Idream media
Idream media
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీని బతికించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారా..? కొత్త కేడర్ ను పెంపొందించుకోవడంతో పాటు తొలి నుంచీ తనతో కలిసి వస్తున్న సీనియర్లలో ఉన్న అసంతృప్తిని తొలగించేందుకు చర్యలు చేపట్టబోతున్నారా..? ప్రధానంగా పార్టీలో లోకేష్ ఎంట్రీ తర్వాత సీనియర్లకు, పార్టీకి మధ్య ఏర్పడిన గ్యాప్ ను తగ్గించేందుకు త్వరలో పార్టీ ప్రముఖులతో భేటీ కాననున్నారా..? అంటే అవునన్నట్లుగానే పార్టీ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. తిరుపతి ఉప ఎన్నిక అనంతరం ఇంటికే పరిమితమైన చంద్రబాబు అక్కడి నుంచే వరుసగా సీనియర్లతో ఫోన్ చేసి మాట్లాడుతున్నారట. ఇప్పటి వరకూ ఎప్పుడో కలిసినప్పుడో, ఏదైనా సందర్భం వచ్చినప్పుడో మాత్రమే పలకరించే బాబు.. ఇప్పుడు స్వయంగా ఆయనే ఫోన్ చేస్తున్నారట. టీడీపీ పూర్వ వైభవం కోసం ఏం చేయాలో, ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలో నివేదికతో సిద్ధంగా ఉండాలని, త్వరలో భేటీ అయి పార్టీలో మారిన పరిస్థితులు సహా.. లోకేష్ వ్యవహారంతో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా..? అనే అంశంపై కూడా చర్చిద్దామని పేర్కొంటున్నట్లుగా పార్టీ వర్గాల్లో టాక్..!
రాష్ట్ర విభజన అనంతరం అధికారంలోకి రాగానే, అమరావతి బ్రాండ్ పేరుతో మరో పది, పదిహేనేళ్లుగా తమకు తిరుగు ఉండదని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు భావించారు. ఇందుకోసం భారీ సెట్టింగ్ లు, గ్రాఫికల్ ప్రజంటేషన్ లతో మాయా లోకాన్ని సృష్టించారు. అది పూర్తి అయ్యే వరకూ రాజకీయాల్లో అనుభవం ఉన్న నాయకుడే రాష్ట్రానికి అధిపతిగా ఉండాలనే ప్రచారం ప్రారంభింపచేశారు. అయితే, తొలి ఐదేళ్లలోనే ఆయన సత్తా ఏంటో ప్రజలకు తెలిసిపోయింది. అనుభవం ఒక్కటే సరిపోదని, చేయాలనే తపన, కష్టపడి పని చేసే తత్వం ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ప్రజలు భావించి తదనంతర ఎన్నికల్లో వైఎస్. జగన్ కు పట్టం కట్టారు. కుర్చీ ఎక్కిన వెంటనే జగన్ అనూహ్య నిర్ణయాలు తీసుకుంటూ అందరూ ఆశ్చర్యపోయేలా పాలనను కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలో ప్రతిపక్షాలకు భవిష్యత్ లేకుండా పోతోంది. వరుస ఓటములతో దాన్ని గుర్తించిన చంద్రబాబునాయుడు దిద్దుబాట చర్యలు ప్రారంభించినట్లు తెలుస్తోంది.
ఆయన కుమారుడు మాజీ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలోనే పార్టీ నడుస్తోందనే అభిప్రాయం సీనియర్లలో వ్యక్తం అవుతుండడంతో దానిపై కూడా చర్చకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. లోకేష్ రాకతో సీనియర్లకు, పార్టీకి మధ్య పెరిగిన గ్యాప్ ను తగ్గించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారట. అతి త్వరలోనే పార్టీలో ఆది నుంచి తనతోపాటు నడిచిన సీనియర్లతో సమావేశమై చర్చించనున్నట్లు తెలుస్తోంది. లోకేష్ వల్ల పార్టీలో ఎక్కువ గ్యాప్ ఏర్పడితే.. మొత్తానికే పార్టీకి ప్రమాదమని.. చంద్రబాబు భావిస్తున్నారు.
సీనియర్ల విషయానికి వస్తే.. “మేం బాబు హయాంలో పనిచేయడానికి ఓకే. కానీ లోకేష్ చెబితే.. చేసేది లేదు“ అని కొందరు కరాకండీగానే చెబుతున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇలాంటి వారు తమకు ఆప్షన్గా బీజేపీని ఎంచుకుంటున్నారని, ఈ క్రమంలో టీడీపీ పైనా విమర్శల వర్షం కురిపిస్తున్నారని ప్రచారం సాగుతోంది. ఏదో విధంగా సీనియర్లు అందరూ పార్టీలోనే కొనసాగేలా చేసుకునేందుకు చంద్రబాబు ప్రయత్నాలైతే మొదలు పెట్టారు. మరి ఎంత వరకు సక్సెస్ అవుతారో వేచి చూడాలి.