Idream media
Idream media
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడుపై బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. చాన్స్ దొరికినప్పుడల్లా ఆయనపై విరుచుకుపడుతున్నారు. పోలవరంలో నిధుల గోల్ మాల్ నుంచి.. దేవాలయాల కూల్చివేతలు, హౌసింగ్ స్కామ్ లు, అమరావతి భూ కుంభకోణాలు ఇలా ఏదో అంశంపై ఆరోపణలు కురిపిస్తూనే ఉన్నారు. ఇవన్నీ ఒక ఎత్తయితే.. బాత్రూమ్ ల నిధులు కూడా చంద్రబాబు దోచేశారంటూ సోము వీర్రాజు పదే పదే ప్రస్తావిస్తున్నారు. ఒకే విషయాన్ని లేవనెత్తుతూ బాబుపై సోము బురద జల్లుతున్నా ఆయన నుంచి కానీ, టీడీపీ వర్గాల నుంచి కానీ దీనిపై స్పందన రాకపోవడం చర్చనీయాంశంగా మారుతోంది. మౌనం అంగీకారం అనుకోవాలా..? టీడీపీ హయాంలో బాత్రూమ్ నిర్మాణాల్లోనూ అవినీతి జరిగిందా..? అనేది తెలియాలి.
పార్టీ వర్గాలే విస్మయం..
ఏపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచీ సోము వీర్రాజు అధిష్టానం అంచనాలకు తగ్గట్టే వ్యవహరిస్తున్నట్లుగా కనిపిస్తోంది. మొదటి టార్గెట్ ప్రతిపక్షాన్ని నీరుగార్చే పనిలో కొంత మేరకు సఫలం అయినట్లే ఏపీ పరిణామాలు కనిపిస్తున్నాయి. సోము మొదటి రోజు నుంచి చంద్రబాబుపై విరుచుకుపడుతున్నారు. దీంతో టీడీపీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. అయినప్పటికీ ఆ పార్టీపై నోరు తెరిచి విమర్శించే ధైర్యం చంద్రబాబులో లేనట్లు కనిపిస్తోంది. ఇందుకు కారణం ఎలాగైనా బీజేపీకి దగ్గర కావాలని ఆయన ఆలోచించడమేనని ప్రచారం జరుగుతోంది. ఇదే అవకాశంగా తీసుకున్న బీజేపీ నేతలు మరింత రెచ్చిపోయి చంద్రబాబు, టీడీపీపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా చంద్రబాబుపై సోము వీర్రాజు మరోసారి ఘాటు విమర్శలు చేశారు. చివరికి కేంద్రం ఇచ్చిన బాత్రూం నిధుల్ని కూడా చంద్రబాబు దోచుకున్నారని విమర్శించారు. చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో కేంద్రం రూ.40 వేల కోట్లు కేటాయిస్తే ఆయన ఏమాత్రం అభివృద్ధి చేయలేదన్నారు. పైగా ఎన్‌ఆర్‌ఈజీఎస్ కింద హౌసింగ్ బాత్రూమ్‌ల నిధులు కూడా దోచేశాడని సోము వీర్రాజు అన్నారు. సోము ఏ ఆరోపణలు చేసినా చంద్రబాబు స్పందించకపోవడంపై పార్టీ వర్గాలే విస్మయం వ్యక్తం చేస్తున్నాయి.