు. సహజంగా టీడీపీ ఆఫీసులో నిత్యం సూక్తులు వల్లించే అధికార ప్రతినిధుల పేరుతో ఉన్న కొందరు నాయకుల మాటలు అర్థం చేసుకోవచ్చు గానీ, వారి స్థాయి అంతేనని సరిపెట్టుకోవచ్చు. కానీ ఇప్పుడు చంద్రబాబు అంతకుమించి దిగజారుతున్నారు.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు వ్యవహారమే ఇంకా స్పష్టత లేదు. దాని మీద పలువురు నిందితులను అరెస్ట్ చేసి సీబీఐ దర్యాప్తు సాగిస్తోంది. ఈకేసు త్వరగా కొలిక్కి రావాలని అంతా ఆశిస్తున్నారు. కానీ ఇప్పుడు చంద్రబాబు ఏకంగా నిందితులను హత్య చేస్తారా అంటూ మాట్లాడడం అనుమానాలకు తావిస్తోంది. మొద్దుశ్రీను ఉదంతంతో ముడిపెట్టి ఈ కేసులో నిందితుల గురించి ఆయన మాట్లాడుతున్న తీరు విడ్డూరంగా ఉంది. సహజంగా చంద్రబాబు స్థాయి నాయకుడు హుందాగా మాట్లాడాలి. ఈ వ్యవహారాన్ని రాజకీయం చేయాలనుకుంటే వివేకా హత్య కేసు నిందితులకు రక్షణ కల్పించాలని కోరాలి. రక్షణ ఏర్పాట్ల మీద నిలదీయాలి. కానీ అందుకు విరుద్ధంగా వారిని చంపేస్తారా అంటూ చంద్రబాబు మాట్లాడడం నిస్సిగ్గు రాజకీయాలకు తార్కాణంలా కనిపిస్తోంది. గతంలో కొన్ని తెలుగు సినిమా విలన్ల తీరుని తలపిస్తోంది.
వివేకానందరెడ్డి హత్య కేసు ప్రస్తుతం సీబీఐ చేతిలో ఉంది. నిందితులు సహా అందరికీ తగిన భద్రతా ఏర్పాట్ల మీద తగు జాగ్రత్తలు తీసుకుంటుంది. కానీ జైలు అధికారిని రాజకీయాల్లో లాగి, దాని చుట్టూ వివాదం సృష్టించాలని చంద్రబాబు అండ్ కో యత్నించడం విస్మయకరంగా మారింది. గతంలో కోడెల ఇంట్లో బాంబులు పేలాయి కాబట్టి ఆయన అసెంబ్లీ స్పీకర్ గానే సభలో బాంబులు పేలుస్తారా అని ఎవరైనా ప్రశ్నించారా.. పోనీ బాలకృష్ణ ఇంట్లో కాల్పులు జరిగాయని, ఆయన హిందూపురంలో అందరి ఇళ్లల్లో కాల్పులు జరుపుతారని విమర్శలు చేస్తారా.. కానీ చంద్రబాబు నైజం చూస్తుంటే ఎప్పుడో ఏదో ఘటన జరిగింది కాబట్టి ఇక అలాంటివే జరుగుతాయని అనడం సాధారణ రాజకీయ నాయకుడి స్థాయికి ఆయన పతనమవుతున్నట్టు కనిపిస్తోంది.
విపక్షనేతగా చంద్రబాబు అనేక అంశాల్లో ఇదే పంథాను అవలంభిస్తున్నారు. జగన్ ని బద్నాం చేయాలని చూడడమే తప్ప నిజంగా సమస్యల మీద తనకు చిత్తశుద్ధి ఉందనే విషయాన్ని ప్రజల్లో కల్పించలేకపోవడానికి ఇదే కారణం. ప్రజా సమస్యల మీద తనకు సానుకూల దృక్పథం లేదని ఆయనే నిరూపించుకుంటున్నారు. దాంతో రాజకీయంగా మరింత పతనం కావడమే తప్ప పార్టీకి గానీ, తనకు గానీ ప్రయోజనం ఉండదని తెలుసుకోలేకపోతున్నారు. వివేకా హత్య కేసుని రాజకీయ అవసరాల కోసం వాడుకోవాలనే యత్నంలో ఎంతవరకైనా తెగించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఇస్తున్న రాజకీయ సంకేతాలు ఆయన వర్తమాన దుస్థితికి దర్పణం పడుతున్నాయి.
Also Read : ఆ లెక్కన మిమ్మల్ని ఎన్నిసార్లు అరెస్ట్ చేయాలి బాబూ?