Idream media
Idream media
2019 ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత తెలుగుదేశం పార్టీ (టీడీపీ) వాయిస్ వినిపించే వారు కరువయ్యారు. తాజా, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు.. ఇలా అధికారంలో ఉన్నప్పుడు పదవులు చేపట్టిన వారు.. అధికారం పోయిన తర్వాత మీడియా ముందు బలంగా మాట్లాడేందుకు సిద్ధంగా లేరు. ఇందుకు కారణాలు అనేకం. ఒకరిద్దరు మీడియా ముందుకు వచ్చినా.. ఒక పరిధి వరకు మాత్రమే ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా చంద్రబాబు గొంతు వినిపించే వారు కరువయ్యారు. ఈ సమయంలోనే బాబుకు ఒక గొంతు కావాల్సి వచ్చింది. ఆ గొంతే కొమ్మారెడ్డి పట్టాభిరామ్.
2019 ఎన్నికలు ముగిసే వరకూ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అంటే ఎవరో ఆ పార్టీ వారికే తెలియదు. విజయవాడలో క్యాటరింగ్ వ్యాపారం చేసే కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ను చంద్రబాబు ఎంపిక చేసుకున్నారు. పార్టీ అధికార ప్రతినిధి హోదా కల్పించారు. బాబు ఆదేశాల మేరకు టీడీపీ నాలెడ్జ్ సెంటర్ నుంచి వచ్చే స్క్రిప్ట్‌లను కొమ్మారెడ్డి పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో చదవడం మొదలెట్టారు. క్రమంగా పట్టాభినే టీడీపీ వాయిస్‌ను వినిపించడం మొదలుపెట్టారు. నిత్యం ప్రెస్‌మీట్లు, పలు అంశాలపై విమర్శలు, ఆరోపణలు.. ఇలా సాగింది పట్టాభి ప్రయాణం.
Also Read : Pattabhiram Absconded – అజ్ఞాతంలోకి పట్టాభి.. ఆ భయమే కారణమా..?
ఏదైనా పరిధిలోపు ఉన్నంత వరకు మాత్రమే అంతా సజావుగా జరుగుతుంది. పరిధి దాటితే.. ఇక ఆ ప్రయాణంలో ఇబ్బందులు తప్పవు. బాబు వాయిస్‌ని వినిపించే క్రమంలో.. తెలిసే పట్టాభి ఆ గీత దాటారు. సీఎం వైఎస్ జగన్‌పై అసభ్యకరమైన భాష వాడి అడ్డంగా బుక్కయ్యారు. కేసు నమోదు, అరెస్ట్ జరిగింది. ముందుగా బాబు ఇచ్చిన అభయం మేరకు.. అరెస్ట్ అయిన ఒకట్రెండు రోజుల్లోనే పట్టాభి బయటకు వచ్చారు. అయినా ఆయనలో అరెస్ట్ భయం తగ్గలేదు. అందుకే దేశం విడిచి మారిసస్‌కు వెళ్లిపోయారు. మళ్లీ ఎప్పుడు వస్తారో తెలియదు. ఒక వేళ వచ్చినా.. మునుపటిలా టీడీపీలో పని చేస్తారా..?అన్నది అనుమానమే.
పట్టాభి పలికేది బాబు మాట అయినా.. దెబ్బ తగులుతుంది తనకే. తాను చేసే పని ఫలితం తన వరకే ఉండదు.. కుటుంబాన్ని తాకుతుందని సీఎం వైఎస్ జగన్‌ను దూషించిన రోజు సాయంత్రం పట్టాభికి తెలిసి వచ్చుంటుంది. తనకు భార్య పిల్లలు ఉన్నారన్న విషయం రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో గడిన రాత్రి గుర్తుకు వచ్చుంటుంది. పట్టాభి తెలివిగలవాడైతే… ఇకపై బాబు మాటలకు తాను గొంతు అవ్వడు. అదే జరిగితే చంద్రబాబు మరో గొంతును వెతుక్కోక తప్పదు.